ETV Bharat / state

శత్రు దేశాల డ్రోన్లను కూల్చే 'యూకిడ్' - ఓర్వకల్లులో దేశ రక్షణకు ఉపయోగపడే డ్రోన్ల ప్రదర్శన

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు - కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు అధ్యక్షతన డ్రోన్‌ కంపెనీల సీఈవోలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం - ప్రదర్శనలో పాల్గొన్న 150 మంది యువ ఇంజినీర్లు

Drone City in Orvaka
ఓర్వకల్లులో దేశ రక్షణకు ఉపయోగపడే డ్రోన్ల ప్రదర్శన (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 2:14 PM IST

|

Updated : August 22, 2026 at 2:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Drone City in Orvakal : ఏ రంగంలో చూసినా డ్రోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవలి భారత్‌ శత్రు దేశాలను తిప్పికొట్టడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్‌ అంతా డ్రోన్లదే అని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అధ్యక్షతన జాతీయస్థాయి డ్రోన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన 150 మంది సీఈవోలు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఓర్వకల్లులో దేశ రక్షణకు ఉపయోగపడే డ్రోన్ల ప్రదర్శన (ETV)

అత్యాధునిక సాంకేతికతతో తయారుచేసిన సరికొత్త డ్రోన్లను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఆర్కా కంపెనీ కంపెనీ సీఈవో, యువ ఇంజినీర్ సూరజ్‌ యూనివర్సల్‌ కైనటిక్‌ ఇంటర్‌సప్టర్‌ డ్రోన్‌ -యూకిడ్ అనే డ్రోన్‌ని రూపొందించారు. శత్రుదేశాలు ప్రయోగించిన డ్రోన్లను పసిగట్టి వాటిని 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల దూరం నుంచే కూల్చివేసేలా దీన్ని తయారుచేశారు. ఈ డ్రోన్‌ని నేరుగా భుజంపై పెట్టుకుని పేల్చే విధంగా డిజైన్‌ చేసినట్లు చెబుతున్నారు. ఆర్మీ కోసం ఏడాదికి 10,000ల డ్రోన్లు అవసరమవుతాయనే అంచనాతో ఓర్వకల్లు డ్రోన్ సిటీలో పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నాడు.

"ఇది అడ్వాన్స్​డ్ డ్రోన్. పైలట్​ అవసరం ఉండదు. శత్రుదేశాల డ్రోన్ ఎటు వైపు నుంచి వస్తుందో అటువైపు ఈ డ్రోన్​ ప్రయోగిస్తే దాన్ని కూల్చివేస్తుంది. దీని రేంజ్ 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆర్మీ వాళ్లు టెండర్లు పిలిచారు. వారికి డెమో ఇవ్వడం జరిగింది." - సూరజ్‌, ఆర్కా కంపెనీ సీఈవో

Orvakal Drone Roundtable Meeting : హైదరాబాద్‌కు చెందిన మరో యువ ఇంజినీర్‌ సిద్ధార్థరెడ్డి అతిపెద్ద డ్రోన్ తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు. స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసిన ఈయన బాహుబలి డ్రోన్ తయారు చేశారు. 200 కిలోల బరువున్న ఈ డ్రోన్ తుపానులు, వరదలు, భూకంపాలు సమయంలో ఆపదలో చిక్కుకున్న వారిని సులభంగా రక్షిస్తుందని చెబుతున్నారు. ఈ బాహుబలి డ్రోన్ ఎలా పని చేస్తుందో వివరించారు.

బెంగళూరుకు చెందిన మరో యువ ఇంజినీర్ ధవళ. విమానాలకు ఏటీసీ కేంద్రం ఏవిధంగా పనిచేస్తుందో డ్రోన్లకు కూడా యూటీఎం అలా పని చేస్తుందని వివరిస్తున్నారు. ఒక డ్రోన్ ఎగరేయాలంటే ఒక పైలట్ రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ హార్డ్‌వేర్ సిస్టం ద్వారా ఒకేసారి వంద డ్రోన్లను ఆకాశంలో ఆపరేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది దేశ రక్షణ రంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

రాష్ట్రంలో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేస్తుండడం గర్వంగా ఉందని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ మరో రెండేళ్లలో మొదటిదశ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే డ్రోన్ సిటీ మొదటిస్థానంలో ఉండే విధంగా చేస్తామన్నారు. దేశ రక్షణ రంగంలో సరికొత్త విప్లవానికి, విపత్తు సమయాల్లో ప్రాణాలు కాపాడే అద్భుత ఆవిష్కరణలకు ఓర్వకల్ డ్రోన్ సిటీ వేదికవుతుండటం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం.

"రానున్న రోజుల్లో డ్రోన్లు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించారు. వీటిని మరింత ఎలా అభివృద్ధి చేయాలి? వీటిని రాష్ట్రంలో ఏ విధంగా తయారు చేయాలనే దానిపై ఓర్వకల్లులో 600 ఎకరాలు కేటాయించారు. అంతేకాక దీనిని డ్రోన్ సిటీగా గుర్తించడం జరిగింది." - రామ్మోహన్ నాయుడు, కేంద్ర విమానయానశాఖ మంత్రి

రైతు కూలీల కొరతకు చెక్ పెట్టిన యువకుడు - డ్రోన్ బుకింగ్​తో ఈజీగా పొలంలో పిచికారీ

ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా సులభంగా చేరుకునేలా - డ్రోన్‌తో ఎయిర్ అంబులెన్స్

Last Updated : August 22, 2026 at 2:49 PM IST