ETV Bharat / state

వేప చెట్టు విషయంలో 25 ఏళ్లుగా వివాదం - సూర్యాపేట జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

వేపచెట్టుపై రెండు కుటుంబాలకు 25 ఏళ్లుగా వివాదం - తన తండ్రి సహా మరో వ్యక్తిని హత్య చేసిన నిందితులు - ఆగ్రహించిన గ్రామస్థులు - పరిస్థితిని అదుపులోకి తీసుకోబోయిన ఎస్సై తలకు గాయం

Neem Tree Dispute Lead To Two Murders
వేపచెట్టుపై వివాదంలో ఇద్దరి దారుణ హత్య (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 1:24 PM IST

|

Updated : August 29, 2026 at 5:28 PM IST

4 Min Read
Choose ETV Bharat

Neem Tree Dispute Lead To Two Murders : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని ఎర్రగడ్డ తండాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో ఉన్న వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఇద్దరి హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో నిందితులు తమ సొంత తండ్రినే చంపేయడం ఈ విషాదాన్ని మరింత తీవ్రంగా మార్చింది.

చెట్టును నరికేశారని గొడవ పెట్టుకొని : ఇళ్ల సరిహద్దులో ఉన్న వేప చెట్టు విషయంలో వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య గత 25 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇవాళ ఉదయం సైదా కుమారులు రాము, పెద్దబాబులు వెంకటేశ్వర్లు ఇంటి ముందు కొన్ని వేప కొమ్మలను వేసి నిప్పు పెట్టారు. దీంతో వెంకటేశ్వర్లు కొంతమందిని పిలిపించి ఆ చెట్టును నరికించబోయారు. ఎన్నో సంవత్సరాలుగా చెట్టు కోసం వివాదం జరుగుతోందని, అలాంటప్పుడు చెట్టును ఎలా నరుకుతావని రాము, పెద్దబాబు వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. వారి మధ్య వాగ్వాదం ముదరడంతో పెద్దబాబు గొడ్డలితో వెంకటేశ్వర్లుపై విచక్షణా రహితంగా దాడి చేయగా, అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

గొడవగా చిత్రీకరించే యత్నం : వెంకటేశ్వర్లును తమ కుమారులు హతమార్చడం గమనించిన సైదా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారు వెంకటేశ్వర్లుకు మద్దతిస్తావా అంటూ తండ్రిపై కూడా గొడ్డలితో దాడి చేశారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సైదా మృతి చెందాడు. చెట్టు విషయంలో జరిగిన పరస్పర ఘర్షణలో వెంకటేశ్వర్లు చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకే నిందితులు తన సొంత తండ్రిపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. ఇదంతా గమనించిన గ్రామస్థులు భూక్యా సైదా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా మేళ్లచెరువు ఎస్సై నవీన్ కుమార్ తలకు గాయాలయ్యాయి. అతణ్ని వెంటనే హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ ​రెడ్డి సైతం చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేపచెట్టుపై వివాదంలో ఇద్దరి దారుణ హత్య (ETV Bharat)

"వెంకటేశ్వర్లు, భూక్యా సైదా ఇళ్లకు మధ్య ఒక వేపచెట్టు ఉంది. ఎన్నో ఏళ్లుగా దీని కోసం రెండు కుటుంబాలకు తరచూ వివాదాలు జరుగుతుండేవి. ఇవాళ ఉదయం భూక్యా సైదా కుమారులు రాము, పెద్దబాబు కొన్ని వేపచెట్టు కొమ్మలను తీసుకెళ్లి వెంకటేశ్వర్లు ఇంటి ఎదురుగా రోడ్డు మీద కాల్చారు. దీనిపై వెంకటేశ్వర్లు వారిని ప్రశ్నించడంతో పెద్దబాబు గొడ్డలితో అతడి తలపై నరికాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడే మరణించాడు. ఈ విషయంలో వారి తండ్రి సైదా వారించడానికి వెళ్తే మరో కుమారుడు రాము అతనిపై దాడి చేశాడు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని సైదాను ఆస్పత్రికి తరలించగా అతడు కూడా మరణించాడు. ప్రస్తుతం నిందితులిద్దరితో పాటు వారి తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నాం. క్లూస్​ టీం ఆధారాలు సేకరిస్తోంది" - శ్రీనివాస్ ​రెడ్డి, కోదాడ డీఎస్పీ

గ్రామస్థుల వ్యతిరేకత : నిందితుడు పెద్దబాబు గతంలో గ్రామంలో పలువురితో తరచూ గొడవలకు దిగడం, వారిపై కోర్టులో కేసులు వేస్తూ ఇబ్బందులకు గురి చేశాడని పోలీసులు చెబుతున్నారు. దీంతో అతని మీద గ్రామస్థులు ఆవేశంతో ఉన్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పెద్దబాబు తన ప్రవర్తన కారణంగా సుమారు 18 నెలల కిందట సస్పెండ్​ కూడా అయ్యాడని వెల్లడించారు. ప్రస్తుతం ఇతని విడాకుల కేసు సైతం విచారణలో ఉన్నట్లు తెలిపారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు : జిల్లా ఎస్పీ నరసింహ ఘటనాస్థలిని పరిశీలించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, సీఐ చరమందా రాజుతో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ ఘటనకు ఇంకా ఎవరైనా బాధ్యులు ఉన్నారా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. హత్యలకు పాల్పడిన నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని, తగిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామస్థులు సంయమనం పాటించాలని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు.

"వెంకటేశ్వర్లుపై భూక్యా పెద్దబాబు, రాము, వీరి తల్లి పాత పగలను దృష్టిలో ఉంచుకొని విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను మరణించాడు. అడ్డుకోబోయిన తండ్రి సైదాను కూడా పెద్దబాబు, రాము కొట్టగా అతను కూడా చనిపోయాడు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, ఫిర్యాదుదారులు చెబుతున్నారు. పెద్దబాబు ఇతరులతో తరచూ గొడవలు పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని గతంలోనూ కేసులు వచ్చాయి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. గ్రామస్థులు సంయమనం పాటించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు" - నరసింహ, సూర్యాపేట ఎస్పీ

బతికి ఉన్న తల్లిని బావిలో పడేసిన కుమారులు - ఆత్మహత్య చేసుకుందని నమ్మించే యత్నం

ప్రియురాలిని హత్య చేసి - మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి : పెళ్లి చేసుకోవాలన్నందుకు ప్రియుడి ఘాతుకం

Last Updated : August 29, 2026 at 5:28 PM IST