ETV Bharat / state

ఏపీ మద్యం కుంభకోణం కేసు - నిందితుల రిమాండ్‌ పొడిగింపు

ఈనెల 16 వరకు రిమాండ్‌ పొడిగించిన విజయవాడ ఏసీబీ కోర్టు - నేటితో రిమాండ్‌ గడువు ముగియనుండటంతో నిందితులను కోర్టులో హాజరుపరిచిన సిట్‌ అధికారులు

Court Extends Remand Of Accused in Liquor Case
Court Extends Remand Of Accused in Liquor Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 8:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

ACB Court Extends Remand Of Accused in Liquor Case : ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఈనెల 16 వరకు రిమాండ్ గడువును పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో రిమాండ్ ముగియనుండటంతో ఏసీబీ కోర్టులో నిందితులను హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం 16 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులు విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్​లో ఉన్నారు.

ఈ కేసులో 49వ నిందితుడిగా ఉన్న అనిల్ చోక్రాకు ఆస్తమా ఉందని, తాగేందుకు వేడి నీటిని అందజేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. దీనిపై పిటీషన్ దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది. గోవిందప్ప బాలాజీ, మిథున్ రెడ్డిలు కోర్టుకు హాజరుకాకపోవటంతో ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చేశారు. చాణక్య రిమాండ్ గడువు పెంపుకు ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటీషన్​లో 2 పేరాలపై చాణక్య తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటిని రికార్డు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

మరోవైపు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రామును ఎక్సైజ్‌ పోలీసులు విచారిస్తున్నారు. నేటి నుంచి 3 రోజులపాటు విచారణ కొనసాగనుంది. ఎక్సైజ్‌ పోలీసులు విజయవాడ జిల్లా జైలు నుంచి ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు.

విడతల వారీగా రూ.1.18 కోట్లు : మాజీ మంత్రి జోగి రమేష్‌కు ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు నుంచి విడతల వారీగా రూ.1.18 కోట్లు ముట్టిందని ఇప్పటికే సిట్‌ తేల్చిన విషయం తెలిసిందే. అందులో రూ.45.06 లక్షలను జోగి రమేష్‌ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు జోగి రాముకు నేరుగా అందజేయగా, మరో రూ.72.90 లక్షలను స్వర్ణ డెవలపర్స్‌ (జోగి రమేష్‌ సొంత సంస్థ) బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్‌ ఖాతా నుంచి జోగి రమేష్‌ వ్యక్తిగత ఖాతాలోకి భారీ మొత్తాల్లో మళ్లింపులు జరిగినట్లు నిర్ధారించింది.

జగన్‌ హయాంలో జోగి రమేష్‌ నేతృత్వంలో, ఆయన అండదండలతో అద్దేపల్లి జనార్దనరావు ఇబ్రహీంపట్నం పాత ఏఎన్‌ఆర్‌ బార్‌ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడిపించారని, హైదరాబాద్‌ నుంచి ఏపీలోకి సుంకం చెల్లించని మద్యం తీసుకొచ్చి ఇక్కడ బార్‌లలో విక్రయించేవారని గుర్తించింది. అందుకు ప్రతిఫలంగానే ఎప్పటికప్పుడు జోగి రమేష్‌కు సొమ్ములు ముట్టజెప్పేవారని వెల్లడించింది.

ఆయా బ్యాంకు లావాదేవీల వివరాలు, మనీ ట్రయల్, కాల్‌ డేటా రికార్డులు, టవర్‌ లొకేషన్లు, శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో సిట్‌ ఈ గుట్టు రట్టు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సిట్‌ అధికారులు బుధవారం అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు. జోగి రమేష్‌ (ఏ18), ఆయన సోదరుడు జోగి రాము (ఏ19) సహా మొత్తం 13 మందిపై అభియోగాలు మోపారు. ప్రధానాంశాలివీ.

రూ.18.68 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు

  • వెలగపూడి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో జోగి రమేష్‌ బ్యాంక్‌ ఖాతాలో 2019 ఆగస్టు 21 నుంచి 2025 అక్టోబరు వరకూ మొత్తం 33 లావాదేవీల ద్వారా రూ.18.68 కోట్లు జమయ్యాయి. ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలే.
  • స్వర్ణ డెవలపర్స్‌ ఖాతాలోకి చెక్‌లు, ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ ద్వారా 2021 నవంబరు నుంచి 2025 నవంబరు మధ్య రూ.5.61 కోట్లు జమయ్యాయి. ఇవీ అసాధారణంగానే ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకులోని రమేష్‌కు సంబంధించిన మరో ఖాతాలో రూ.3.81 కోట్లు జమయ్యాయి.

అవి సహజ మరణాలు కావు - జంగారెడ్డిగూడెం ఘటనపై సిట్‌ నివేదిక

హైదరాబాద్ టు ఇబ్రహీంపట్నం - ఈ మద్యం బాటిళ్లు అక్కడివే: విచారణలో వెల్లడించిన నిందితులు