ETV Bharat / state

16 ఏళ్లు దాటితేనే గిగ్​ వర్కర్లుగా అర్హులు - 90 రోజులు పనిచేస్తేనే సామాజిక భద్రత

16 ఏళ్ల వయసు నిండిన వారే గిగ్​, ఫ్లాట్​ఫాం వర్కర్లుగా అర్హులని స్పష్టం చేసిన కేంద్ర కార్మికశాఖ - సామాజిక భద్రత కోడ్‌ మార్గదర్శకాల్లో వెల్లడి

16 years of Age is Eligible ton Gig Workers
16 years of Age is Eligible ton Gig Workers (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 10:07 AM IST

3 Min Read
Choose ETV Bharat

16 years of Age is Eligible ton Gig Workers : అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదు కోసం 16 ఏళ్ల వయసు నిండిన వారు మాత్రమే అర్హులని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులే సామాజిక భద్రత పథకాలకు అర్హులు అవుతారని వెల్లడించింది. ఈ పోర్టల్​లో నమోదైన కార్మికులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో పాటు డిజిటల్‌ ఐడీ కార్డు అందిస్తామని తెలిపింది.

ఈ క్రమంలో సామాజిక భద్రత కోడ్‌ ముసాయిదా మార్గదర్శకాల్లో అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు పథకం అమలును వివరించింది. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి చేసింది. ఈ రిజిస్ట్రేషన్​ సమయంలో కార్మికుడి వయసు 60 ఏళ్లు దాటినా, సంవత్సరంలో 90 రోజులు పని చేయకున్నా ఈ పథకం వర్తించదని వివరించింది.

రిజిస్ట్రేషన్‌ ఇలా : అసంఘటిత, గిగ్‌ వర్కర్లుగా కనీసం 16 ఏళ్లు నిండిన కార్మికులు సొంత డిక్లరేషన్‌పై ఆధార్, ఇతర వేరు పత్రాలతో పేర్లు నమోదు చేసుకోవాలి. పేర్ల నమోదు కోసం వేర్వేరుగా ప్రత్యేక మొబైల్‌ యాప్, పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు ప్రాంతీయ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయించాలి. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రతి కార్మికుడికి ప్రత్యేక యూఏఎన్‌ నంబరు లభిస్తుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత అసంఘటిత, గిగ్‌ కార్మికుల ఫొటో, ఇతర వివరాలతో కూడిన డిజిటల్‌ ఐడీ కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది. సామాజిక భద్రత పథకాలు ప్రకటించిన తర్వాత అర్హత నియమావళి అందుబాటులోకి వస్తుంది.

ఒక్కరోజు పని చేసినా : గిగ్‌ కార్మికుడు నెలలో ఒక్కరోజు పనిచేసినా, అగ్రిగేటర్‌ నుంచి పొందిన ఆదాయంతో సంబంధం లేకున్నప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే రోజున వివిధ అగ్రిగేటర్ల వద్ద పని చేస్తే పని చేసిన అన్ని రోజులను కలిపి లెక్కిస్తారు. ఒకే రోజున మూడు సంస్థల వద్ద పని చేస్తే మూడు రోజులు పని చేసినట్లు భావిస్తుంది. అగ్రిగేటర్లు మూడు నెలలకోసారి గిగ్‌ వర్కర్ల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. లేదంటే కార్మికులు సంక్షేమ పథకాలకు అనర్హులు అవుతారు.

సామాజిక భద్రతా నిధికి అగ్రిగేటర్లు ఎక్కువ జమ చేస్తే రీఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, 90 రోజుల్లోగా ఈ రీఫండ్‌ ఇస్తామని నిబంధనల్లో స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రం ఓ ముసాయిదాను విడుదల చేసింది. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గిగ్​ వర్కర్లు ఒక అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు పని చేయాలని, వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద అయితే కనీసం 120 రోజులు పని చేయాల్సి ఉంటుందని ప్రతిపాదించింది.

అసంఘటిత రంగాల కార్మికుల కోసం : సిగరెట్లు, బీడీ, మైనింగ్‌ వంటి పరిశ్రమల్లో పనిచేసే వారికి రోజుకు 8 నుంచి 12 గంటల వరకు పని చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఇందులో వారానికి 48 గంటలు మాత్రమే పని చేసుకోవచ్చు. అలాగే 40 సంవత్సరాలు దాటిన ఉద్యోగులందరికీ యాజమాన్యాలు ఉచిత వార్షిక వైద్య పరీక్షలు చేయించాలని స్పష్టం చేసింది. సాధారణ పని గంటలు దాటి పని చేస్తే రెగ్యులర్‌ వేతనానికి డబుల్​ శాలరీ ఇవ్వాలి. నైట్​ షిఫ్టులతో పాటు అండర్‌ గ్రౌండ్ మైనింగ్‌ వంటి అన్ని రకాల పనుల్లోనూ పనిచేయడానికి మహిళలకు వీలు కల్పించాలి. దీనికి అనుగుణంగా వారికి అవసరమైన భద్రతా చర్యలను సంస్థ యజమానులు చేపట్టాలి.

1-2 శాతం సామాజిక భద్రత నిధికి : గిగ్ వర్క్, ప్లాట్‌ఫామ్‌ వర్క్, అగ్రిగేటర్స్‌ను చట్టంలో ఇలా మొదటిసారిగా నిర్వహించారు. అగ్రిగేటర్లు అంటే ఉబర్‌, స్విగ్గీ వంటి సంస్థలు తమ వార్షిక టర్నోవర్‌లో 1-2 శాతం కార్మిక సామాజిక భద్రత నిధికి కేటాయించాలి. ఆధార్ ద్వారా సామాజిక భద్రత ప్రయోజనాలు రాష్ట్రాల మధ్య వలసలతో సంబంధం లేకుండా పూర్తిగా పోర్టబుల్‌గా ఉంటాయి. జర్నలిస్టులతో సహా డిజిటల్, ఆడియో విజువల్ కార్మికులు, డబ్బింగ్ కళాకారులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పూర్తి ప్రయోజనాలను పొందేందుకు అర్హులు అవుతారు.

4 లక్షల మంది గిగ్‌ వర్కర్లకు గుడ్​న్యూస్ - ఇన్సూరెన్స్, జాబ్ సెక్యూరిటీతో కొత్త పాలసీ రెడీ

ఇంటర్​ స్థాయి నుంచే గిగ్​ వర్కర్లుగా - 48 గంటలకు పైగా పని చేస్తున్న యువత