ETV Bharat / state

పెళ్లికి సర్వం సిద్ధం - వధువు నుంచి ఒక్క 'సారీ' మెసేజ్ - కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్

వేంపల్లె మండలంలో పెళ్లింట ఊహించని ఘటన - లక్షలు ఖర్చు పెట్టించి పెళ్లికి ముఖం చాటేసిన లేడి - అమ్మ ఉరివేసుకుంటుందంటూ వరుడికి వధువు ఫోన్ కాల్

Vempalle Marriage Fraud Case
Vempalle Marriage Fraud Case (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 11:54 AM IST

3 Min Read
Choose ETV Bharat

Vempalle Marriage Fraud Case : ఇల్లంతా పెళ్లి సందడి. బంధువుల కోలాహలం. వీధిలో షామియానా, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు. ఊరందరికీ విందు భోజనాలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా, అంతా బాణసంచా కాల్చి మురిసిపోయారు. వధువు ఎప్పుడు వస్తుందా అని వరుడు ఫోన్ చేశాడు. అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాసేపటికి 'సారీ' అని ఒకే ఒక్క మెసేజ్. కంగారు పడి మళ్లీ కాల్ చేస్తే, 'పెళ్లి చేసుకుంటే మా అమ్మ ఉరి వేసుకుంటుంది' అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ ఒక్క మాటతో పెళ్లింట తీవ్ర గందరగోళం నెలకొంది. మోసపోయామని గ్రహించిన వరుడు పోలీసులను ఆశ్రయించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కడప జిల్లా వేంపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రసాదు అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. వారం రోజులుగా ఆ ఇంట పెళ్లి పనుల హడావిడి కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజామున ప్రసిద్ధ గండి క్షేత్రంలో వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికే ఇంటి ముందు తోరణాలు కట్టారు. వీధిలో షామియానా వేశారు. రాత్రి వేళ జిగేల్‌మనేలా విద్యుత్తు దీపాలతో వీధంతా అందంగా అలంకరించారు. అప్పటికే సిద్ధం చేసిన నోరూరించే ఆహార పదార్థాలతో ఊరందరికీ భోజనాలు కూడా వడ్డించారు. పెళ్లి చేసుకునేందుకు గండి క్షేత్రానికి వెళ్తున్నామని అందరికీ తెలిసేలా బాణసంచా కూడా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఆ ఒక్క కాల్‌తో అంతా తలకిందులు : అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో వరుడికి ఓ సందేహం వచ్చింది. వధువు తన ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుందో కనుక్కుందామని ఫోన్‌ చేశాడు. అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వరుడు కంగారు పడ్డాడు. పదే పదే ఫోన్‌ చేయడంతో చివరికి 'సారీ' అనే చిన్న మెసేజ్ వచ్చింది. ఆందోళన చెందిన అతను మళ్లీ మళ్లీ ఫోన్‌ చేశాడు. చివరికి స్పందించిన వధువు, 'నేను రావడం లేదు. పెళ్లి చేసుకుంటే మా అమ్మ ఉరి వేసుకుంటానంటోంది' అని బదులిచ్చి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసింది. ఈ దెబ్బతో పెళ్లి వారితో పాటు గ్రామస్థులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అమ్మాయి తరఫు బంధువులెవరో కూడా వీరికి తెలియదు. కేవలం వధువుతో మాత్రమే పరిచయం ఉండటంతో ఏంచేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

అసలు కథ ఇలా మొదలైంది : మోసం వెనుక అసలు కథ ఏడాది కిందట మొదలైంది. కడపకు చెందిన ఓ యువతి పులివెందుల పశుసంవర్ధక శాఖలో ఉద్యోగం చేస్తోంది. వేంపల్లె మండలానికి చెందిన పెళ్లికాని ప్రసాదుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వయసులో తనకంటే పెద్దదైనా, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రసాదు ఆసక్తి చూపాడు. వీలైనప్పుడల్లా ఇద్దరూ కారులో షికార్లు చేశారు. ఒకసారి రైతులకు ఇవ్వాల్సిన పశువుల దాణా రెండు బస్తాలను ప్రసాదు కుటుంబానికి ఆమె ఉచితంగా ఇచ్చింది. దీంతో కాబోయే కోడలు చాలా మంచిదని అతని తల్లిదండ్రులు సైతం మురిసిపోయారు. నమ్మకం కుదరడంతో పెళ్లికి నాలుగు రోజుల ముందు ఇద్దరూ హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ రూ. 1.50 లక్షలతో పెళ్లి దుస్తులు కూడా కొనుగోలు చేశారు.

ముందే రెండు పెళ్లిళ్లు : చివరి నిమిషంలో యువతి పెళ్లికి ముఖం చాటేయడంతో మోసపోయానని బాధితుడు గ్రహించాడు. బుధవారం రాత్రి నేరుగా వేంపల్లె పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన వేంపల్లె పోలీసులు తమదైన శైలిలో ఆరా తీశారు. పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలిసింది.

ఆ యువతికి అప్పటికే రెండు వివాహాలు జరిగాయని తేలింది. ఈ విషయం తెలుసుకున్న వరుడు నివ్వెరపోయాడు. అంతేకాదు, సదరు యువతి ప్రసాదు చిన్నాన్న కుమారుడి నుంచి కూడా దుస్తుల కొనుగోలు పేరుతో రూ. 40 వేల వరకు ఖర్చు చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్‌తోనే ఆమె వరుడికి వలవేసి డబ్బులు లాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'కాంట్రాక్ట్ వధువు - కహానీ ముచ్చట్లు' - ఈ పెళ్లిలో సినిమాను మించిన ట్విస్ట్!

కి'లేడీ' వివాహాలు.. ఆరుగురిని మనువాడిన మహిళ.. ఏడోసారి పెళ్లి పీటలు ఎక్కుతూ..