భక్తులకు తప్పనున్న ఇబ్బందులు - శ్రీవారికి నాణేలకు బదులుగా ముడుపు పత్రాలు
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం పలు మార్పులు చేయనున్న టీటీడీ - ఇకపై నాణేలకు బదులుగా ముడుపు పత్రాల రూపంలో చెల్లింపులు - ప్రత్యక్ష నగదు చెల్లింపులకు బదులుగా ఫోన్‌పే, గుగుల్‌పే, పేటీఎంల ద్వారా విరాళాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 3:10 PM IST
TTD will Be Launch Sreevari Mudupu patram For Cashless Donations: తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఎన్నో మార్పులు చేసే దిశగా కసరత్తులను చేస్తోంది. అందుకు అనుగుణంగా శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఆలయ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలోనే అభివృద్ధి పనుల్లో భాగంగా పలు కీలకమైన ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
నాణేలకు బదులుగా ముడుపు పత్రాలు: ఇప్పటివరకు భక్తులు మొక్కు రూపేణా శ్రీవారి హుండీలో నాణేలను వేయడం మనందరికీ తెలిసిందే. కానీ ఇకపై నాణేలకు బదులుగా ముడుపు పత్రాల రూపంలో వేసేందుకుగాను వీలుగా తిరుపతి, తిరుమలలో టీటీడీ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా భక్తులు ఫోన్‌పే, గుగుల్‌పే, పేటీఎం, నెఫ్ట్ ద్వారా డబ్బులను చెల్లించినట్లయితే అందుకు తగిన విధంగా ముడుపుపత్రాలను అందిస్తారు. వీటిని వేరు వేరుగా హుండీలో వేయవచ్చు. దాంతో భక్తులకు ఎక్కువగా నాణేలను, నగదును దేవస్థానానికి తీసుకుని వెళ్లడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
సామాన్య భక్తుల కోసం: అదే విధంగా స్థానిక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదపు కేంద్రంలోని రోజూ దాదాపు లక్షలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా ఈ కార్యక్రమానికి దాతలు పెద్ద ఎత్తున తమ వంతుగా బాధ్యత తీసుకుని విరాళాలను అందిస్తున్నారు. ఒకరోజు మొత్తం అన్నప్రసాద వితరణకు గాను రూ.44 లక్షలు, ఉదయం అల్పాహారానికి రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ.17 లక్షలు, రాత్రి భోజనానికి రూ.17 లక్షల చొప్పున విరాళం ఇచ్చే వెసులుబాటు అనేది ప్రస్తుతం ఉంది.
త్వరలో అందుబాటులోకి: అయితే ఇందులో ప్రధానంగా ఇంత మొత్తంలో విరాళాలు ఇవ్వలేని సామాన్య భక్తుల కోసం పది మంది, వంద మంది భక్తులకు సరిపడా విరాళాలను ఇచ్చినప్పటికీ వారి పేరున అన్నదానాన్ని చేస్తారు. ఈ విధానాన్ని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విధమైన నిర్ణయం పర్యావరణానికి హితంగా ఉండటంతో పాటుగా ఈ ఉత్పత్తులను తయారుచేసే రైతులకు కూడా ఉపయోగకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారి సేవలకు వైద్యులు : టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవకుల ద్వారా మెరుగైన సేవల వ్యవస్థీకరణకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొందరు వైద్యులు సేవాభావంతో ముందుకు వచ్చారు. బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేవారు. ఇకపై దేశ, విదేశాల నుంచి నిష్ణాతులైన వైద్యులతో పాటు నర్సులు, టెక్నీషియన్ల సేవలను ఆహ్వానిస్తున్నారు. రోగులకు అధునాతన శస్త్ర చికిత్సలు, బోధన, పరిశోధనలపై అధ్యయనం నిమిత్తం వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇందుకు వారితో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం, వసతి, రవాణా తదితర సదుపాయాలు సమకూర్చనున్నారు.
దరఖాస్తు విధానం ఇలా: శ్రీవారి వైద్య సేవకులుగా నమోదు చేసుకునేందుకు టీటీడీ వెబ్సైట్లో వీలు కల్పించింది. త్వరలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా విభాగాల్లో అనుభవం, గుర్తింపు, సాధించిన అవార్డుల గురించి వివరాలు, బోధనఆ అనుభవాలు వెల్లడించాలి. టెక్నీషియన్లు, నర్సులు ఎలాంటి సేవలు అందించగలరనే విషయాలు ముందుగానే తెలిపాలి.
నెలలో సగటున వారం రోజులు సేవలకు సమయం కేటాయించాలి. శ్రీవారి వైద్య సేవకు స్విమ్స్‌లో ఇద్దరు ఉద్యోగులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. సందేహాలు, ఇతర వివరాల సమాచారం కోసం ఫోన్ నంబరు 91542 16307, srivarivaidyasevasvims@gmail.comలో సంప్రదించాలి.
శ్రీవారి వైద్య సేవకులు - దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?
మీ ఇంట్లో శుభకార్యమా? - తక్కువ ఖర్చుతోనే టీటీడీ కళ్యాణ మండపం బుక్ చేసుకోండిలా

