ఈ జాతీయ రహదారి ఇంకెందరిని బలితీసుకుంటుందో!
నిర్మాణ దశలో వెహికల్ అండర్ పాస్ - విజయవాడ- హైదరాబాద్ హైవేపై అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదం - ఎల్.బి.నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు 15 కిలోమీటర్ల మేర బ్లాక్ స్పాట్స్

Published : January 6, 2026 at 1:31 PM IST
|Updated : January 6, 2026 at 1:37 PM IST
Vijayawada - Hyderabad Highway : హైదరాబాద్ నగరం గుండా పలు జాతీయ రహదారులు వెళుతుంటాయి. వాటన్నింటిలో మిగిలిన వాటి సంగతేమో గానీ, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. కారణం మూడేళ్ల క్రితం చేపట్టిన ఆరు లైన్ల విస్తరణ పనులు నత్తనడక సాగుతూ ఉండడమే. అనేక చోట్ల పనులు అసంపూర్తిగా వదిలివేయడంతో నగరంలో పనామా కూడలి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ప్రయాణం ప్రమాదభరితంగా మారింది.
ఈ మార్గంలో రోడ్డు అటు నుంచి ఇటు దాటడం అంటే యుద్ధంలో గెలుపుతో సమానం. ఈ రహదారిపై ప్రమాదాల బారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు సంక్రాంతి కూడా సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. అక్కడ వాహనదారులు, స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం.
ఎల్.బి.నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు : దేశంలోనే అత్యంత కీలకమైన జాతీయ రహదారుల్లో ఒకటి హైదరాబాద్-విజయవాడ మార్గం. హైదరాబాద్‌ను చెన్నై, కోల్‌కతాలతో అనుసంధానించే ఈ రహదారిపై నిత్యం వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. మొత్తం 231 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని 4 నుంచి ఆరు వరసలుగా విస్తరించడానికి మూడేళ్ల క్రితం అడుగులు పడి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ పనులు జరుగుతున్న తీరే ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం గుండా సాగే మార్గంలో పనులు నత్తనడక సాగుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఈ మార్గం ఎల్.బి.నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. అసంపూర్తి పనుల వల్ల ఈ మార్గంలో వాహనదారులు, రోడ్డు దాటే వారికి నిత్యం నరకయాతనే.
కావాల్సినన్ని బ్లాక్ స్పాట్స్ : హైదరాబాద్‌లో విజయవాడ జాతీయ రహదారిపై అక్కడా ఇక్కడా అని లేదు, అడుగడుగునా సమస్యలే. పనామా, సుష్మా, ఆటోనగర్, భాగ్యలత, హయత్ నగర్, లక్ష్మారెడ్డి పాలెం ఇలా ప్రతిచోట స్థానికులు రోడ్డు దాటాలంటే స్థానికులకు చుక్కలు కనిపిస్తాయి. ప్రధానంగా భాగ్యలత నుంచి లక్ష్మారెడ్డి పాలెం వరకు రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. రహదారి విస్తరణ పనుల్లో ఇంత జాప్యంపై ఎందుకు అని అడిగే ప్రయత్నం చేస్తే ఆర్ అండ్ బీ అధికారులు మాట్లాడేందుకు ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
"ఈ అండర్ పాస్ పనులు ఎందుకు మధ్యలోనే ఆగిపోయాయో మాకెవరికీ అర్థం కాలేదు. పనులు ఇలా ఆగిపోవడం వలన మేం చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ ఇంటి నుంచి బయటకు రాగానే మెయిన్ రోడ్ వస్తుంది. అలా కాకుండా మాకు ఒక సర్వీసు రోడ్ కావాలి. దాని కోసం ముందు ఈ అండర్ పాస్ పనులు పూర్తవ్వాలి. ప్రభుత్వం దీన్నిపై శ్రద్ధ తీసుకుని ఒక రెండు, మూడు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం." - సత్యనారాయణ, గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్
వెహికల్ అండర్ పాస్ నిర్మాణం : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పనామా కూడలి వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని నిర్ణయించారు. పనులను ప్రారంభించి 5 పిల్లర్లను కూడా నిర్మించారు. అయితే ఏడాది నుంచి ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ పనులు ఎందుకు ఆగిపోయాయి, తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఆల్టర్నేటివ్ ఏమైనా ప్లానింగ్ ఉందా ఇవేవీ ప్రజలకు తెలియదు. అడిగితే సమాధానం చెప్పే నాథుడు కూడా లేడు. ఇలా ఒక పద్దతిపాడు లేకుండా పనులు జరుగుతున్న తీరుపై ప్రజా ప్రతినిధులు, ప్రజలు మండిపడుతున్నారు.
వేగవంతం చేయాలని కోరిక : రహదారి విస్తరణ పనులు చేపట్టేది ట్రాఫిక్ కష్టాలు తీర్చి ప్రయాణం సాఫీగా సాగేలా చేయడం కోసం. అయితే హైదరాబాద్‌లో విజయవాడ జాతీయ రహదారి పనులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతున్నాయి. ప్రజలకు నిత్య నరకం చూపిస్తున్నాయి. అందువల్ల వాటిని వేగవంతం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై ఎక్కడిపనులు అక్కడే - ఈ సంక్రాంతికి సేఫ్‌గా ఇంటికి చేరుకుంటామా?

