'మా మొర ఆలకించండి సారూ' - వెలిగొండ నిర్వాసితుల్లో పునరావాస వెలితి!
ఈ నెలఖారున వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం - పశ్చిమ ప్రకాశానికి నీళ్లు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు - భారంగా ముంపు గ్రామాల్ని వీడుతున్న కుటుంబాలు - ఇంకా కొంతమందికి ప్యాకేజీ రాలేదంటున్న నిర్వాసితులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 9:20 AM IST
Veligonda Evacuees Problems : తడారిన బీళ్లకు సాగునీళ్లొస్తున్నాయ్ రైతులు హ్యాపీ! గొంతెండిన ఊళ్లకు మంచినీళ్లు వస్తున్నాయ్ ప్రజలూ ఖుషీ! మరి ఆ జలయజ్ఞాన్ని సాకారం చేయడానికి సర్వం త్యాగం చేసిన నిర్వాసితులు ఆనందంగా ఉన్నారా? పునరావాస ప్యాకేజీ దక్కినవారి సంగతి సరే! దక్కనివారి మాటేంటి? వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రోజులు దగ్గరపడిన వేళ ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్తున్న అనేక కుటుంబాలను ఏదో తెలియని వెలితి వెనక్కిలాగుతోంది.
పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేసే వెలిగొండ ప్రాజెక్టును ఈనెలాఖరున సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7000లకు పైగా నిర్వాసిత కుటుంబాలు భారంగా సొంతూళ్లు వీడుతున్నాయి. ఇందులో 3359 కుటుంబాలు సొంతంగా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటామంటూ వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు అంగీకరించాయి. రూ.12.91 లక్షల చొప్పున ప్రభుత్వం జూన్ 29న కొంతమందికి, ఆగస్టు 19న మరికొందరికి ప్యాకేజీ ఇచ్చేసింది.
Veligonda Project Updates : ఇక ప్రభుత్వం స్థలమిస్తే ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చిన 3962 కుటుంబాలకు 7 పునరావాస కాలనీలు సిద్ధం అవుతున్నాయి. వీటిలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పశు వైద్యశాలలు, ఆలయాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. అయితే గోగులదిన్నె, తోకపల్లి, ఇందుట్ల, ఇడుపూరు-2 పునరావాస కాలనీల్లో పనులయ్యాయి. మరో మూడు కాలనీల్లో పనులు పూర్తికావాల్సి ఉంది.
వెలిగొండ నిర్వాసితుల్లో 3962 కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వాలి. వీరి పరిస్థితే ఇప్పుడు దిక్కుతోడచం లేదు. అద్దె ఇల్లు దొరకడం లేదు. పశువులు ఉంటే మరీ కష్టంగా ఉందని వాటిని కొందరు అమ్మేసుకుంటున్నారు. పునరావాస కాలనీల్లో తమకిచ్చే స్థలమైనా చూపిస్తే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవరకూ అక్కడే టెంట్లు వేసుకుని గొడ్డు,గోదాతో ఉంటామని చెబుతున్నారు. మరోవైపు వీరిలో కొందరికి ఇళ్లు అద్దెకివ్వడానికి యజమానులు ముందుకు రావడం లేదు. సామాజికంగా ఇంకా మార్పు రాకపోవడమే దీనికి కారణం.
"పిల్లలను తీసుకొని ఎక్కడ ఉండాలి? ప్రభుత్వ ఇచ్చిన డబ్బులు ఎక్కడా చాలడం లేదు. అద్దెలు పెంచేశారు. ఇళ్లు ఇవ్వడం లేదు. ఇంకా కొంతమందికి ప్యాకేజీ రాలేదు. ఏమంటే గెజిట్‌లో పేరు రాలేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం." - వెలిగొండ నిర్వాసితులు
Veligonda Project Villages Problems : మరోవైపు ఒకేసారి 7000ల కుటుంబాలు చుట్టుపక్కల అద్దె ఇళ్ల కోసం ప్రయత్నిస్తుండటంతో అద్దెలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. కుటుంబాల్లో ఎవరైనా ముసలివారు ఉంటే ఇల్లు అద్దెకివ్వడం లేదు. డిమాండ్‌ను ఆసరగా చేసుకుని ఇంటి అద్దెలు పెంచేశారని, ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని నిర్వాసితులు వాపోతున్నారు. తమకు తాత్కాలికంగా కొంతకాలం వసతి చూపేందుకు ఉన్న అవకాశాలను సర్కార్ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కొత్త కాలనీల్లో నిర్వాసితులు ఇళ్లు కట్టుకోవడానికి మరో ఆరు నెలలైనా పడుతుంది. ఆయా కుటుంబాల్లో అంతా కలిపి వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. పునరావాస కాలనీల్లో ఉన్న పాఠశాలలకు తాము నివాసం ఉన్నచోట నుంచి వెళ్లిరావడం వీరిలో చాలామంది దూరాభారమవుతుంది. ఇలాంటి పిల్లల కోసం పూర్తిస్థాయిలో పునరావాసం ఏర్పడే వరకు ఆ స్కూళ్లకు సమీపంలో వసతిగృహాలు ఏర్పాటు చేసే అవకాశాల్ని పరిశీలించాలని వారు కోరుతున్నారు.
చాలామంది నిర్వాసితులకు ఇంకా పునరావాస ప్యాకేజీ రాలేదు. 2008లో గెజిట్ నోటిఫై చేసిన తర్వాత అభ్యంతరాలు సరిగా పరిగణలోకి తీసుకోలేదనే మాట వినిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న అర్హులను జాబితాలో చేర్చలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు. అర్హులందరికీ ప్యాకేజీ ఇవ్వకుండా గ్రామాల్ని ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని కొంతమంది ఆక్రోశిస్తున్నారు.
వెలిగొండ నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదు: సీఎం చంద్రబాబు
'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' - 30 ఏళ్ల సంకల్పం నెరవేరిందని 'ఎక్స్'లో చంద్రబాబు పోస్ట్

