ETV Bharat / state

చిత్తూరు-తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ వే 92 కి.మీ పూర్తి - ప్రయోగాత్మకంగా వాహనాలకు అనుమతి

ఏపీలో మరో యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌ - చిత్తూరు-తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ వే రాకపోకలు ప్రారంభం - ప్రయోగాత్మకంగా వాహనాలు రాకపోకలు సాగించేందుకు అనుమతి

Vehicular Traffic Has Commenced on Chittoor Thatchur Expressway
Vehicular Traffic Has Commenced on Chittoor Thatchur Expressway (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 30, 2026 at 10:07 AM IST

2 Min Read
Choose ETV Bharat

Vehicular Traffic Has Commenced on Chittoor Thatchur Expressway: ఏపీలోని చిత్తూరు నుంచి చెన్నైలోని కామరాజార్ పోర్టు, కట్టుపల్లి పోర్టులను అనుసంధానం చేసే చిత్తూరు-తచ్చూరు ఆరు వరుసల గ్రీన్​ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్​ప్రెస్​ వేలో రాకపోకలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఈ ప్రాజెక్టు 116.5 కిలోమీటర్లు కాగా, అందులో 92 కిలోమీటర్లు పూర్తవ్వడంతో, వాటిలో ప్రయోగాత్మకంగా వాహనాల రాకపోకలను సాగించేందుకు ఇటీవల అనుమతించారు. దాంతో రాష్ట్రంలో మరో యాక్సెస్ కంట్రోల్ ఎక్స్​ప్రెస్ వే అందుబాటులోకి వచ్చింది.

అడ్వాన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ విధానం: ప్రధానంగా చిత్తూరు-తచ్చూరు హైవే కారిడార్​పై అడ్వాన్స్​డ్ ట్రాఫిక్ మేనేజ్​మెంట్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఇందులో 115 పాన్, టిల్ట్​ జూమ్ కెమెరాలు, 120 సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాహనాల వేగాన్ని గుర్తించే 18 పరికరాలు, వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ సిస్టమ్​లను దాదాపు 58 అమర్చారు. ఎక్కడైనా ట్రాఫిక్​కు అంతరాయం, ఇతర ఇబ్బందులేమైనా కలిగినప్పటికీ వెంటనే వీటి సహాయంతో గుర్తిస్తారు.

శరవేగంగా పూర్తి అవుతున్న ప్రాజెక్టు: రాష్ట్రంలో చిత్తూరు జిల్లా పరిధిలో 75 కిలోమీటర్లు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 41.5 కిలోమీటర్లు ఉంది. ఏపీలోని 75 కిలోమీటర్లతో పాటుగా, తమిళనాడులోని 17 కిలోమీటర్లు సైతం హైవేని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక చిత్తూరు శివారులోని గంగసాగరం నుంచి తమిళనాడులో ఉత్తుక్కొట్టై వరకు పనులు పూర్తికావడంతో అక్కడి వరకు వాహనాలను అనుమతులిస్తారు. ఆపై పనులను తమిళనాడులో చేపట్టనున్నారు. ఇది చెన్నై పెరిపరల్ రింగ్​లో చేరి రెండు పోర్టులకు వెళ్తుంది.

ప్రాజెక్టు సంబంధించిన వివరాలు

  • ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను మొత్తంగా రూ.5,488.32 కోట్లను ఖర్చు చేస్తున్నారు.
  • ఇక చిత్తూరు శివారులో అనుపల్లె, ఆర్తల, నరసింహరాజపురం, పల్లిపట్టు, నగరి, ఉతుక్కొట్టై, కుమారరాజపేట, ఎస్‌ఆర్‌పురం, వీరకావేరిరాజపురం, పొండవక్కంలలో ప్రవేశ, ఎగ్జిట్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.
  • అదే విధంగా ఈ హైవేలో ఎంత దూరం వాహనాలనేవి ప్రయాణిస్తాయో, ఆ మేరకే టోల్‌ రుసుంను వసూలు చేస్తారు.
  • తాజాగా దీనిపై వాహనాలను అనుమతించారు. ఇక రాబోయే రోజుల్లో ఎక్కువ వాహనాలు వీటిపై వెళ్లే విధంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు చూడనునుండటం విశేషం. ఆ తర్వాత టోల్‌ ఆరంభిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి - ఇక రయ్​మంటూ దూసుకెళ్లొచ్చు

విజయవాడ టు హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే - రెండు గంటల్లోనే వెళ్లొచ్చు!