ETV Bharat / state

దేవుడి సాక్షిగా 'పట్టు'దల: నెమలి గుడిలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం!

ఎన్టీఆర్ జిల్లాలోని గుడిలో దేవుడి సాక్షిగా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు- పట్టువస్త్రాల సమర్పణలో ప్రొటోకాల్ రగడ- ఎంపీ చేతిలోంచి వస్త్రాలు లాక్కున్న ఎమ్మెల్యే, అడ్డుకున్న ఎంపీ అనుచరులు

ETV
KESINENI CHINNI VS KOLIKAPUDI (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 5:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

MP vs MLA Row Over Temple Ritual : ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న వారి విభేదాలు దేవుడి సన్నిధికి చేరాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య కొద్ది రోజులుగా నెలకొన్న వివాదం బయటపడింది. సాక్షాత్తూ నెమలి వేణుగోపాల స్వామి వారి కల్యాణోత్సవం సాక్షిగా ఈ ఇరువురు నేతల మధ్య, వారి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

పట్టు వస్త్రాల విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం (ETV)

గంపలగూడెం మండలంలో నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందింది. సోమవారం రాత్రి ఈ ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ఏర్పాటైంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సరిగ్గా అదే సమయానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనానికి విచ్చేశారు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా తన కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఆలయ అధికారులు, అర్చకులు ప్రొటోకాల్ ప్రకారం ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు.

పట్టువస్త్రాల వివాదం : కల్యాణోత్సవంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే క్రమంలో ఆలయ ఈవో సంధ్య, ప్రధాన అర్చకులు ముందుగా ఎంపీ కేశినేని చిన్ని వద్దకు వెళ్లారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి సమర్పించాల్సిన పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ చేతికి అందించారు. ఆ వెంటనే పక్కనే ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేతికి కల్యాణ తలంబ్రాలను ఇచ్చారు. సరిగ్గా ఇక్కడే అసలు వివాదానికి బీజం పడింది. తనకు తలంబ్రాలు ఇచ్చి, ఎంపీకి పట్టువస్త్రాలు ఇవ్వడంపై ఎమ్మెల్యే కొలికపూడి తీవ్ర అసహనానికి గురయ్యారు. తక్షణమే ఆయన ఎంపీ కేశినేని చిన్నికి ఎదురుగా వెళ్లి నిలబడ్డారు. 'పట్టువస్త్రాలు ఏవీ? నా చేతికి ఇవ్వండి' అంటూ ఈవోను, అర్చకులను తన చేతులు ముందుకు చాచి అడిగారు. దీంతో అర్చకులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. దీంతో ఎంపీ కేశినేని చిన్ని వెంటనే స్పందించి, చిరునవ్వు నవ్వుతూ ఆ పట్టువస్త్రాలను ఎమ్మెల్యే తీసుకోవడానికి వీలుగా వదిలేసి ఆయన పక్కకు జరిగారు.

ఇరు వర్గాల నాయకులు తోపులాట : దీంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ పట్టువస్త్రాలను వెంటనే తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ వస్త్రాలను తన తలపై పెట్టుకున్నారు. స్వామివారికి సమర్పించేందుకు వేదిక వైపు ముందుకు కదిలారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ రంగంలోకి దిగారు. పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి తలమీద నుంచి తిరిగి లాక్కునేందుకు ఆయన ప్రయత్నించారు. ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు కలియబడ్డారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇది గమనించిన ఎంపీ కేశినేని చిన్ని తన వర్గం నేతలను, అనుచరులను వారించారు. 'ఇది దేవుడి సన్నిధి. ఇక్కడ ఎలాంటి వివాదాలు వద్దు. అందరూ సైలెంట్​గా ఉండండి' అని సున్నితంగా మందలించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా సాధారణ భక్తులు కూర్చునే ప్రదేశానికి వెళ్లారు. అక్కడి నుంచే స్వామివారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.

ఎమ్మెల్యే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు : మరోవైపు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరిగి వచ్చారు. తన కుటుంబంతో కలిసి స్వామివారి వేదిక ముందు ఉన్న వీఐపీ కుర్చీల్లో కూర్చున్నారు. అయితే కొద్దిసేపటికే టీడీపీ నేతల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కొలికపూడిని రెచ్చగొట్టేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు మళ్లీ తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే కుర్చీలోంచి ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని వైపు కోపంగా చూసి, పరుష పదజాలంతో మాట్లాడారు. దీంతో అక్కడే ఉన్న ఇతర టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను ఎలాగోలా శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే పరుషంగా మాట్లాడుతున్నా ఎంపీ కేశినేని చిన్ని మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ప్రశాంతంగా కూర్చుని స్వామి కల్యాణోత్సవం కార్యక్రమం ముగిసే వరకు భక్తితో అక్కడే ఉన్నారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ, నెమలి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేణుగోపాలస్వామిని వేడుకున్నానని తెలిపారు. ఆలయాన్ని మరింతగా ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న కాలంలో ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగయ్యేందుకు ఉత్సవాలు ముగిసిన అనంతరం అధికారులతో చర్చిస్తామన్నారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నెమలి వేణుగోపాల స్వామి వారి మహోత్సవాలు జరిగాయన్నారు.

రామోజీ ఫిల్మ్​సిటీలో మార్చి 14న సినీ మ్యాజికల్ గ్లో రన్​

శిక్షణ లేని కార్మికులతో బాణసంచా తయారీ - ఎప్పుడు పేలుతాయో తెలియని పరిస్థితి