ETV Bharat / state

పాఠకులను ఆకట్టుకుంటున్న 36వ పుస్తక మహోత్సవం - 240కి పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలు

పురాతనమైన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు ప్రదర్శన - డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ ఈగల్ టీం ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు - విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా అకడమిక్ పుస్తకాల కొనుగోలు

VIJAYAWADA 36TH BOOK FESTIVAL
VIJAYAWADA 36TH BOOK FESTIVAL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 10:58 AM IST

2 Min Read
Choose ETV Bharat

Vijayawada 36th Book Festival : పుస్తక పఠనం వల్ల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చని పాఠకులు అంటున్నారు. విజయవాడ పుస్తక మహోత్సవాన్ని సందర్శించి నచ్చిన పుస్తకాన్ని కొనుగోలు చేసి కొత్త అనుభూతిని పొందుతున్నారు. వేలాదిగా వస్తున్న పుస్తక ప్రియులతో ఇందిరా గాంధీ మున్సిపల్‌ మైదానానికి కొత్త కళ వచ్చింది. గ్రంథాలయ శాఖతోపాటు ఈగల్‌ బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

240కి పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలు : విజయవాడ 36వ పుస్తక మహోత్సవానికి భారీగా తరలివస్తున్న పుస్తక ప్రియులు, స్టాళ్లను పరిశీలించి, అభిరుచులకు తగ్గట్లు కొత్త పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. 240కి పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంచారు. నవలలు, జీవిత చరిత్రలు, కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, విప్లవ సాహిత్య పుస్తకాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. స్థానికులే కాకుండా పక్క జిల్లాల ప్రజలూ తరలివస్తున్నారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు అకడమిక్ పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. యువత రోజులో కొద్దిసేపు పుస్తకాన్ని చదవడానికి కేటాయించాలని పాఠకులు సూచిస్తున్నారు.

విజయవాడ 36వ పుస్తక మహోత్సవం (ETV Bharat)

పురాతనమైన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు : గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. పురాతనమైన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు ప్రదర్శనకు ఉంచారు. 1955 పురుషోత్తపట్నంలో గ్రంథాలయాన్ని పెట్టాలని అనుకున్నప్పుడు నిర్వాహకులు NTRను కలవగా, అప్పట్లో ఆయన 25 రూపాయలు ఇచ్చి, వారిచ్చిన పుస్తకంలో అభినందనలు రాశారంట. ఆ నోట్ బుక్​ను పుస్తక మహోత్సవంలో ప్రదర్శనకు ఉంచారు. సీఎం అయ్యాక అత్యధిక గ్రంథాలయాలను NTR ఏర్పాటు చేశారని నిర్వాహకులు చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ బుక్​ ఫెయిర్​కు వచ్చే వారికి ఈగల్ టీం ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటుచేశారు.

ఈ నెల 12వ తేదీ వరకూ బుక్‌ ఫెయిర్‌ : పుస్తక మహోత్సవ ప్రాంగణానికి ప్రధాన సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్, వడ్లమూడి విమలాదేవి, ప్రతిభా వేదికకు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్‌ నార్లీకర్‌ పేర్లను ఈ ఏడాది పెట్టారు. ఈ నెల 12వ తేదీ వరకూ బుక్‌ ఫెయిర్‌ కొనసాగుతుంది. ఈనెల 12వ తేదీ వరకు జరగనున్న ఈ పుస్తక మహోత్సవంలో మొత్తం 314 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. శని, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.

అయితే ఈ పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనరసింహ ప్రతి మంచి పుస్తకానికీ తనదైన వ్యక్తిత్వం ఉంటుంది, అలాగే జీవలక్షణం కూడా ఉంటుందని ప్రారంభ వేడుకలో తెలిపారు. చాలా పుస్తకాలు తక్కువ రోజుల్లోనే చనిపోతున్నా కొన్ని పుస్తకాలు దీర్ఘాయుష్షుగా ఉంటున్నాయని అన్నారు. పాఠకులతో పుస్తకాలు తమదైనా బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయన్నారు. ప్రతిష్ఠాత్మకమైన పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించే అవకాశం తనకు లభించడం అదృష్టమన్నారు. అంతేకాకుండా కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ పద్యాన్ని ఆయన ప్రస్తావించారు. పుస్తక మహోత్సవాన్ని 36 ఏళ్లుగా కొనసాగించడం సామాన్యమైన విషయం కాదంటూ నిర్వాహకులను అభినందించారు. పిల్లలు పుస్తకాలు చదివేలా పుస్తక మహోత్సవాన్ని సందర్శించేలా తల్లిదండ్రులు వారిని తీసుకురావాలని కోరారు.

తెలుగును కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనరసింహ

'ఈసారి సంక్రాంతి అదిరిపోద్ది' - కారవాన్ టూరిజం స్ఫెషల్ ప్యాకేజీలు!