ETV Bharat / state

మామ-అల్లుడిని బైకుకు తాళ్లతో కట్టి నీళ్లలో పడేసి - లభ్యమైన మృతదేహాలు

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో కలకలం - చిన్నగొల్లపాలెం గ్రామంలో అంతుపట్టని విషాదం - శనివారం రాత్రి చేపల వేటకు వెళ్లిన మామాఅల్లుళ్ల మృతి - ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చేపలు

​Krishna District Double Murder
​Krishna District Double Murder (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 29, 2026 at 5:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

​Krishna District Double Murder : కృష్ణా జిల్లాలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి స్థానికంగా భయాందోళనలు సృష్టిస్తోంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విగతజీవులుగా మారారు. అదీ సాధారణ మరణం కాదని, వారిని అంతమొందించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక గ్లామర్ బైకుకు వారి మృతదేహాలను తాళ్లతో కట్టేసి కాలువలో పడేయడం ఈ ఘటన తీవ్రతకు అద్దం పడుతోంది. పోలీసుల తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

చేపల వేట, ప్రాణాల మీదకు : కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామం. అక్కడ యానాది కులానికి చెందిన శెట్టి సుబ్బన్న (51), గొలుసు అయ్యప్ప (40) నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ వరసకు మామా అల్లుళ్లు. వీరు రోజూ చేపల వేటకు వెళ్తుంటారు. ఆ వేటే వారి కుటుంబాలకు ప్రధాన జీవనాధారం. ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా వారు వేటకు బయలుదేరారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లారు. కానీ, అదే వారి చివరి ప్రయాణం అవుతుందని ఆ కుటుంబాలు ఏమాత్రం ఊహించలేదు.

రాత్రి వేటకు వెళ్లిన మామాఅల్లుళ్లు మరుసటి రోజు ఉదయం అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం ఎంతసేపటికీ వారు రాకపోవడంతో సుబ్బన్న కుమారుడు శెట్టి ఏడుకొండలు వారిని వెతుక్కుంటూ బయలుదేరాడు. వారు రోజూ చేపలు పట్టే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పరిసరాలను జాగ్రత్తగా గమనించాడు.

చెదిరిన చేపలు : ఏడుకొండలు ఆ ప్రాంతంలో చూసిన దృశ్యాలు అతడిని భయపెట్టాయి. వారు వేటాడి పట్టుకున్న చేపలు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడికి కొంత దూరంలో నేల మీద కొన్ని రక్తపు మరకలు కూడా కనిపించాయి. అక్కడే ఒక మొబైల్ ఫోన్ కూడా కింద పడి ఉంది. వెంటనే ఏడుకొండలు మిగతా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్థులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి పరిసరాల్లో గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం రాత్రి కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన తండ్రి, బావ అదృశ్యమయ్యారని ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

తాళ్లతో మృతదేహాలు : పోలీసుల గాలింపులో సోమవారం షాకింగ్ దృశ్యం బయటపడింది. కొత్త కాలువ ఏటి మొగ పాయల వద్ద నీటిలో ఒక బైక్ ఉన్నట్లు గుర్తించారు. ఆ బైకుకు తాళ్లతో కట్టేసిన స్థితిలో రెండు మృతదేహాలు ఉన్నాయి. అవి గల్లంతైన సుబ్బన్న, అయ్యప్పల మృతదేహాలేనని పోలీసులు నిర్ధారించారు. వెంటనే గ్రామస్థుల సహాయంతో పోలీసులు ఆ మృతదేహాలను కష్టపడి బయటకు తీశారు.

హత్యా? ఇంకేదైనా జరిగిందా? : ఈ ఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. బైకుకు తాళ్లతో కట్టేసి నీళ్లలో పడేశారంటే ఇది హత్యేనని స్థానికులు అనుమానిస్తున్నారు. ముందుగా వారిని కొట్టి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆధారాలు మాయం చేసేందుకు, మృతదేహాలు పైకి తేలకుండా ఉండేందుకు ఇలా బైకుకు కట్టి నీళ్లలో పడేసి ఉంటారని చర్చించుకుంటున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా విచారిస్తున్నారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ ఘటనతో చిన్న గొల్లపాలెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అడ్డుగా ఉన్నాడని చంపేశారు - మిస్టరీ వీడిన చిలకలూరిపేట కేసు

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకు గిరిజన యువతి దారుణ హత్య