ETV Bharat / state

ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

మొదటి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠద్వార దర్శనానికి అనుమతి - జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లూ లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం

Vaikuntha Ekadashi Darshan for VIPs in Tirumala
Vaikuntha Ekadashi Darshan for VIPs in Tirumala (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 11:52 AM IST

3 Min Read
Choose ETV Bharat

Vaikuntha Ekadashi Darshan for VIPs in Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు పుణ్యాహవచనంతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు ఉన్న సామాన్య భక్తులకు వైకుంఠద్వార దర్శనానికి అనుమతించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

తెల్లవారుజామున ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైంస్లాట్‌ టోకెన్‌ పొందినవారిని కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్‌లో ఉన్నవారిని ఏటీజీహెచ్‌ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతోందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. అనుకున్న సమయం కంటే ముందుగానే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ETV)

టోకెన్‌ ప్రింట్‌కాపీని తప్పనిసరిగా: మొదటి మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులనే వైకుంఠద్వార దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్‌ కార్డుతో పాటు డిప్‌లో కేటాయించిన టోకెన్‌ ప్రింట్‌కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ ముందస్తు సూచనలు జారీ చేసింది. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లూ లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5వేల మంది చొప్పున ఇప్పటికే ఈ-డిప్‌ ద్వారా టోకెన్లు జారీ చేశారు.

'అనుకున్న దానికన్నా ముందుగానే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించాం. టోకెన్లు ఉన్నా వారిని దర్శనానికి అనుమతి ఇస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ దర్శనం చేసుకుంటున్నారు.' - బీఆర్‌ నాయుడు, టీటీడీ ఛైర్మన్

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు: వైకుంఠ ద్వార దర్శనంలో పలువురు ప్రముఖులు తరించారు. వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి , కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీ మిథున్‌ రెడ్డి దర్శించుకున్నారు. నటుడు చిరంజీవి కుటుంబసభ్యులు, నటుడు నారా రోహిత్ దంపతులు స్వామివారిని దర్శించకున్నారు. మంత్రులు నిమ్మల, పయ్యావుల, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు.

తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులురెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, ఏపీ శాసన సభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు, మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సినీ నటుడు శివాజీ, టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా స్వామివారిని దర్శించుకున్నారు.

'వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి లక్షలాది భక్తుల కోసం టీటీడీ దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.' - పయ్యావుల కేశవ్, మంత్రి

టీటీడీ విస్తృత ఏర్పాట్లు: వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి 10 రోజుల వైకుంఠద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుద్దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అలంకరణలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. వైకుంఠ ప్రదర్శన మార్గంలోని అలంకరణకు ప్రత్యేకమైన పూలను వినియోగించారు. శ్రీవారి ఆలయం ఎదుట అలంకరణ భక్తులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాకారాలు, గోపురాలు రంగురంగుల విద్యుద్దీపాలతో మిరమిట్లు గొల్పుతున్నాయి. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులు దైవలోకాన్ని చూసిన అనుభూతి పొందేలా టీటీడీ ముస్తాబు చేసింది.

టీటీడీ కీలక నిర్ణయం - అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌

తిరుమల శ్రీనివాసుడు- కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎందుకు అవతరించాడు?