ETV Bharat / state

కూరగాయల సాగుతో లాభాలు గడించాలా? - అయితే వీరిని ఫాలో అయిపోండి

తీగజాతి కూరగాయల సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న రైతు సోదరులు - సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతుల్లో కూరగాయల సాగు - అంటుకట్టు విధానంతో లాభాలార్జిస్తున్న రామకృష్ణారెడ్డి, రాజలింగారెడ్డి

Profits in Vegetable Cultivation
Profits in Vegetable Cultivation (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : December 29, 2025 at 2:02 PM IST

|

Updated : December 29, 2025 at 2:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

Profits in Vegetable Cultivation : సంప్రదాయ పద్ధతిలో సాగుకు స్వస్తిచెప్పి ఆధునిక సేద్యం వైపు అడుగులు వేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు ఇద్దరు రైతులు. అంటుకట్టే పద్ధతిలో తీగజాతి కూరగాయల పండించి అధిక లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన బొమ్మినేని రామకృష్ణారెడ్డి, రాజలింగారెడ్డి అనే ఇద్దరు సోదరులు. ఐదేళ్లుగా అంటు కట్టే విధానంలో తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ రైతు సోదరులు సత్ఫలితాలను సాధిస్తున్నారు.

ఈ విధానంతో రెట్టింపు దిగుబడులు : రామకృష్ణారెడ్డి, రాజలింగారెడ్డి సోదరులిద్దరూ గత 15 ఏళ్లుగా సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో పందిరి సాగు ద్వారా పలు రకాల కూరగాయల సాగు చేస్తున్నారు. ఒకసారి పందిరిని వేసినట్లయితే పదేళ్లపాటు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సంప్రదాయ పద్ధతుల్లో కూరగాయలను పండించడం ద్వారా లాభాలు అంతంతమాత్రమేనని గ్రహించిన వీరు అంటుకట్టే సాగుపై దృష్టి సారించారు.

Profits in Vegetable Cultivation
అంటుకట్టు విధానంలో సాగుచేసిన బీరతోట (EENADU)

అసలేంటీ అంటుకట్టడం? : సాధారణ పద్ధతిలో కూరగాయలను పండించే సమయంలో నేల ఆధారిత తెగుళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పురుగుల సమస్యలు పంట దిగుబడికి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. చీడపీడలన్నింటినీ సాధ్యమైనంత వరకు మంచి దిగుబడిని, నాణ్యతను సరికొత్త విధానమే అంటుకట్టడం. ఈ విధానాన్ని అవలంబించేందుకు వాతావరణ అడ్డంకుల్ని, చీడపీడలను తట్టుకునే నాణ్యమైన వేరువ్యవస్థను కలిగిన మొక్కలను తీసుకొని, మంచి దిగుబడినిచ్చే రకాలతో అంటుకట్టాల్సి ఉంటుంది.

అంటుకట్టే విధానంలో కూరగాయలను పండించడంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. దీంతో ఈ రైతు సోదరులిద్దరూ ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఐదేళ్లుగా అంటుకట్టిన కాకర, సొర,బీర మొక్కలను తీసుకొచ్చి ఆ విధానంలోనే సాగు చేస్తున్నారు. ఎకరం భూమిలో 2 వేల మొక్కలను నాటుతారు. ఒక్కో మొక్క రూ.13-15 వరకు ధర పలుకుతోంది. పంట కాలం వ్యవధి 40-50 రోజులు. రెండు రోజులకోసారి పంట కోసి స్థానిక మార్కెట్‌కు తరలిస్తారు.

ఇలా నాలుగు నెలలపాటు దిగుబడి వస్తుంది. కాకర, బీర, సొర కిలోకు మార్కెట్‌లో సుమారు రూ.30-40 వరకు ధర పలుకుతోంది. పండించిన పంటను దళారులకు విక్రయించకుండా సొంతంగా మార్కెటింగ్‌ చేయడం వల్ల మంచి లాభాలు ఆర్జిస్తున్నారు ఈ కర్షక సోదరులు. వీరి పొలం(వ్యవసాయ క్షేత్రం)లో నిత్యం 20 మంది కూలీలు పనిచేస్తుంటారు. ఆరు నెలల తర్వాత ప్రస్తుతం ఉన్న పంటను తీసేసి మరో రకం పంటను వేస్తారు. ఎకరం కూరగాయల సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి అవుతుందని రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. పెట్టుబడి, ఖర్చులు పోను రూ.3 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు.

ప్రభుత్వం ప్రోత్సహించాలి: ప్రభుత్వం కూరగాయలు, ఆకుకూరల సాగుకు సరైన ప్రోత్సాహం ఇవ్వడం లేదని రైతు బొమ్మినేని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఐదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి మొక్కలను తీసుకొస్తుండటం వల్ల వ్యయ ప్రయాసలకు గురవుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రభుత్వం అంటుకట్టే పద్ధతిలో టమాటా, వంగ మొక్కలను పెంచేందుకు ప్రయత్నించగా సాంకేతిక లోపంతో పాటు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అది విఫలమైంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని అంటుకట్టే పద్ధతిలో పలు రకాల కూరగాయల మొక్కలను సరఫరా చేస్తే రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది.

"హైదరాబాద్‌ నగర సమీపంలోని జీడిమెట్ల, సిద్దిపేట జిల్లా ములుగులోని హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా వంగ మొక్కలను అంటుకట్టి కూరగాయలు సాగుచేస్తున్న రైతులకు సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్‌తోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలు కాకర, బీర, సొర, టమాటా, కాలీఫ్లవర్‌ లాంటి పలు రకాల విత్తనాలను అంటుకట్టి మొక్కలను ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ఈ విధానంలో అన్ని రకాల కూరగాయల మొక్కలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది"- శ్రీనివాసరావు, ఉద్యానశాఖ అధికారి, వరంగల్‌ జిల్లా

40 రోజుల్లో చేతికందే పంట - 'దుంప'తో నెలకు రూ.15 వేల ఆదాయం!

పెట్టుబడి రూ.40 వేలు.. లాభం రూ.2 లక్షలు.. ఇదీ ఆ రైతుల విజయగాథ..

Last Updated : December 29, 2025 at 2:16 PM IST