ETV Bharat / state

పరిశుభ్రతను గాలికొదిలేసి - అందంగా అనారోగ్యాన్ని వడ్డిస్తూ!

ప్రైవేటు హోటళ్లలో దారుణంగా వంటగదులు - అపరిశుభ్రత, నిల్వ ఆహారం, అన్నీ ఉల్లంఘనలే - మొక్కుబడి జరిమానాలతో అధికారుల నిర్లక్ష్యం

Food Adulteration in AP
ఫ్రిజ్​లో నిల్వ ఉంచిన మాంసం (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 30, 2026 at 5:13 PM IST

2 Min Read
Choose ETV Bharat

Food Adulteration in AP : ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండుకునే సమయం లేక, కొందరికి ఓపిక లేక, ఆహార పదార్థాలను బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఇదే కొందరు వ్యాపారులకు వరంగా మారింది. ఇష్టమొచ్చినట్లు కల్తీ చేసి వ్యాపారం సాగిస్తున్నారు. రోజుల తరబడి దుకాణాల్లో నిల్వ ఉన్నా వాటిని బయట పారేయకుండా వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌ ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. దీంతో చాలా మంది ఆహార పదార్థాలు తిని అనారోగ్యం బారిన పడుతున్నారు.

విజయవాడలో అత్యధిక హోటళ్ల వంట గదుల్లో అసలు పరిశుభ్రత మాటే కనిపించదు. అందుకే అధికారులు ఎప్పుడు తనిఖీలు చేపట్టినా ప్రధానంగా బయటపడేది వంట గదుల్లో అపరిశుభ్రత, నిల్వ చేసిన కూరగాయలు, మాంసం, వండిన ఆహారమే. అక్కడే వండటం ఆ పక్కనే చెత్తను పడేయడం బల్లులు, బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, దోమలు ఒకటి కాదు అన్ని జీవాలు అక్కడే కన్పిస్తుంటాయి. అందుకే కొద్దికాలం కిందట నగరంలో ఓ హోటల్‌లో బిర్యానీలో బల్లి కన్పించింది. మరో హోటల్‌లో ఇలాగే ఓ జెర్రి కన్పించింది. ఇక మళ్లీ మళ్లీ వాడే నూనెలు, ప్రమాదకర రంగులు ప్రజల ప్రాణాలనే హరిస్తున్నాయి.

Food Adulteration in joint krishna District : ఉమ్మడి కృష్ణాలో 35,000లకు హోటళ్లు, మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లున్నాయి. వీటిలో 80 శాతంపైగా వంట గదుల్లో, ఆహారం తయారీ ప్రాంతాల్లో పరిశుభ్రత ఊసేలేదు. తాజాగా నగరపాలిక అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్‌ షాపులు, టీస్టాళ్లలో తనిఖీలు చేయగా నిబంధనల ఉల్లంఘనలు కనిపించాయి. కొన్ని హోటళ్లలో వంట గదులు దారుణంగా ఉండడంతో జరిమానాలు వేశారు.

విజయవాడలోని 90 శాతంపైగా అల్పా హార హోటళ్లు, బండ్లు, పకోడీ, బజ్జీ బళ్లు వ్యాధులను వ్యాప్తిచేసే కేంద్రాలుగా మారాయి. అధికారికంగా ప్లాస్టిక్‌ను నిషేధించామని అధికారులు చెబుతుంటే చాలాచోట్ల ప్లాస్టిక్‌ రేఫర్లను టిఫిన్‌ పొట్లాల్లో వాడుతున్నారు. పకోడీ, బజ్జీ బండ్ల దగ్గర చాలాచోట్ల న్యూస్‌ పేపర్లలోనే వేసి ఇస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రమే పేపర్‌లో ఆకుపెట్టి ఇస్తున్నారు. వేడి సాంబార్, పాలు, టీ ఇప్పటికీ పాలిథిన్‌ కవర్లలోనే వేసి ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం, బిర్యానీ ప్లాస్టిక్‌ పూత ఉన్న ప్లేట్లలో వేడివేడిగా వేసి పార్సిల్‌ కట్టేస్తున్నారు.

మండల కేంద్రాల్లో అధ్వానం : బందరు నగరపాలికలో ఏళ్లుగా అసలు ప్రజారోగ్య విభాగానికి ముఖ్యఅధికారే లేరు. ఇటీవల ఒకరిని నియమించారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, గుడివాడ, పెడన, పామర్రు లాంటి పట్టణాల్లోని హోటళ్లపై అసలు అధికారుల పర్యవేక్షణే లేదు.

మరోవైపు హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నూనె పదేపదే వాడుతున్నారు. ఆహారం మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్నాడు వేడిచేసి అమ్మేస్తున్నారు. మాంసాహారం నెలలుగా డీప్‌ ఫ్రిడ్జ్‌లలో ఉంచుతున్నారు. పాడైతే ఫ్రైచేసి ఇచ్చేస్తున్నారు. వంట గదుల్లో శుభ్రత లేక ఆహారంలో బొద్దింకలు, పురుగులు, బల్లులు పడుతున్న ఘటనలు కోకొల్లలు. ప్రమాదకర టేస్టింగ్‌ సాల్ట్, రంగులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.

ఆహార భద్రతపై సర్కార్ ఫోకస్ - ఇకపై హోటళ్లు, ఆహార తయారీ సంస్థలకు రేటింగ్‌

మీరు తినేది నాణ్యమైన ఆహారమేనా? - విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రంగా నాసిరకం విక్రయం