ETV Bharat / state

డ్రోన్‌ వినియోగంపై ఏపీలో తొలిసారి పీఎం లంకలో శిక్షణ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంకలో పర్యటించిన నిర్మలా సీతారామన్ - పీఎం లంకను నేను దత్తత తీసుకోవడం కాదు, ప్రజలే నన్ను దత్తత తీసుకున్నారని వెల్లడి

Central Minister Nirmala Sitharaman Tour
Central Minister Nirmala Sitharaman Tour (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 28, 2025 at 5:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nirmala Sitharaman Tour in West Godavari District : విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. మన దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్ఠలు తెచ్చే విద్య, క్రీడలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో యూనియన్‌ బ్యాంక్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రూ.18 లక్షల విలువైన కంప్యూటర్లు, సైన్స్‌ ల్యాబ్‌ తదితర మౌలిక సదుపాయాలను ఆమె ప్రారంభించారు.

పెదమైనవానిలంకలో కేంద్రమంత్రి పర్యటన: దత్తత గ్రామమైన పెదమైనవానిలంకలో నిర్మించిన సైక్లోన్‌ భవనం అనేక విధాలుగా ఉపయోగపడటం సంతోషాన్నిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పెదమైనవానిలంకలో పర్యటించిన ఆమె, తాను గ్రామాన్ని దత్తత తీసుకోవడం కాదు, గ్రామమే తనను దత్తత తీసుకుందని ఉద్వేగానికి లోనయ్యారు.

డ్రోన్‌ వినియోగంపై ఏపీలో తొలిసారి పీఎం లంకలో శిక్షణ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ (ETV Bharat)

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు: గ్రామ మహిళల మద్దతులో సైక్లోన్‌ భవనం డిజిటల్ భవనంగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన అనేక మంది దేశ, విదేశాల్లో మంచి స్థానంలో ఉన్నారని గుర్తుచేశారు. శిక్షణపై సర్వేలో పెదవానిలంక దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. డ్రోన్ల వినియోగంపై ఏపీలో తొలిసారి పీఎం (పెదమైనవానిలంక)లో శిక్షణ ఇస్తున్నారని నిర్మల అన్నారు. తద్వారా స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

" పీఎం లంకను నేను దత్తత తీసుకోవడం కాదు ప్రజలే నన్ను దత్తత తీసుకున్నారు. గ్రామాల దత్తత ప్రధాని మోదీ ఆలోచన. పీఎంలంకలోని సైక్లోన్ భవనం అన్ని విధాలుగా ఉపయుక్తం. పెదమైనవానిలంకలో నిర్మించిన సైక్లోన్‌ భవనం అనేక విధాలుగా ఉపయోగపడటం సంతోషాన్నిస్తోంది. మహిళల మద్దతుతో సైక్లోన్ భవనం డిజిటల్ భవనంగా మారింది. ఈ భవనంలోనే విశ్వకర్మ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ఉపాధి. శిక్షణ పొందిన యువత దేశ, విదేశాల్లో మంచి స్థానంలో ఉన్నారు. శిక్షణపై సర్వేలో రెండో స్థానంలో పీఎం లంక నిలిచింది. జాలర్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి. ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని ఆలోచనలు చేయాలి. డ్రోన్‌ వినియోగంపై ఏపీలో తొలిసారి పీఎం లంకలో శిక్షణ. జిల్లాలో 146 మంది జాలర్లకు ఏడాదిలో పీఎంఏవై కింద ఇళ్లు ఇవ్వాలి." - నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి

ఏడాదిలోగా గృహాలిచ్చేలా చర్యలు: ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామస్థులకు వచ్చే ఏడాదిలోగా గృహాలు పూర్తిచేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు పెదవానిలంకలో నిర్వహించిన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో నిర్మల పాల్గొన్నారు.

యువతకు దిశానిర్దేశం: అనంతరం గ్రామంలోని డిజిటల్ భవన్‌ను సందర్శించారు. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ నైపుణ్య కేంద్రాలను ప్రారంభించారు. శిక్షణ కేంద్రాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, తీరప్రాంత యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని కోరారు. తీర ప్రాంతానికి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామనీ, విద్యార్థులు బాగా చదవాలని సూచించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్​కి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా ఫిర్యాదు

ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలకు శ్రీకారం - అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు!