మత్తుపదార్థాలపై దండయాత్ర - ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
పోలీస్‌స్టేషన్ వద్ద కేంద్ర, రాష్ట్ర మంత్రులు 'డ్రగ్స్ వద్దు బ్రో' పైలాన్ ఆవిష్కరణ- వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, మాదకద్రవ్యాలకు రాజధానిగా మార్చిందని ఆరోపించిన కేంద్ర మంత్రి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 12:02 PM IST
Abyudayam Cycle Yatra: 'డ్రగ్స్ వద్దు బ్రో' అంటూ 25 మంది పోలీసులు నాలుగు జిల్లాలు, 75 మండలాలు, 508 గ్రామాల్లో 51 రోజులపాటు 1,300 కి.మీ దూరం సాగించిన 'అభ్యుదయం సైకిల్ యాత్ర' శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శనివారం పూర్తయింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్, విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, వేల మంది విద్యార్థులు, పోలీసులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొని 'డ్రగ్స్ వద్దు బ్రో' అని నినదించారు.
'డ్రగ్స్ వద్దు బ్రో': మొదట ఇచ్ఛాపురంలో పోలీస్‌స్టేషన్ వద్ద కేంద్ర, రాష్ట్ర మంత్రులు 'డ్రగ్స్ వద్దు బ్రో' పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి సాంస్కృతిక ప్రదర్శనలతో రాజావారి మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు ప్రముఖులు సైకిల్ తొక్కగా, హోంమంత్రి ద్విచక్ర వాహనం నడుపుతూ వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష పాల్గొన్నారు.
గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్: ఉక్కు సంకల్పంతో పోలీసులు గంజాయి, ఇతర మత్తుపదార్థాలపై సాగిస్తున్న దండయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఆయన సంకల్పానికి దీటుగా గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేందుకు పోలీసులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, మాదకద్రవ్యాలకు రాజధానిగా మార్చిందన్నారు. దీనికి అప్పట్లో ఎంపీగా ఉన్న తను సిగ్గుపడేవాడినని తెలిపారు.
మాదకద్రవ్యాల నుంచి బయటపడకపోతే ఏపీ కూడా పంజాబ్‌లా మారే ప్రమాదం ఉందని అందుకే ఈ మాదక ద్రవ్యాల సమస్యను గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. ముగింపు కార్యక్రమంలో లక్షా 14 వేల మంది విద్యార్థులు 36 వేల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. 'మత్తు వీడండి - ప్రాణాలు కాపాడుకోండి' అంటూ ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రజలతో, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోుపుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ మంచిగా ఉందని యువత అన్నారు.
రాబోయే తరాల కోసమే పోలీసుల యాత్ర: గంజాయి, మాదకద్రవ్యాల మత్తులో పిల్లలు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుండటంతో రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పోలీసులు సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే తరాల కోసం పోలీసులు సాగించిన సైకిల్‌యాత్ర విద్యార్థులు, యువతలో చైతన్యం నింపిందని తెలిపారు. ఇప్పటివరకు మాదకద్రవ్యాల కేసుల్లో 95 మందికి శిక్షలు పడ్డాయని, 53 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని హోంమంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పులి వేషగాళ్ల ఆటలు, కోలాటం, కోయనృత్యాలు, యముడు, హనుమంతుడి వేషధారణలు, వేదిక వద్ద విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చూపరులను అలరించాయి. 30 మండలాలను కలుపుతూ సాగిన ఈ అభ్యుదయం సైకిల్ యాత్రకి విశేష స్పందన లభించింది. ఈ యాత్రలో పోలీసులతో పాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. డిసెంబరు 31న యాత్ర ముగించాల్సి ఉన్నా ప్రజల అభ్యర్థన మేరకు మరికొన్ని రోజులు పొడిగించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ 21న అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో అభ్యుదయం సైకిల్ యాత్ర ప్రారంభమైంది.
సాహిత్య, సాంస్కృతిక, హస్తకళల మేళవింపు - 3వ ప్రపంచ తెలుగు మహాసభలు
జూన్ 26న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం - నేడు ట్రయల్ రన్

