చావులోనూ వీడిని స్నేహ బంధం - అమర స్నేహితులకు ఒకేచోట అంత్యక్రియలు
గత డిసంబర్ 28న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన యువతులు - రెండు వారాల ఎదురు చూపుల అనంతరం స్వదేశానికి మృతదేహాలు - అమర స్నేహితులకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించిన తల్లిదండ్రులు

Published : January 11, 2026 at 1:18 PM IST
Two women From Telangana Died in America : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారిలో స్నేహితులే లేని వారు ఉండటం దాదాపుగా అసాధ్యం. మనకు ఎంత మంది స్నేహితులు ఉన్నప్పటికీ వారిలో ఒక్కరితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది. తల్లిదండ్రులతో చెప్పలేని విషయాలను సైతం వారితోనే పంచుకుంటాం. మన ఆనందాన్ని, బాధలను వారితోనే పంచుకోవడానికి ఇష్టపడతాం. అయితే సాధారణంగా స్నేహమంటే కలిసి చదువుతాం, ఆటలాడుతాం, పాటలు పాడతాం, కష్ట సుఖాల్లోనూ తోడుగా నిలుస్తాం. అయితే చావులోనూ తోడుగా ఉండే స్నేహితులను అరుదుగా చూస్తూ ఉంటాం. ఇదే రీతిలో మహబూబాబాద్‌కు జిల్లాకు చెందిన మేఘనా రాణి, భావన మరణంలోనూ ఒకరికొకరు తోడుగా నిలిచారు. వివరాల్లోకి వెళితే,
బాల్యం నుంచి కలిసి చదువుకున్నారు. ప్రాథమిక విద్య మొదలుకొని ఇంజినీరింగ్ వరకూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్నేహం వారిది. చివరకు ఎంఎస్ కూడా అమెరికాలో కలిసి చేయాలనుకున్నారు. అయితే అదే వారి చివరి మజిలీగా మారింది. గత సంవత్సరం డిసెంబరు 28న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ఇద్దరు మృతి చెందగా, శనివారం వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరాయి. చివరకు బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ఒకేచోట వారి అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ : మహబూబాబాద్ జిల్లా గార్ల వాసి పి.నాగేశ్వరరావు, శిరీష కుమార్తె పుల్లఖండం మేఘనా రాణి (24), మల్కనూరు గ్రామ ఉప సర్పంచి కె.కోటేశ్వరరావు, రేణుకల కుమార్తె భావన (25)లు చిన్ననాటి నుంచి అనగా ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకూ కలిసి చదువుకున్నారు. ముందు నుంచే ఉన్న స్నేహంతో ఒకరిపై మరొకరికి విడదీయరాని బంధం ఏర్పడింది. చివరిగా వారిద్దరూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు. వారి తల్లిదండ్రుల సహకారంతో చదువుకోవడానికి అమెరికా వెళ్లారు.
హఠాత్తుగా రోడ్డు ప్రమాదం : అమెరికాలోని ఓహాయో రాష్ట్రం డేటాన్లో ఉంటూ ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగాల వేటలో ఉన్నారు. కాగా గత డిసెంబరు 28న అమెరికాలోని అలబామా హిల్స్‌కు స్నేహితులతో కలిసి పయనమయ్యారు. అదే వారి చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేకపోయారు. దారిలో హఠాత్తుగా ప్రమాదం సంభవించింది. దీనిలో మేఘనా రాణి, భావనలు ఇద్దరూ మృతి చెందారు. ఈ వార్త వారి తల్లిదండ్రులకు తెలియడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య : వారు మరణించి రెండు వారాలు గడిచాక చివరకు శనివారం వారి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో యువతుల తల్లిదండ్రులు పి.నాగేశ్వరరావు, శిరీష, కె.కోటేశ్వరరావు, రేణుకల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరులో ఉన్న వీరి మృతదేహాలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే కోరం కనకయ్య, సర్పంచులు పార్వతి, వెంకట్రావు మృతదేహాలకు నివాళులు అర్పించారు.
ముల్కనూరులో ఇద్దరికి అంతిమ సంస్కారాలు : చావులోనూ వీడని వీరి స్నేహానికి గుర్తుగా గార్ల, ముల్కనూరులో మృతదేహాలకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ముల్కనూరులో ఉప సర్పంచి కె.కోటేశ్వరరావుకు చెందిన పొలంలో మేఘనా రాణి, భావనల ఆదర్శ స్నేహానికి గుర్తుగా ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు.
జ్ఞాపకాలను స్మరించుకుంటూ : పద్నాలుగు రోజుల పాటు తడారిన కన్నులతో తమ కుమార్తెల మృతదేహాల కోసం ఆ తల్లిదండ్రులు నిరీక్షించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు అసిస్టెంట్ సీనియర్ మేనేజర్ గంగావత్ వెంకన్న మృతదేహాలను తరలించేందుకు తనవంతు సహాయం చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహాలు రావడంతో రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ముల్కనూరులో ఇద్దరికీ కడసారి వీడ్కోలు పలికారు.

