హైదరాబాద్‌లో చవక ప్రయాణానికి ఎంఎంటీఎస్ - 'రైల్‌వన్'తో కొత్త ఊపు
హైదరాబాద్‌లో సవాలుగా మారిన ప్రయాణం - ప్రయాణికులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాలు - ఈ తరుణంలో ప్రాధాన్యం ఎంఎంటీఎస్ ప్రయాణానికి ప్రాధాన్యం - 'రైల్‌వన్' యాప్‌తో కొత్త ఊపు

Published : April 28, 2026 at 8:36 PM IST
MMTS services with RailOne App : హైదరాబాద్ నగర జీవనంలో రోజువారీ ప్రయాణం చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ట్రాఫిక్, ఖర్చు, సమయపాలన అనే 3 అంశాలు ప్రయాణికులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రయాణం మళ్లీ ప్రాధాన్యం పొందుతోంది. రాజేశ్ అనే ప్రైవేటు ఉద్యోగి అనుభవం దీనికి ఓ మంచి ఉదాహరణ.
రాజేశ్ అనుభవం - ఖర్చు తగ్గింపు సాధ్యం : రాజేశ్ రోజూ ఖైరతాబాద్ నుంచి హైటెక్ సిటీకి ఉద్యోగం కోసం వెళ్తుంటాడు. ప్రారంభంలో మెట్రోలో ప్రయాణించేవాడు. అయితే నెలకు దాదాపు రూ.3000 వరకు ఖర్చవుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆలోచించాడు. ఆర్టీసీ బస్‌పాస్ తీసుకున్నా ప్రయాణ సమయం ఎక్కువగా ఉండేది. చివరికి స్నేహితుడి సూచనతో ఎంఎంటీఎస్ ట్రైన్‌లో ప్రయాణించడం ప్రారంభించాడు. రోజుకు కేవలం రూ.10 మాత్రమే ఖర్చవ్వడం, సమయానికి ట్రైన్లు అందుబాటులో ఉండడం వల్ల నెలకు దాదాపు రూ.2000 వరకు ఆదా చేసుకోగలిగాడు.
ఎంఎంటీఎస్‌లో ఎందుకు ప్రయాణికుల సంఖ్య తగ్గిందంటే ? : ఒకప్పుడు ఎంఎంటీఎస్‌లో రోజుకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం అది 50 వేల మందికి తగ్గిపోయింది. ప్రధాన కారణం సమయపాలనపై ఉన్న అనుమానాలు ఇందుకు కారణమని అంటున్నారు. ట్రైన్లు ఆలస్యంగా వస్తాయని భావించి చాలామంది ఈ సేవలను ఉపయోగించకుండా దూరమయ్యారు. అయితే ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది.
‘రైల్‌వన్’ యాప్ - ప్రయాణికులకు మార్గదర్శి : ప్రస్తుతం 'రైల్‌వన్' యాప్ ప్రయాణికులకు పెద్ద ఉపశమనం అందిస్తోంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో లాగిన్ అవ్వడానికి ఐఆర్‌సీటీసీ లేదా యూటీఎస్ ఖాతా ఉపయోగించవచ్చు. కొత్తవారు మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అవ్వొచ్చు. లాగిన్ అయిన తర్వాత ప్రయాణికులు తమ స్టేషన్ వివరాలు నమోదు చేస్తే, అందుబాటులో ఉన్న ట్రైన్లు, సమయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదనంగా ఎమ్‌పిన్ లేదా బయోమెట్రిక్ ద్వారా సెక్యూరిటీ సౌకర్యం కూడా కల్పించారు. దీంతో ట్రైన్ టైమింగ్‌పై అనుమానాలు తగ్గి ప్రయాణం మరింత సులభమైంది.
ఎంఎంటీఎస్ మార్గాలు - నగరాన్ని కలిపే నెట్వర్క్ : హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ అనేక కీలక ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ మార్గంలో చందానగర్, హఫీజ్‌పేట్, హైటెక్‌సిటీ, బోరబండ, భరత్‌నగర్, ఫతేనగర్, బేగంపేట్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకాపుల్, నాంపల్లి వంటి స్టేషన్లు ఉన్నాయి.
ఇక లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మార్గంలో సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్ ద్వారా ట్రైన్లు నడుస్తాయి. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు బొల్లారం, అల్వాల్, సఫిల్‌గూడ, మల్కాజ్‌గిరి మార్గంలో సేవలు ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి కాచిగూడ, అక్కడి నుంచి ఫలక్‌నుమా వరకు కూడా ఎంఎంటీఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది.
సమయం, డబ్బు ఆదా - ఉత్తమ ప్రత్యామ్నాయం : ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రయాణం ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతోంది. తక్కువ ఖర్చుతో పాటు సమయాన్ని కూడా ఆదా చేయగలిగే అవకాశం ఉంది. 'రైల్‌వన్' యాప్ ద్వారా ట్రైన్ సమయాలు ముందుగానే తెలుసుకోవడం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది.
రాజేశ్‌లాంటి అనేక మంది ఉద్యోగులు ఇప్పుడు ఎంఎంటీఎస్ వైపు మళ్లే అవకాశం ఉంది. సరైన సమాచారం, సమయపాలన ఉంటే ప్రజలు చవక ప్రయాణాన్ని ఎంచుకుంటారని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో ఎంఎంటీఎస్ సేవలు మరింత విస్తరించి, నగర ప్రయాణానికి కీలకంగా మారే అవకాశముంది.
ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం - ప్రభుత్వం కీలక నిర్ణయం

