ETV Bharat / state

ఏపీవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు - తరలివచ్చిన భక్త సందోహం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏపీలో భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు - ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్తర ద్వార దర్శనాలతో మార్మోగిన ప్రముఖ దేవస్థానాలు

Vaikunta Ekadashi Celebrations In AP
Vaikunta Ekadashi Celebrations In AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 2:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vaikunta Ekadashi Celebrations In AP: ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక విశిష్టత వుందనీ, ఈ రోజున విష్ణుమూర్తి వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, ఆయనను దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం, స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలిచే ఈ రోజునే మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు: వైకుంఠ ఏకాదశి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నందిగామలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, తిరువూరు శ్రీ కోదండ రామాలయం, జగ్గయ్యపేటలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో ఉత్తరద్వార దర్శనానికి జనం పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పట్టణాలు, గ్రామాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విజయవాడ లబ్బీపేటలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను తెరిచి దర్శనానికి అనుమతించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాగునీరు, పాలు ఏర్పాటు చేశారు. గన్నవరంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు.

తరలివచ్చిన భక్త సందోహం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని ఆలయాలు తెల్లవారుజామున నుంచే భక్తులతో రద్దీగా మారాయి. కడపలోని తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య స్వామి ఆలయాలకు తెల్లవారుజామున రెండు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పూజారులు వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

కన్నుల పండువగా వైకుంఠ ఏకాదశి: అనంతపురం జిల్లా రాయదుర్గం కోటలో వెలసిన సుప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామికి అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉరవకొండ శ్రీవెంకటేశ్వరస్వామి, బెలుగుప్ప మండలం శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, కనిగిరి, పామూరు మండలాల్లోని ఆలయాలు గోవిందా నామస్మరణతో మార్మోగాయి. విష్ణుమూర్తి ఉత్తర ద్వారం ద్వారా ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తులను వివిధ పుష్పాలు, కరెన్సీ నోట్లతో అలంకరించారు.

గోదావరి జిల్లాల్లో ముక్కోటి ఏకాదశి పూజలను భక్తులు ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు బారులు తీరి స్వామివారిని భక్తులు దర్శనం చేసుకున్నారు. అమలాపురం అంబాజీపేట లంకల గన్నవరం అప్పనపల్లి బెండమూర్లంక తదితర గ్రామాలలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు కిటకిటలాడారు

తిరుమలలో స్వర్ణ రథోత్సవం: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం - రేపటి నుంచి టికెట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
ఘనంగా వైకుంఠ ఏకాదశి - కిటకిటలాడిన ఆలయాలు