మొత్తం 32 దేశాల మీదుగా రాకపోకలు - ఏపీలో రెండు ఆసియా హైవేలు
తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు ఆసియా హైవేలు - 32 దేశాల మీదుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రూపొందిన హైవేల రోడ్ నెట్‌వర్క్ - ఆసియా హైవేల్లో తెలుగురాష్ట్రాల మీదుగా వెళుతున్న ఎన్‌హెచ్-45, 43

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 2:36 PM IST
Two Asian Highways Through Telugu States: తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులకు ఆసియా హైవే (ఏహెచ్)లుగా కూడా గుర్తింపు ఉందనేది మీకెవరికైనా తెలుసా? వివిధ దేశాల మీదుగా సరకు రవాణా చేసేందుకు, రోడ్డు మార్గంలో పలు దేశాలు చుట్టేయాలనుకునే పర్యాటకులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆసియా హైవేల నంబర్లు దోహదపడతాయి.
32 దేశాల మీదుగా రాకపోకలు: ఆసియా దేశాలతోపాటు, కొన్ని ఐరోపా దేశాలు కలిపి మొత్తం 32 దేశాల మీదుగా రాకపోకలు సాగించేందుకు ఆసియా హైవేల రోడ్ నెట్‌వర్క్ రూపొందింది. ఇది 1.40 లక్షల కిలోమీటర్ల నెట్‌వర్క్. అయితే ఈ హైవేల మీదుగా పలు దేశాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే పాస్‌పోర్ట్‌తోపాటు వీసా తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఆసియా హైవేల్లో 45, 43 తెలుగు రాష్ట్రాల మీదుగా వెళుతున్నాయి.
ఏపీ మీదుగా ఆసియా ఎన్‌హెచ్-45: కోల్‌కతా నుంచి భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మీదుగా చెన్నై వరకు జాతీయ రహదారి-16 ఉంది. దీనిని ఆసియా హైవే (ఏహెచ్)-45గా పిలుస్తారు. మళ్లీ చెన్నై నుంచి వెల్లూరు మీదుగా కృష్ణగిరి వరకు ఉన్న జాతీయ రహదారి-48ని కూడా ఏహెచ్-45గా పిలుస్తారు. అంటే ఇది మొత్తంగా కోల్‌కతా నుంచి కృష్ణగిరి వరకు ఆసియా హైవే-45గా ఉంది.
ఏహెచ్-1కి అనుసంధానంగా: వాస్తవానికి ఏహెచ్-1 అనేది జపాన్‌లోని టోక్యో నుంచి మొదలై దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా, వియత్నాం, కాంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇరాన్ మీదుగా తుర్కియే-బల్గేరియా అంతర్జాతీయ సరిహద్దు వరకు ఆసియా హైవే-1 ఉంది. ఇందులో జపాన్- దక్షిణ కొరియాకు మధ్య సముద్రయాణం ఉంటుంది. ఆ తర్వాత మిగిలినదంతా రోడ్డు మార్గమే ఉంటుంది.
ఈ ఏహెచ్-1 మన దేశంలో మయన్మార్ సరిహద్దులో మణిపూర్‌లోని మొరే వద్ద ప్రవేశించి ఇంఫాల్, కోహిమ, గౌహతి, షిల్లాంగ్ మీదగా బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది. మళ్లీ పశ్చిమబెంగాల్‌లోని పెట్రపోల్ వద్ద భారత్‌లోకి ప్రవేశించి కోల్కత్తా, వారణాసి, ప్రయాగరాజ్, కాన్పుర్, ఆగ్రా, దిల్లీ, లుథియానా, అమృత్‌సర్ మీదుగా అట్టారీ సరిహద్దు నుంచి పాకిస్థాన్‌లోకి వెళ్తుంది. ప్రధానంగా చెన్నై, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా ఉన్న ఏహెచ్-45 కోల్‌కతా దగ్గర ఏహెచ్-1కి అనుసంధానం అవుతుంది.
ఏపీ, తెలంగాణ మీదుగా ఏహెచ్-43: శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి-44 ఉండగా ఇందులోనే కొంత భాగాన్ని ఆసియా హైవే-43గా గుర్తించారు. ఆసియా హైవే-1లోని ఆగ్రా వద్ద ఏహెచ్-43 మొదలవుతుంది. అక్కడి నుంచి ఎన్‌హెచ్-44 గ్వాలియర్, నాగ్‌పుర్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కృష్ణగిరి, సేలం మీదుగా మధురై వరకు ఉన్నది.
ఆసియా ఎన్‌హెచ్-43గా అధికారులు గుర్తించారు. మళ్లీ మధురై నుంచి రామేశ్వరం మీదుగా ధనుష్కోటి వరకు ఉన్న జాతీయ రహదారి-87ని ఆసియా హైవే 43గా పిలుస్తారు. అంటే ఆసియా హైవే-43 అనేది ఆగ్రా నుంచి ధనుష్కోటి వరకు ఉంది.

