మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని ఆలస్యం చేస్తున్నారు: వెంకయ్యనాయుడు
ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు - విశాఖ బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకలు - తాను ఈ స్థాయికి చేర్చడంలో ఏయూ ఎంతో దోహదం చేసిందన్న మాజీ ఉప రాష్ట్రపతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 23, 2026 at 2:53 PM IST
Venkaiah Naidu At AU Centenary Celebrations : చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల అద్భుత ప్రస్థానాన్ని పురస్కరించుకుని శతాబ్ది ఉత్సవాలు విశాఖ నగరంలో బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తాను ఈ స్థాయికి చేరడంలో ఏయూ ఎంతో దోహదం చేసిందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. అలాగే సమాజంలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.
మాతృభాష కళ్లు-ఇతర భాష కళ్లద్దాలు : ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మాతృభాష కళ్లు లాంటిది అయితే, ఇతర భాషలు కళ్లద్దాల వంటివి అని అన్నారు. కళ్లు ఉంటేనే కళ్లద్దాలకు విలువ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తాను తెలుగు మీడియంలో చదువుకుని దేశంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించానని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన మాతృభాష గుజరాతీలో చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. ఏయూ తన జీవిత గమ్యాన్ని మార్చివేసిందని వెంకయ్య నాయుడు ఉద్వేగంగా చెప్పారు. తనని ఈ స్థాయికి చేర్చడంలో ఈ యూనివర్సిటీ పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ఇక్కడి న్యాయ కళాశాలలోనే తన ఎదుగుదలకు తొలి పునాది పడిందన్నారు వెంకయ్య నాయుడు.
న్యాయవాది కావాలనే కోరిక : తన తల్లికి తాను న్యాయవాది కావాలని కోరిక ఉండేదన్నారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న పలు సమస్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండటం ఒక పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. దీనిపై మేధోమథనం జరగాలని కోరారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం సరికాదని, ఆలస్యమైనా ఆ బిల్లు అమలులోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం ఎప్పుడూ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరించలేదని, ప్రపంచశాంతి కోసమే పరితపించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు సామ్రాజ్యవాద కాంక్ష వల్లే వస్తున్నాయని, భారత్ తిరిగి విశ్వగురువు కావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు.
"మనం ఎప్పుడూ సామ్రాజ్య వాదన చేయలేదు. కొన్ని దేశాల సామ్రాజ్య వాదన ధోరణి వల్లే యుద్ధాలు వస్తున్నాయి. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని ఆలస్యం చేస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకుండా ఉంటే ఎలా? బిల్లు ఇవాళ కాకపోతే రేపైనా అమల్లోకి వస్తుంది. కొత్త టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకోవాలి" - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
దేశాన్ని నడిపించే వారే నిజమైన హీరోలు - వ్యవస్థలను మార్చే శక్తిగా యువత ఎదగాలి: పవన్ కల్యాణ్
LIVE: ఏయూ శతాబ్ధి ఉత్సవాలు - మెగా కల్చరల్ ఫెస్ట్ - హాజరైన పవన్‌కల్యాణ్ - ప్రత్యక్షప్రసారం

