శ్రీవారి వైద్య సేవకులు - దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?
చికిత్స, బోధన, పరిశోధన రంగాల్లో నిష్ణాతులకు టీటీడీ ఆహ్వానం - నెలలో సగటున వారం రోజుల పాటు ఆసుపత్రుల్లో సేవలు - మెరుగైన సేవల వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిన టీటీడీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 10:55 AM IST
TTD Invites Experts in the Fields of Treatment Teaching and Research : టీటీడీ ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్య సేవకుల ద్వారా మెరుగైన సేవల వ్యవస్థీకరణకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొందరు వైద్యులు సేవాభావంతో ముందుకు వచ్చారు. బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేవారు.
ఇకపై దేశ, విదేశాల నుంచి నిష్ణాతులైన వైద్యులతో పాటు నర్సులు, టెక్నీషియన్ల సేవలను ఆహ్వానిస్తున్నారు. రోగులకు అధునాతన శస్త్ర చికిత్సలు, బోధన, పరిశోధనలపై అధ్యయనం నిమిత్తం వారికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇందుకు వారితో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం, వసతి, రవాణా తదితర సదుపాయాలు సమకూర్చనున్నారు.
దరఖాస్తు విధానం ఇలా: శ్రీవారి వైద్య సేవకులుగా నమోదు చేసుకునేందుకు టీటీడీ వెబ్సైట్లో వీలు కల్పించింది. త్వరలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా విభాగాల్లో అనుభవం, గుర్తింపు, సాధించిన అవార్డుల గురించి వివరాలు, బోధనఆ అనుభవాలు వెల్లడించాలి. టెక్నీషియన్లు, నర్సులు ఎలాంటి సేవలు అందించగలరనే విషయాలు ముందుగానే తెలిపాలి.
నెలలో సగటున వారం రోజులు సేవలకు సమయం కేటాయించాలి. శ్రీవారి వైద్య సేవకు స్విమ్స్‌లో ఇద్దరు ఉద్యోగులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. సందేహాలు, ఇతర వివరాల సమాచారం కోసం ఫోన్ నంబరు 91542 16307, srivarivaidyasevasvims@gmail.comలో సంప్రదించాలి.
దరఖాస్తులను స్విమ్స్ వీసీ డా.ఆర్వీ కుమార్, బర్డ్ సంచాలకులు డా.గుడారు జగదీష్, ఎస్పీపీహెచ్ డైరెక్టర్ డా.శ్రీనాథ్‌రెడ్డి, టీటీడీ ఆసుపత్రుల సీఎంఓ డా.కుసుమ కుమారితో పాటు పలు విభాగాధిపతులు కమిటీ పరిశీలిస్తుంది. వారి సేవలు సద్వినియోగం చేసుకోవచ్చని భావిస్తే, వారితో సంప్రదించాక తేదీలు ఖరారు చేస్తారు.
భూదేవి కాంప్లెక్స్‌లో కార్యాలయం: టీటీడీ భూదేవి కాంప్లెక్స్‌లోని కార్యాలయాన్ని శ్రీవారి వైద్య సేవకుల కార్యకలాపాల నిమిత్తం కేటాయించనున్నారు. అక్కడి నుంచే వైద్యుల ఎంపిక, వారి సేవల వినియోగంతో పాటు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. వేదిక్ వర్సిటీ, స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణాల్లో వసతి సదుపాయాలు, రవాణా, ప్రముఖులకు అందించే భోజనాల తరహాలో వైద్య సేవలకు కూడా అందజేస్తారు.
అందుబాటులోకి రానున్న శస్త్రచికిత్సలు: వివిధ దేశాల్లో మెరుగుపడుతున్న బోధనా పద్ధతులు, ఆధునిక వైద్య విధానాలు, పరిశోధన రంగాల గురించి టీటీడీ ఆసుపత్రుల్లోని వైద్యులు, విద్యార్థులకు ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా అవగాహన పెంచేందుకు ఈ విధానం ఉపయుక్తం కానుంది. సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండదు. తద్వారా రూ.లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు తగ్గుతాయి.
ప్రముఖ వైద్యుల ద్వారా సేవలు: బర్డ్, స్విమ్స్ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు కొందరు ప్రముఖ వైద్యుల ద్వారా సేవలు అందించారు. అమెరికా, బ్రెజిల్ వైద్య నిపుణులు స్విమ్స్ ఐసీయూను పరిశీలించి సూచనలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కంటి వైద్య నిపుణులు డా.వెంకటాచలం స్విమ్స్‌లో గ్లకోమా, శుక్లాల ఆపరేషన్లు, అతిథి ఉపన్యాసం చేశారు.
ఆస్ట్రేలియాకు చెందిన పార్కిన్సన్స్ డిసీజ్ వైద్య నిపుణులు డా.పద్శకుమార్, సీనియర్ రేడియాలజిస్టు డా.ప్రహ్లాద్రాజ్, అపోలో కార్డియాలజిస్ట్ డా.యోగిష్ కఠోరి, కిడ్నీ వైద్య నిపుణులు డా.దక్షిణామూర్తి, మదురై ఎయిమ్స్ సీఈవో డా.హనుమంతరావు స్విమ్స్‌లో వైద్యం అందించారు. బర్డ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సేవకుల ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయడంతో పాటు ఒకేసారి 30 మందికి మోకీళ్ల మార్పిడి చేశారు. హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వైద్యులు ప్రతినెలా బర్డ్‌కు వచ్చి సేవలు అందిస్తున్నారు.
మార్గదర్శకంగా నిలుస్తాయి: వైద్య, పరిశోధక రంగాల్లో నిష్ణాతులైన వైద్యులు, సిబ్బంది సేవాభావంతో ముందుకు రావాలి. ప్రముఖుల వైద్య విధానం, బోధనలు ఇక్కడి వైద్యులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. స్వామివారి దర్శనంతో పాటు వసతులు సమకూర్చుతామని వీసీ స్విమ్స్ యూనివర్సిటీ, డా.ఆర్వీ కుమార్ తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు - ఇప్పటికే 463కి అనుమతులు
మీ ఇంట్లో శుభకార్యమా? - తక్కువ ఖర్చుతోనే టీటీడీ కళ్యాణ మండపం బుక్ చేసుకోండిలా

