ప్రతి 30 కిలోమీటర్లకో క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్సు
సంక్రాంతి సెలవుల సందర్భంగా సొంతూళ్ల బాట - ప్రమాదం జరిగినా వెంటనే అందుబాటులో వైద్యం - ప్రతి 30 కిలో మీటర్లకు ఒక ఒక క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్సు

Published : January 11, 2026 at 8:09 AM IST
National Highway Congested With Vehicles : సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకు వాహనాలు ఒకదాని వెనక ఒకటి బారులు తీరాయి. వాహనల రద్దీతో గంట ప్రయాణానికి మూడు, నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రయాణాలు సాఫీగా సాగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
ఒక్కరోజే 60 వేల మంది : సంక్రాంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈనెల 18 వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్‌లో నివాసం ఉండే వారంతా సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్-విజయవాడ వాహనాల రద్దీ మొదలైంది. శనివారం ఒక్కరోజే తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 60 వేల వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు.
సంఖ్య మరింత పెరిగే అవకాశం : ఇవాళ మరింత రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది భోగికి ముందు రోజు పంతంగి టోల్ ప్లాజా మీదుగా సుమారు 80 వేలకుపైగా అంతకుముందు రోజు 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఈసారి కూడా అదే స్థాయిలో వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ ప్రాధికార సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది.
టోల్ ప్లాజా వద్ద ఆలస్యం కాకుండా : ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టాగ్‌ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద నాలుగు హ్యాండ్ మిషన్లు, ఒక స్టిక్ మిషన్‌ను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి మొత్తం 273 కిలోమీటర్లు మేర ఉంటుంది. చౌటుప్పల్ శివారు పంతంగి కేతేపల్లి వద్ద కొర్లపహాడ్ ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. మూడు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్సును ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలో మీటర్లకు ఒక క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్సు 60 కిలోమీటర్లకు ఒక టోయింగ్ వెహికిల్ ఏర్పాటు చేశారు.
"డీఎమ్హెచ్ఎస్ సర్ ఆదేశాల మేరకు పెద్దకాపర్తి దగ్గర ఫస్ట్‌ఎయిడ్ సెటర్ పెట్టాం. అందరూ ఆంధ్రాకు ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లు బాగా రద్దీగా మారాయి. అందుకే ఇక్కడ ఆక్సిడెంట్ జరిగినా కూడా వెంటనే వైద్యం అందాలనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాట్లు చేశాం. ఇంకా పెద్ద ప్రమాదం జరిగితే వెంటనే నల్గొండ ఆసుపత్రికి పంపిస్తాం." - వైద్యురాలు
ట్రాఫిక్ నివారణ చర్యలు : సంక్రాంతి సందర్భంగా విజయవాడ, గుంటూరు, ఖమ్మం వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. దాంతో రహదారులపై రద్దీ బాగా పెరిగిపోయిందని పోలీస్ తెవిపారు. అందుకనే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇక్కడ పికెట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి ప్రయాణం సాఫీగా సాగాలనే ఉద్దేశ్యంతో ఈ పికెట్ నిర్వహిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం సాఫీగా సాగేలా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 24గంటలూ వాహనాల రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.
ఎలాంటి అసౌకర్యం ఉండకూడదని : హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పెద్ద ఎత్తున సొంత కార్లు, వ్యక్తిగత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి వెళుతున్నారు. వారాంతం కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి భారీ రద్దీగా మారింది. అందుకే తమ సొంతూళ్లు వెళ్లే కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది.
హైదరాబాద్-విజయవాడ హైవేపై ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం : మంత్రి కోమటిరెడ్డి
సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారికి షాక్ - జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్

