జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగుల హర్షం - ట్రైనింగ్‌కు సన్నద్ధమవుతున్న కోచింగ్ సెంటర్లు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు హర్షం - నాలుగు దశల్లో ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో యువతలో నూతనోత్సాహం - అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేందుకు సన్నద్ధమవుతున్న కోచింగ్ సెంటర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 23, 2026 at 1:14 PM IST
AP Job Calendar 2026 : రాష్ట్ర ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిరుద్యోగ యువతలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ ప్రకటనతో అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేందుకు కోచింగ్ సెంటర్లు సన్నద్ధమవుతున్నాయి. రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లు రానుండడం అభ్యర్థులలో మరింత ఆనందాన్ని నింపుతోంది.
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మార్గం సుగమం: యువత భవిష్యత్తుకు జాబ్ క్యాలెండర్ మరో బలమైన అడుగు అని ఎంపీ చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చి ఏపీపీఎస్సీ, డీఎస్సీ సహా వివిధ నియామక సంస్థల ద్వారా నాలుగు దశల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మార్గం సుగమం చేసిందన్నారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఈ నిర్ణయం ఎంతో భరోసా కల్పిస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ భారీ ఉద్యోగాల భర్తీకి కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌తో మొత్తం నాలుగు దశల్లో నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు పూర్తయింది. ఉన్నత విద్యాశాఖకు చెందిన 1,523 పోస్టులతో ఇప్పటికే మొదటి దశ భర్తీ ప్రక్రియ మే 15నే ప్రారంభమైంది.
సెప్టెంబరు 15న రెండో దశ: గ్రూప్-1 సహా రక్షక భట నియామకాలకు ఈ దశ అత్యంత కీలకం. ఇందులో 11 డిప్యూటీ కలెక్టర్లు, 36 డీఎస్పీ సివిల్, 35 పంచాయతీరాజ్ డీడీవోలతో కూడిన 149 గ్రూప్-1 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల పరిధిలో 542 సివిల్ కానిస్టేబుళ్లు, 205 ఏఆర్ కానిస్టేబుళ్లు, 182 సివిల్ ఎస్సై, 116 ఏఆర్ ఎస్సై ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అక్టోబరు 15న మూడు, నాలుగు దశలు: మూడో దశలో 2,311 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. గ్రూప్-2 పరిధిలోని 200 డిప్యూటీ తహసీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీవో సహా మొత్తం 673 పోస్టులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు 400 ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, ట్రాన్స్‌కో, జెన్‌కో సహా వివిధ విభాగాల్లో భారీగా ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక నాలుగో దశను పూర్తిగా ఉపాధ్యాయ కొలువులకే కేటాయించారు. డీఎస్సీ ద్వారా 2,995 టీచర్ పోస్టుల భర్తీకి అదే రోజు ప్రకటన విడుదల కానుంది. జిల్లాల వారీగా సబ్జెక్టుల ఖాళీల వివరాలను డీఎస్సీలు త్వరలోనే వెల్లడించనున్నాయి.
ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీ - కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త - 10,060 పోస్టులతో 'జాబ్ క్యాలెండర్ 2026' విడుదల

