తెలుగును కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 36వ విజయవాడ పుస్తక మహోత్సవం - పుస్తకాలు చదవడం అనే సంస్కృతిని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్న జస్టిస్ శ్రీనరసింహ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 1:26 PM IST
Vijayawada 36th Book Festival Inauguration : మాతృభాషపై ప్రతి ఒక్కరూ రుణం తీర్చుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ తెలిపారు. భాషపై మమకారం కూడా బంధుత్వమేనని చెప్పారు. నగరాల్లో తెలుగుభాష తగ్గిపోతోందని ప్రస్తుతం ఉన్న ఒకటి రెండు తరాలు భాష పరిరక్షకులు కావాలని విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభ సభలో జస్టిస్ శ్రీనరసింహ ఆకాంక్షించారు.
36 ఏళ్లుగా కొనసాగించడం సామాన్యమైన విషయం కాదు : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తకమహోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ ముఖ్య అతిధిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. బీవీ పట్టాభిరామ్ పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు చేసి చిత్రపటానికి జస్టిస్ శ్రీనరసింహ నివాళులు అర్పించారు. ప్రతి మంచి పుస్తకానికీ తనదైన వ్యక్తిత్వం ఉంటుంది, అలాగే జీవలక్షణం కూడా ఉంటుందని తెలిపారు. చాలా పుస్తకాలు తక్కువ రోజుల్లోనే చనిపోతున్నా కొన్ని పుస్తకాలు దీర్ఘాయుష్షుగా ఉంటున్నాయని అన్నారు.
పాఠకులతో పుస్తకాలు తమదైనా బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించే అవకాశం తనకు లభించడం అదృష్టమన్నారు. అంతేకాకుండా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పద్యాన్ని ఆయన ప్రస్తావించారు. తన విద్యాభ్యాసమంతా ఆంగ్లమాధ్యమంలో జరిగిందని చెప్పారు. తెలుగు మాట్లాడితే తరగతుల్లో కొట్టేవారని తెలిపారు. తన తండ్రి సూచన మేరకు ఈనాడు పత్రికను తెప్పించుకుని తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నానని జస్టిస్ శ్రీనరసింహ వెల్లడించారు. పుస్తకాలు చదవడం అనే సంస్కృతిని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని విజ్ఞప్తి చేశారు. పుస్తక మహోత్సవాన్ని 36 ఏళ్లుగా కొనసాగించడం సామాన్యమైన విషయం కాదంటూ నిర్వాహకులను అభినందించారు. పిల్లలు పుస్తకాలు చదివేలా పుస్తక మహోత్సవాన్ని సందర్శించేలా తల్లిదండ్రులు వారిని తీసుకురావాలని కోరారు.
నిజమైన పాఠకులంతా పుస్తకాలవైపు మళ్లుతున్నారు : రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు సభకు అధ్యక్షత వహించారు. ఎలక్ట్రానిక్ తెరలపై పుస్తకాలను చదవడం ఇబ్బందికరమైంది అందుకే నిజమైన పాఠకులంతా మళ్లీ పుస్తకాలవైపు మళ్లుతున్నారని కె. రఘరామకృష్ణంరాజు అన్నారు. త్వరలో టికెట్టుకొనైనా పుస్తక మహోత్సవాలకు హాజరయ్యే స్థాయిలో పుస్తకాల పట్ల ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో పుస్తకమహోత్సవానికి స్థలం కేటాయించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను పునరుజ్జీవింపజేయాలని, ప్రభుత్వాలకున్న పరిమితులను అర్థం చేసుకుంటూ, ఈ పనికి రాష్ట్రంలోని భాషాభిమానులూ, పుస్తకప్రియులంతా నడుంకట్టాలని పిలుపునిచ్చారు.
ఘనత పుస్తకాలదే : సాహిత్య అకాడమీ పురస్కార విజేత డాక్టరు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పుస్తక ప్రచురణకర్తలు రచయితలకు పురుడుపోసే మంత్రసానిలాంటివాళ్లన్నారు. గూగుల్ గురువుకు ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆత్మీయ అతిధిగా పాల్గొన్న సీపీఎం జాతీయ నాయకులు కె. నారాయణ మాట్లాడుతూ కొత్త రాజధాని అమరావతిలో పుస్తకమహోత్సవానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రంధాలయోద్యమమే స్వాతంత్య్రోద్యమానికి దారి తీసిందని గుర్తుచేశారు. పుస్తకాలను సమాజానికి మరింత అందుబాటులోకి తేవడం పుస్తకమహోత్సవాల వల్లనే సాధ్యమన్నారు. స్వరాజ్యమైదానాన్ని పుస్తకమహోత్సవానికీ ప్రజలకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వ నిర్వాకంపై తనదైన శైలిలో నారాయణ మండిపడ్డారు. ఏడాదిలో రెండు సార్లు పుస్తకమహోత్సవాన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. అనాదిగా సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత పుస్తకాలదేనని తెలిపారు.
సమాజం, శాస్త్ర విజ్ఞానం, వ్యవస్థల పనితీరునూ పరిణామ క్రమాన్నీ అద్దం పడుతూన్నాాయని పాత్రికేయులు, అప్పరసు కృష్ణారావు తెలిపారు. భవితకు మార్గదర్శనం చేయగల శక్తి పుస్తకాలకు ఉందని వివరించారు. పుస్తక పఠనం పట్ల యువత ఆసక్తి పెరుగుతోందని ఇటీవల హైదరాబాద్‌లో విజయవంతమైన పుస్తక ప్రదర్శన నిదర్శనంగా పత్రికా సంపాదకులు కె. రామచంద్రమూర్తి తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షులు టి. మనోహర్‌నాయుడు, కార్యదర్శి కె. లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈనెల 12వ తేదీ వరకు జరగనున్న ఈ పుస్తక మహోత్సవంలో మొత్తం 314 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
"తెలుగు మాట్లాడితే తరగతుల్లో కొట్టేవారు. నా తండ్రి సూచన మేరకు ఈనాడు పత్రికను తెప్పించుకుని తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నాను. తెలుగును కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. ప్రతి మంచి పుస్తకానికీ తనదైన వ్యక్తిత్వం ఉంటుంది, అలాగే జీవలక్షణం కూడా ఉంటుంది. చాలా పుస్తకాలు తక్కువ రోజుల్లోనే కనబడకుండాపోతున్నా కొన్ని పుస్తకాలు మాత్రం చిరకాలం ఉంటున్నాయి. పాఠకులతో పుస్తకాలు తమదైనా బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయి. ప్రతిష్ఠాత్మకమైన పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించడం అదృష్టం" - జస్టిస్ శ్రీనరసింహ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తెలుగు వెలుగుల వేడుక 'అనురాగ సంగమం' నేడే ప్రారంభం
ఐరాస సదస్సులో తెలుగులో మాట్లాడారు -తెలుగు రాష్ట్రాల నుంచి సునీత ఒక్కరే

