యురేనియం వ్యర్థాల ఎఫెక్ట్ - అందుకే ఆ ఊరు వెళ్లి పోతానంటోంది!
టెయిలింగ్ పాండ్‌లో యురేనియం వ్యర్థాల స్టోరేజ్ - ఇప్పుడు టెయిల్ పాండ్ ఎత్తు పెంపుతో భయం - పునరావాసానికి కనంకిందకొట్టాల వాసుల విన్నపం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 30, 2026 at 7:49 PM IST
KanamKinda Kottala Village Problmes : యురేనియం ఎంతో అమూల్యమైన ఖనిజం. అటువంటి ఖనిజాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేముల మండలం ఎం.తుమ్మలపల్లె వద్ద తవ్వి తీస్తున్నారు. ఇందుకుగాను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ఏర్పాటైంది. 2007లో తవ్వకాలను చేపట్టి 2013 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది.
వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందులు : ముడి ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత వెలువడే వ్యర్థాలను కనంకిందకొట్టాల సమీపంలో నిర్మించిన టెయిలింగ్ పాండ్‌లో నింపుతుంటారు. ఇక్కడే సమస్య తలెత్తుతోంది. వ్యర్థాలతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాండ్‌తోనే నష్టపోతున్నామని ఆందోళన చెందుతుండగా ఎత్తు మరింతగా పెంచేందుకు పరిశ్రమ అధికారులు ప్రయత్నాలు చేస్తుండడంపై వారంతా ఆందోళన చెందుతున్నారు.
UCIL Tail Pond Issue : కనకంకిందకొట్టాల గ్రామంలో 125 ఇళ్లు ఉన్నాయి. 500 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ 475 ఎకరాల వరకు సాగు భూమి ఉంది. అందులో అరటి, మిరప, టమాట, వేరుసెనగ, పత్తి, అలసంద, పెసర వంటి పంటలను సాగు చేసి వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవారు. 2016 తర్వాత నుంచి ఈ పరిస్థితి మారిపోయింది. యురేనియం వ్యర్థాల లీకేజీతో సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గుతూ వస్తోంది. కొందరు పంట సాగు చేయకుండా భూములను బీడుగా వదిలేశారు. పాండ్ గ్రామానికి సమీపంలో ఉండడంతో గాలిలో దుమ్ముదూళి కలిసి పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే కొందరు దద్దుర్లు, కీళ్లనొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
అధికారుల నిస్సహాయత : ప్రస్తుతం ఉన్న పాండ్‌తోనే సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇంకా ఎత్తు పెంచితే మరిన్ని వెతలు తప్పవని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, అందుకుగాను గ్రామంతో పాటు భూములను సేకరించి పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పరిశ్రమ అధికారులు మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిస్కారం తమ పరిధిలో లేదని చెబుతున్నారు. గ్రామస్థుల నుంచి వస్తున్న అభ్యంతరాలను సంస్థ ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలుపుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కనంకిందకొట్టాల వాసుల వెతలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది.
'రాజకీయం కోసమే వైఎస్సార్సీపీ బురద చల్లుతోంది - మెగా డీఎస్సీపై విశాఖలో గురువుల గర్జన
విశాఖ బీచ్‌లలో ప్రమాదాలు - యారాడలో యువకుడు గల్లంతు - లైఫ్‌గార్డ్ చొరవతో ఆర్కే బీచ్‌లో తప్పిన ముప్పు

