ETV Bharat / state

'ఎంకేఎస్‌' 200 మంది జూనియర్లను తీర్చిదిద్దారు - అందరికీ మార్గదర్శకంగా నిలిచారు: జస్టిస్‌ శ్రీనరసింహ

దివంగత ఎంకే సీతారామయ్య చిత్రపటం ఆవిష్కరణ పండగలా నిర్వహించడం అసాధారణ విషయం - సహచరులతో ఎలా ప్రవర్తించాలనే దానికి ఎంకేఎస్‌ ఒక ఉదాహరణ - సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ

Late Lawyer MKS Portrait Programme in Visakhapatnam
Late Lawyer MKS Portrait Programme in Visakhapatnam (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 10:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

Late Lawyer MKS Portrait Programme in Visakhapatnam : "వృత్తిని ఎడమ చేత్తో, ధర్మ కార్యం కుడి చేత్తో చేయాలని మా నాన్న జస్టిస్‌ కోదండరామయ్య చెప్పేవారు. అదే దివంగత న్యాయవాది సీతారామయ్య చేసి, చూపించారు" అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో ప్రముఖ న్యాయవాది, దివంగత ఎంకే సీతారామయ్య(ఎంకేఎస్‌) చిత్రపటం ఆవిష్కరణకు జస్టిస్‌ శ్రీనరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సీతారామయ్య విలువలతో కూడిన 200 మంది జూనియర్‌ న్యాయవాదులను తయారు చేశారన్నారు. ఒక వ్యక్తి కన్నుమూసినా ఆయన కీర్తి గురించి మాట్లాడుకోవడమే కాకుండా, చిత్రపటం ఆవిష్కరణను ఊరి పండగలా నిర్వహించడం అసాధారణ విషయమని పేర్కొన్నారు.

‘‘స్వతంత్ర భారతావనిని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన వంద శాతం కృషి చేశారు. ‘జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరః’ (ఎవరైతే మంచి పనులు చేస్తారో వారి కీర్తికి ఎప్పటికీ మరణ భయం లేదు) అనే కాళిదాసు శ్లోకం ఆయనకు సరిగ్గా సరిపోలుతుందని నా భావన. ఆయన వ్యక్తిగత జీవితం, క్రీడలు, వృత్తి జీవితానికి పూర్తి న్యాయం చేశారని అర్థమవుతోంది’’ అని పేర్కొన్నారు. ‘ప్రాక్టీసు చేస్తున్నప్పుడు సహచరులతో ఎలా ప్రవర్తించాలనే దానికి ఎంకేఎస్‌ ఒక ఉదాహరణ. మంచివారని, సహాయ బుద్ధి ఉన్నవారని అందరూ చెబుతున్నారు. తన బాధ్యతలు చూసుకుంటూ, సాయం చేస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలిచారు. బార్‌ అసోసియేషన్‌కు 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. క్రీడా అసోసియేషన్లు, ఆర్యవైశ్య సంఘానికి సేవలందించారు’ అని జస్టిస్‌ శ్రీనరసింహ ప్రశంసించారు.

Late Lawyer MKS Portrait Programme in Visakhapatnam
దివంగత సీనియర్‌ న్యాయవాది ఎంకే సీతారామయ్య చిత్రపటం ఆవిష్కరణలో పాల్గొన్న న్యాయమూర్తులు (EENADU)

న్యాయవాద వృత్తిలో ఆయనో బ్రాండ్‌ : న్యాయవాది సీతారామయ్య సేవలను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కొనియాడారు. జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ మాట్లాడుతూ, ‘బార్‌ అసోసియేషన్‌లో సీనియర్‌ న్యాయవాదుల చిత్రపటాలు చూసి జూనియర్లు స్ఫూర్తి పొందాలి. న్యాయవాదులు, పేదలకు న్యాయం అందించాలి. న్యాయమూర్తి ఎదుట ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి’ అని తెలిపారు. అనంతరం జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో ఎంకేఎస్‌ తన గురువు అని, ఆయనో బ్రాండ్‌ అని పేర్కొన్నారు.

జస్టిస్‌ రవి చీమలపాటి మాట్లాడుతూ, జూనియర్‌ న్యాయవాదులు ఎంకేఎస్‌ను అనుసరించాలన్నారు. జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థకు సేవ చేసిన వ్యక్తిని సమాజం ఎప్పుడూ మరిచిపోదన్నారు. జస్టిస్‌ వి.శ్రీనివాస్‌ సీతారామయ్య వాదనలు గుర్తు చేసుకున్నారు. జస్టిస్‌ హరిహరనాథశర్మ మాట్లాడుతూ, ప్రవర్తనతో వేల మందిని ప్రభావితం చేయవచ్చనే దానికి ఎంకేఎస్‌ చక్కటి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. సీతారామయ్య జూనియర్‌ న్యాయవాదులను ప్రోత్సహించేవారని జస్టిస్‌ గోపాలకృష్ణారావు తెలిపారు. 200 మంది న్యాయవాదులను తీర్చిదిద్దిన ఏకైక సీనియర్‌ న్యాయవాది సీతారామయ్య అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ కొనియాడారు.

'ఈనాడు'లో జస్టిస్‌ శ్రీనరసింహ ప్రసంగం చదివి : ‘‘ఆంగ్లంలో మాట్లాడాలని సిద్ధమై సభకు వచ్చా. ఆదివారం ఉదయం ‘ఈనాడు’ మొదటి పేజీలో జస్టిస్‌ శ్రీనరసింహ ‘మాతృ భాషతోనే గౌరవం’ అనే ప్రసంగం చదివి ఆలోచన మార్చుకున్నా. అందుకే తెలుగులో మాట్లాడుతున్నా’’ అని బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు వి.రవీంద్ర ప్రసాద్‌ వివరించారు.

అనంతరం బార్‌ అసోసియేషన్‌ సభ్యులు జస్టిస్‌ శ్రీనరసింహ, హైకోర్టు న్యాయమూర్తులను సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్, విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌ రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఎంకే శ్రీనివాస్‌ సభాధ్యక్షత వహించగా, సీతారామయ్య కుమారుడు సీనియర్‌ న్యాయవాది వెంకటేష్‌ వందన సమర్పణ చేశారు.

బూటు విసిరిన లాయర్‌పై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించం : సుప్రీంకోర్టు

'మీ కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు' - లాయర్​ను బెదిరించి రూ.52 లక్షలు వసూలు