నకిలీ మద్యం కేసు - జోగి రమేష్ సోదరుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత
జోగి రమేష్‌కు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో దక్కని ఊరట - ఈనెల 31 వరకు నిందితులకు రిమాండ్ పొడిగించిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 18, 2025 at 7:10 PM IST
Court Rejected Bail Petitions of Jogi Ramesh Brothers : నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు చుక్కెదురైంది. జోగి రమేష్ సోదరుల బెయిల్ పిటిషన్లని కొట్టివేస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 11 మంది బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దన్ రావు, ఆదేపల్లి జగన్మోహన్ రావుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. మరో ఏడుగురు నిందితుల నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నకిలీ మద్యం కేసులో నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగియటంతో నిందితులను విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులకు ఈనెల 31 వరకు రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు కారాగారంలో ఉన్న 13 మంది నిందితులను విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.
మరి కొంతమంది నిందితులు ములకలచెరువు కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు మదనపల్లి జైల్లో జ్యుడీషియల్ డిమాండ్‌లో ఉన్నారు. తాను 50 రోజుల నుంచి జైల్లో ఉంటున్నానని నిందితుడు జోగి రమేష్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమను నెల్లూరు జైలు నుంచి విజయవాడ జైలుకు మార్చాలని కోర్టుని జోగి రమేష్ కోరడంతో నెల్లూరు నుంచి విజయవాడ జిల్లా జైలుకి మారుస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
SIT Charge Sheet on Fake Liquor Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేషేనని (ఏ-18) సిట్ ఇప్పటికే తేల్చిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్‌రావుకు (ఏ-1) రూ.3 కోట్లు ఇస్తానని ఆశపెట్టి పావుగా వాడుకుని నేరపూరిత కుట్ర నడిపించినట్లు గుర్తించింది. ఈ నకిలీ మకిలిని కూటమి ప్రభుత్వానికి పూయాలనే దురుద్దేశంతో ఈ కుట్రకు పాల్పడినట్లు తెలిపింది.
నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించడం, అంతకుముందే జనార్దన్‌రావును ఆఫ్రికాకు పంపించడం లాంటివి అన్నీ జోగి రమేషే చేశారని వెల్లడించింది. ఈ మేరకు దాఖలు చేసిన 55 పేజీల ప్రాథమిక అభియోగపత్రంలో సిట్ ఈ వివరాలన్నీ పేర్కొంది. 8 మంది నిందితులపై అభియోగాలు మోపింది. నకిలీ మద్యం దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.9 కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
Technical Evidence in Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. నిందితుల పాత్రను నిరూపించే పలు ఆధారాలు వారి ఫోన్లలోనే లభ్యమయ్యాయి. వారి మధ్య సాగిన చెల్లింపులు, వాటి తాలూకూ స్క్రీన్‌షాట్లు, లేబుళ్ల డిజైన్లు, సంభాషణలు పక్కాగా దొరికాయి. నిందితులు ఉపయోగించిన ఫోన్ నంబర్ల తాలూకు సీడీఆర్ (కాల్ డీటెయిల్ రికార్డ్స్)లు, టవర్ లొకేషన్లను సిట్, ఎక్సైజ్ అధికారులు సంబంధిత సర్వీసు ప్రొవైడర్ల నుంచి సేకరించారు.
ఇబ్రహీంపట్నంలో శ్రీకారం: ఇబ్రహీంపట్నంలోనే ఈ నకిలీ మద్యం కుట్రకు బీజంపడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు (ఏ1) ఫోన్ నంబరు లొకేషన్ ఇబ్రహీంపట్నంలోనే 549 రోజులు చూపించింది. ఈ రోజుల్లో 31,000 పైగా కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో నంబరు 14000కు పైగా కాల్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ 522 రోజులు ఇక్కడే ఉన్నట్లు చూపించింది. అద్దేపల్లి జగన్మోహన్‌రావు (ఏ2) ఫోన్ నుంచి 36,000 కాల్స్ ఉన్నాయి. 684 రోజులు ఇదే లొకేషన్ చూపించింది. ఇక్కడి నుంచే కుట్ర సాగిందనడానికి ఇవి కీలకంగా తోడ్పడ్డాయి. క్షేత్రస్థాయిలో రవాణా పరంగా కట్టా రాజు (ఏ6) ప్రధాన పాత్ర పోషించాడు.
నకిలీ మద్యం కేసు - గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు
నకిలీ మద్యం కేసులో మరో కీలక కోణం - జోగి సోదరులకు అద్దేపల్లి బ్రదర్స్ ముడుపులు

