సమాజంలో శాస్త్ర, సాంకేతికతపై నమ్మకాన్ని పెంపొందించాలి: వెంకయ్య నాయుడు
హైదరాబాద్ నగరంలోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్‌లో ల్యాబ్ టూ సొసైటీ-రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ వీబీ-2047’ కార్యక్రమం - శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేరవేయాలన్నవెంకయ్యనాయుడు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 4:40 PM IST
Venkaiah Naidu on Science and Technology : సమాజం కోసం ఆలోచించడం, పని చేయడం ‘ఈనాడు’ డీఎన్‌ఏలోనే ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. శాస్త్రీయ అంశాలకు పత్రికలో ప్రముఖ స్థానం కల్పిస్తోందని ఆయన ప్రశంసించారు. తెలుగు పత్రికా రంగంలో విప్లవాన్ని సృష్టించిన రామోజీరావు ఒక ధ్రువతార అని వెంకయ్యనాయుడు కీర్తించారు. హైదరాబాద్ నగరంలోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్‌లో ‘ఈనాడు’ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ల్యాబ్ టూ సొసైటీ-రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ వీబీ-2047’ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగించారు.
తెలుగు పాఠకులకు శాస్త్ర విజ్ఞానం అందించాలి : క్రమశిక్షణ, అంకితభావం, దూరదృష్టి రామోజీరావు సొంతమని వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు పాఠకులకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలని ఆయన ఎంతో తాపత్రయపడ్డారని అన్నారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేరవేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాస్త్ర, సాంకేతికతపై నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'ఈనాడు'లో జ్ఞాననేత్రం : దీనిపై అవగాహన పెంచే బాధ్యత శాస్త్రవేత్తలు, నిపుణులు తీసుకోవాల్సిన అవసరముందని వెంకయ్యనాయుడు అన్నారు. శాస్త్రవిజ్ఞానం నాలుగు గోడల మధ్యే ఆగిపోకూడదని, ప్రతీ ఒక్కరికీ చేరాలన్నారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఉత్సుకతను మరింత పెంచాలని ఆయన కోరారు. క్లిష్టమైన సైన్స్ అంశాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ‘ఈనాడు’లో జ్ఞాననేత్రం శీర్షికన ప్రచురిస్తున్నారని తెలిపారు. సైన్స్‌పై ఎంత ఆదరణ పెంచగలిగితే ఆ రంగంలో దేశం అంత ముందుంటుందన్నారు.
మన దేశంలో మేధస్సుకు కొదవ లేదని, రామానుజం, శకుంతలా దేవి, సీవీ రామన్ వంటి ప్రముఖులు దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని వెంకయ్యనాయుడు తెలిపారు. అబ్దుల్ కలాం వంటి మహానుభావులు స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహాలు, క్షిపణులను తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకోవడం సంతోషించదగ్గ విషయమన్న ఆయన, శాస్త్ర విజ్ఞానంలో అగ్రస్థానంలో భారత్ ఉండాలన్నదే మన లక్ష్యమన్నారు. మానవ జీవన నాణ్యత పెంచడంలో శాస్త్ర సాంకేతికత పాత్ర చాలా కీలకమైనదని వివరించారు. ఈ రంగంలో దూసుకెళ్లేందుకు ఎన్నో ప్రైవేటు సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కృషి వల్లే ఆహార రంగంలో భారత్ స్వయం సమృద్ధిని సాధించిందన్నారు.
"ఈ రోజుల్లో ఏఐ గురించి విస్తృతంగా మాట్లాడుకుంటున్నాం. ఏఐ పరిజ్ఞానం వెనుక కీలక పాత్ర పోషించేది డేటా సైన్స్. వివిధ గణాంక నమూనాలకు ఆధారం కల్యంపూడి రాధాకృష్ణరావు పరిశోధనలే. ప్రచారం లభించకపోయినా తెరవెనక ఉన్న ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తల కృషిని స్మరించుకోవాలి. ఎల్లాప్రగడ సుబ్బారావు వంటి మహానీయులు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఉండాలి. వారు చేసిన కృషిని ప్రోత్సహిస్తూ ఉండాలి. వారి నుంచి స్ఫూర్తిని పొందేందుకు యువతను ప్రోత్సహించాలి. మన మేధస్సును వ్యవస్థీకృతం చేయాలి. అది ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లనే మనం పరిశోధన పత్రాల విషయంలో వెనకబడ్డాం. మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పరిశోధనల దిశగా మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది"- వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందుకెళ్తోందని అన్నారు. సైన్స్ అంటే కేవలం ల్యాబ్‌లో చేసే పరిక్షలు కావని సమాజానికి అత్యంత అవసరమైన అంశమని ఆమె తెలిపారు. సైన్స్ వ్యాప్తికి సోషల్ లిజనింగ్ ముఖ్యమైన అంశమని అన్నారు. వికసిత్ భారత్ కోసం ముూడు పనులు చేయాలన్నారు. వాటిలో మొదటిది వినడం, రెండోది విశ్వసనీయత ఉన్న వ్యక్తులచే మేసేజింగ్, క్షేత్రస్థాయి పనితీరు అని వివరించారు.
"మానవ మెదడు మొదటి ఐదేళ్లలో బాగా వృద్ధి చెందుతుంది. ఆ సమయంలో పోషకాహారం చాలా కీలకం. పిల్లలు, యువత పోషకాహార లోపంతో ఉండకూడదు. దీనిపై అవగాహన చాలా తక్కువగా ఉంది. పాలసీ మేకర్స్‌తో శాస్త్రవేత్తలు సంయుక్త విషయ విశ్లేషణ చేయాలి. ప్రతీ శాస్త్రవేత్త ప్రధాన లక్ష్యం ప్రజా హితమే. జర్నలిస్టులు కూడా క్యూరియస్‌గా ఉండాలి" -డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్
‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు : గడిచిన 51 ఏళ్లుగా ఈనాడు పత్రిక శాస్త్ర విజ్ఞానాన్ని జనాలకు అందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తోందని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. ఈనాడుతో పాటు ఈటీవీ, ఈటీవీ భారత్, ఈనాడు డిజిటల్, ఈనాడు రేడియో విభాగం కూడా శాస్త్రీయ అంశాలను కవర్ చేయడంలో ముందుటాయని పేర్కొన్నారు. ఇలాంటి సైన్స్ పండుగలో తాము కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత్ సైన్స్‌కి పవర్ హౌస్ అన్న ఆయన మాతృభాషలో సైన్స్ బోధనను సమర్ధించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్‌టీసీ గౌరవ అధ్యక్షుడు డా.ఆర్‌బీఎన్ ప్రసాద్, ఎస్‌ఏసీ-ఏఎస్‌టీసీ ఛైర్మన్ డా.సీహెచ్ మోహన్‌రావు, డబ్ల్యూహెచ్‌వో మాజీ శాస్త్రవేత్త డా.సౌమ్యా స్వామినాథన్, అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డా.పావులూరి సుబ్బారావు, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ డా.డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ సమావేశం తర్వాత పలువురు ప్రముఖులతో ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి. కాగా శాస్త్రీయ విజ్ఞానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగితే 2047 వికసిత్ భారత్‌లో సైన్స్ పాత్ర కీలకంగా ఉంటుందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

