ETV Bharat / state

తెలంగాణలో భారీగా తగ్గిన కూరగాయల ధరలు - కిలో టమాటా ధర ఎంతంటే?

మార్కెట్లో పడిపోయిన కూరగాయల రేట్లు - అన్నదాతల ఆందోళన - మరో రెండు వారాల పాటు కొనసాగనున్న ధరలు - సామాన్యులకు లభించిన ఊరట - వేసవి, వర్షాకాలంలో లాభాదాయకంగా ఉంటుందని రైతుల ఆశాభావం

రాష్ట్రంలో కూరగాయల ధరలు
Vegetable Prices In Telangana State (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 25, 2026 at 8:00 PM IST

|

Updated : February 25, 2026 at 8:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vegetable Prices In Telangana State : తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత నేపథ్యంలో కూరగాయల దిగుబడులు పెరగడం, మరోవైపు మార్కెట్లో అనివార్యంగా ధరలు పడిపోవడంతో రైతులకు నిరాశే తోడైంది. తెలుగు రాష్ట్రాల్లో టమాట ధర అమాంతం పడిపోవడంతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

తక్కువ ధరకే కిలో టమాటా: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా టమాటా ధరలు మరింతగా తగ్గాయి. ప్రస్తుతం కిలో 10 రూపాయలకే లభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కూరగాయల ధరలు పతనమవుతున్నాయి. హైదరాబాద్‌లో టోకు ధరల్లో కిలో టమాట రూ. 8 చొప్పున అమ్ముడుపోతుండటంతో రైతుల కష్టం చేతికి రాకుండాపోతోంది. కూలీల కొరత, ధరలు, రవాణా సమస్యలతో పాటు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసినా తీరా మార్కెట్‌కు వచ్చే సరికి ధరలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో గత 15 రోజుల కిందట టమాట కిలో ధర 30 నుంచి 40 రూపాయలు చొప్పున పలకగా ప్రస్తుతం కిలో ధర రూ. 10 కూడా అమ్ముడుపోవడం లేదని రైతులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"కూరగాయల ధరలన్నీ తక్కువగానే ఉన్నాయి. ఇంకొక 15, 20 రోజుల వరకు ఈ రేట్లే కొనసాగుతాయి. ఎందుకంటే మొదటి పంట అంతా అయిపోయింది. ఇది రెండవ సారి కావటంతో ఉత్పత్తి ఎక్కువగా ఉంది. దాంతో అన్నీ కూరగాయల రేట్లు పడిపోయాయి. టమాటా మొదట్లో కిలో రూ.40 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 10కే అమ్ముడుపోతోంది. రూ.70 పలికిన బీన్స్​ కూడా ఇప్పుడు కిలో రూ.30 అయ్యింది. ఈ విధంగా అన్నీ కూరగాయల ధరలు డౌన్​ అయ్యాయి. వాతావరణం కారణంగా టమాటాలు ఎక్కువ దిగుబడి అవుతాయి. పెట్టుబడి కూడా ఎక్కువ అవుతోంది. కూలీల ఖర్చులు, సరఫరా సమయంలో ఆటో కిరాయిలు పెరుగుతున్నాయి. దిగుబడి ఎంత ఎక్కువ వచ్చినప్పటికీ రైతులకు మాత్రం లాభం లేదు. వేసవి సమయంలో పంటలు తగ్గటంతో అప్పుడు మళ్లీ ధరలు ఎక్కువ పలుకుతాయి." - రైతులు

రెండు వారాలపాటు ఇవే రేట్లు: టమాటతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఒకేసారి తగ్గుముఖం పట్టడంతో రైతులు గగ్గోలు పెడుతోన్నారు. మరో రెండు వారాలపాటు టమాట, ఇతర కూరగాయల ధరలు ఇలా కొనసాగుతాయని టోకు వర్తకులు, చిరువ్యాపారులు, మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది రాబోయే వేసవి సీజన్లో టమాట, ఇతర పంటల సాగులో ఆశాజనకమైన ధరలు లభిస్తే తమకు తదుపరి పంటల పెట్టుబడులకు మంచి వెసులుబాటు ఉంటుందని రైతన్నలు అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి దిగుబడులు రావడంతో స్థానిక రైతులకు నష్టంగా మారిందని రైతులు తెలిపారు. వేసవి, వర్షకాలంలో పంట దిగుబడి తగ్గి ధరలు లాభాదాయకంగా ఉండవచ్చని కర్షకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాన్యులకు ఊరట: తగ్గిన కూరగాయల ధరలతో సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. పలు రకాల కూరగాయల ధరలు భారీగా పడిపోటంతో సామాన్యులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

"కూరగాయలన్నీ తక్కువ ధరలోనే ఉన్నాయి. టమాటా రేటు బాగా పడిపోయింది. కిలో టమాటా రూ.8 ఉంది. దిగుబడి ఎక్కువ ఉండటంతో కూరగాయల ధరలు తగ్గాయి. టమాటా మాములుగా 2 కిలోలు కొనేది కానీ ఇప్పుడు రేటు తక్కువ ఉండటంతో 5 కిలోలు కొన్నాను" - కొనుగోలుదారులు

చలికాలంలో మండుతోన్న కూరగాయల ధరలు - మాంసం ధరలతో పోటీ!

పండిస్తే సగం ధరకే - 'అనంత' దూరం నుంచి తెప్పించినా అందనంత రేటు

Last Updated : February 25, 2026 at 8:57 PM IST