ETV Bharat / state

'కనకదుర్గమ్మ ఆస్తుల పరిరక్షణే ధ్యేయం' - పాలకమండలి సమావేశంలో 37 అంశాలపై సుదీర్ఘంగా చర్చ

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలకమండలి సమావేశం - సుమారు 37 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన సభ్యులు - కనకదుర్గమ్మ దేవస్థానం ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నామని వెల్లడి

Kanaka_Durga_Temple_Board_Meeting
Kanaka_Durga_Temple_Board_Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 13, 2026 at 8:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kanaka Durga Temple Governing Body Meeting: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానం ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా కీలక అడుగులు వేయబోతున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వీకే శీనాయక్‌ తెలిపారు. ఛైర్మన్‌ గాంధీ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధానంగా ఆలయ భూముల రక్షణ, మాస్టర్ ప్లాన్ అమలు, భక్తుల సౌకర్యాల మెరుగుదలపై తదితర అంశాలపై సభ్యులు తమ సూచనలు చేశారు. దేవస్థానానికి ఉన్న 234 ఎకరాల సాగు భూములపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని బోర్డు నిర్ణయించిందని సభ్యులు అన్నారు.

ఇందులో వివాదాల్లో ఉన్న సుమారు 20 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి విముక్తి చేసేందుకు న్యాయపరమైన చర్యలు వేగవంతం చేయనున్నట్లు పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ తెలిపారు. దేవస్థానం భూముల కౌలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కౌలు మొత్తాన్ని నిర్ణయించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ఛైర్మన్‌ తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడు పరిధిలో ఇప్పటికే 5 ఎకరాల భూమిని కాపాడగలిగామని, మిగిలిన 11 ఎకరాల లోటస్ ల్యాండ్‌ మార్కు వద్ద భూమి విషయంలోనూ కలెక్టర్ ద్వారా వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రి సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన 'మాస్టర్ ప్లాన్' పనులపై బోర్డు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

కనకదుర్గమ్మ దేవస్థానం పాలకమండలి సమావేశం (ETV Bharat)

భక్తులు ఇబ్బందులు పడకుండా టీవీలు ఏర్పాటు: భక్తుల కోసం అత్యంత కీలకమైన కొత్త లడ్డు పోటు, అన్నప్రసాద భవనాలను మే నెలాఖరు లేదా జూన్ రెండో వారంలోగా ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్‌- ఎన్​ఐఆర్​ఎం - సర్వే నివేదిక ఆధారంగా, రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సెకండ్ ఘాట్ రోడ్, క్యూ కాంప్లెక్స్, మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి భారీ ప్రాజెక్టులను మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్నామని పేర్కొన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో వారు ఇబ్బందులు పడకుండా పెద్ద ఎత్తున టీవీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా అమ్మవారి పూజలు, ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు.

ఇందుకు దాతల సహకారం తీసుకుంటామని అలానే కనకదుర్గా నగర్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు బోర్డు కఠిన నిర్ణయం తీసుకుందని ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ తెలిపారు. భక్తులు కాని వ్యక్తులు, గంజాయి బ్యాచ్‌లు ఇక్కడ తిరుగుతున్నట్లు గుర్తించామని, ఇకపై రెండు ప్రత్యేక గేట్లు ఏర్పాటు చేసి ఆధార్ కార్డు లేదా పూజా టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్రమబద్ధంగా లోపలికి అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. గత దసరా, భవానీ దీక్షల సమయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారికి వెంటనే చెల్లింపులు జరిపేలా ఆదేశించినట్లు ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీ చెప్పారు.

మండుటెండల్లోనూ చల్లని దర్శనం - దుర్గమ్మ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

12 ఏళ్లకోసారి వచ్చే మహా ఘట్టం - ఇంద్రకీలాద్రిపై 'మహా కుంభాభిషేకం'