ప్రభుత్వ విద్యాలయాల్లో 'అనంత అరణ్యాలు' - ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు
వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ అనంత అరణ్యాలు కార్యక్రమం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 21, 2026 at 8:54 PM IST
Plantation in Schools Under Ananta Aranyalu Program: ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ జీ రామ్‌జీ పథకం కింద అనంత అరణ్యాలు అనే కార్యక్రమానికి డ్వామా అధికారులు శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లాలో విశాల ఆవరణలున్న గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ, మోడల్ పాఠశాలలు, 9 కేజీబీవీలు ఇందుకు ఎంపిక చేశారు. 25 సెంట్లలో 1500 నుంచి 1625 మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.
అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్: కొత్తగా చేపడుతున్న కార్యక్రమానికి అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ అని నామకరణం చేశారు. కనీసం 0.75 ఎకరా ఖాళీ స్థలం ఉన్న గురుకుల, ఆశ్రమ, కేజీబీవీ విద్యా సంస్థల్ని ఎంపిక చేశారు. వివిధ రకాల మొక్కలు నాటాలని నిర్ణయించారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంత అరణ్యాల కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత వర్షాలు కురవక అధిక వేడి వాతావరణం ఉండటంతో మొక్కలు ఎండిపోతాయని నాటలేదు. ప్రస్తుతం వర్షాలు కురిసి వాతావరణం చల్లబడటంతో మొక్కలు నాటడానికి సిద్ధమయ్యారు.
ఆహ్లాదకర వాతావరణం: మొక్కలు నాటడంతో పాటు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. నాటిన మొక్కలు బాగా పెరిగేలా వర్మి కంపోస్టు ఎరువు, నీమ్ కేక్, బయోచార్, జీవామృతం వేయనున్నారు. వనాలు పెంచడం ద్వారా విద్యాసంస్థల ఆవరణల్లో కర్బన రహితంగా ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకు వీబీ జీ రామ్‌జీ నిధులు ఖర్చు చేయనున్నారు. మొక్కలు నాటి నీరు పోయడం, సంరక్షణ పనుల ద్వారా శ్రామికులకు ఉపాధి కల్పించనున్నారు. నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి నాటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
డ్వామా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ అనంత అరణ్యాల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని రకాల మొక్కలు నాటిస్తామన్నారు.
అనంత అరణ్యాలు ఎంపికైన విద్యా సంస్థలు
| ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాల | వెదుళ్లపల్లి |
| బీఆర్ అంబేడ్కర్ గురుకులం | నరసాయపాలెం |
| ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల | కావూరు |
| కేజీబీవీ | చినగంజాం |
| మోడల్ పాఠశాల | చీరాల |
| కేజీబీవీ | చీరాల |
| బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం | నాగులపాలెం |
| బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల | వేటపాలెం |
| బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం | యద్దనపూడి |
మడ అడవులతో తీరానికి రక్షణ - 250 హెక్టార్లలో విస్తరణకు ప్రణాళికలు
బాస్కెట్‌బాల్ ఛాలెంజ్‌తో పచ్చటి విప్లవం - విజయవాడలో "గ్రీన్ ఇండియా ప్లే ఛాలెంజ్"

