ETV Bharat / state

తిరుమలలో దళారులుగా సిబ్బంది - అడ్డదారుల్లో శ్రీవారి దర్శనాలు!

తిరుమల శ్రీవారి దర్శనాల్లో లోపిస్తున్న పారదర్శకత - భక్తుల రద్దీని నియంత్రించేందుకు టైమ్‌ స్లాట్‌ విధానాన్ని తీసుకొచ్చిన టీటీడీ - క్షేత్రస్థాయిలో అమలు కాని విధానం

TTD Time Slot Regulations not Implemented in Tirumala
తిరుమల శ్రీవారి దర్శనాల్లో లోపిస్తున్న పారదర్శకత (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 10:17 AM IST

3 Min Read
Choose ETV Bharat

Time Slot Rules in Tirumala : తిరుమల శ్రీవారి దర్శనాల్లో పారదర్శకత లోపిస్తోంది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు, గంటల తరబడి నిరీక్షణను తప్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) టైమ్​ స్లాట్​ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. ముఖ్యంగా విజిలెన్స్, పోలీసు వ్యవస్థల వైఫల్యం, కొందరు కింది స్థాయి సిబ్బంది ధనదాహంతో తిరుమలలో దళారీ వ్యవస్థ పేట్రేగిపోతోంది.

గాలికొదిలేసిన సమయపాలన: టైమ్ స్లాట్ విధానం ప్రకారం, భక్తులు తమకు కేటాయించిన సమయాల్లోనే క్యూలైన్లలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వంటి ప్రధాన తనిఖీ కేంద్రాలతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు, దళారీలుగా వ్యవహరించే కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారు. భక్తులను నేరుగా లోపలికి పంపించేందుకు రూ.500 నుంచి రూ.1000 వరకు వస్తూలు చేస్తున్నారు. రేపటి దర్శనానికి సంబంధించిన టోకెన్లు ఉన్నవారిని సైతం ఈరోజే దర్శన లైన్లలోకి పంపుతున్నారు.

ప్రశ్నిస్తే బెదిరింపులు: భద్రత కల్పించాల్సిన విజిలెన్స్, పోలీసు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. కొంతమంది పోలీసులు ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులను, టికెట్లు లేని వారిని సైతం తీసుకొచ్చి నేరుగా రన్నింగ్ క్యూలైన్లలో వదిలేస్తుండటం వివాదాస్పదంగా మారింది. ఈ అక్రమాలను ప్రశ్నించే నిజాయితీ గల సిబ్బందిపై తప్పుడు కేసులు పెడతామని, బదిలీలు చేయిస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

12% వ్యత్యాసం: రోజువారీ దర్శన డేటాబేస్ గణాంకాలను పరిశీలిస్తే దాదాపు కనిష్ఠంగా 12 శాతం మేర వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే రోజుకు లక్ష మంది భక్తులు దర్శనం చేసుకుంటే, అందులో సుమారు 12,000 మంది సమయపాలన లేకుండా, దొడ్డిదారిన లేదా ముందస్తు స్లాట్లలో ప్రవేశిస్తున్న వారే.

ఈ అక్రమ ప్రవేశాల వల్ల సామాన్య భక్తులపై కనీసం 3 నుంచి 5 గంటల అదనపు నిరీక్షణ భారంత పడుతోంది. అంతేకాకుండా, తిరుమలలో పారిశుధ్యం, అన్నదానం, ట్రాఫిక్ నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల పైనా తీవ్ర ఒత్తిడితో పాటు ఆర్థిక భారం పడుతున్నాయి. వేలిముద్రలు, ముఖ గుర్తింపు (Facial Recognition) యంత్రాలను పూర్తిస్థాయిలో అనుసంధానించకపోవడంతో ఒక భక్తుడు ఎన్నిసార్లు వస్తున్నారో గుర్తించలేని పరిస్థితి నెలకొంది.

మొదట్లోనే కట్టడి చేయాలి: గత వైకుంఠ ఏకాదశి సమయంలో టీటీడీ టైమ్ స్లాట్ విధానాన్ని టీటీడీ పకడ్బందీగా అమలుచేసి విజయవంతమైంది. ఇదే విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేసింది. అయితే, సాధారణ రోజుల్లో ఇదే విధానాన్ని ఎందుకు కొనసాగించడం లేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఐసీసీసీ వంటి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారులు దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. క్యూ లైన్ల ప్రవేశ ద్వారం వద్ద మొదటి తనిఖీ కేంద్రంలోనే టైం స్లాట్​ను కచ్చితంగా పరిశీలించాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం చొరవ తీసుకుని ఈ టైమ్ స్లాట్ విధానాన్ని కఠినంగా అమలు చేయకపోతే, సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారం కావు.

సిబ్బందే దళారులుగా: తనిఖీలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు, దళారులు, కింది స్థాయి సిబ్బంది అక్రమంగా వేల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. గతంలో వైకుంఠంలో రోజుకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు అక్రమంగా సంపాదిస్తూ పట్టుబడిన ఒక రెగ్యులర్ ఉద్యోగిని టీటీడీ ఇటీవల సస్పెండ్ చేయడం, ఈ అక్రమ దందా తీవ్రతకు అద్దం పడుతోంది.

శ్రీవారి సేవలో వైద్య నిపుణులు - జూన్ 5న అంకురార్పణ!

భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్ - నడక మార్గంలో నాలుగు కాళ్ల నిఘా