ఐదేళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి - సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి
భోలేబాబా ఓరోగానిక్, ఏఆర్, వైష్ణవి, మాల్‌గంగా డెయిరీల ద్వారా సరఫరా - నిర్ధారించిన సిట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 11, 2025 at 7:20 AM IST
TTD Received Adulterated Ghee for Over 5 Years : వైఎస్సార్సీపీ హయాంలో భోలేబాబా ఓరోగానిక్ డెయిరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి పంపినట్లు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది. ఇందుకు 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్న్ ఆయిల్, పామ్ స్టెరిన్ తదితర రసాయనాలు వినియోగించారని పేర్కొంది. గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లోని ఎన్‌డీడీబీ కాఫ్ నెయ్యిని మరోసారి పరీక్షించి ఈ ఏడాది మార్చి 27న కల్తీని ధ్రువీకరించిందని సిట్ తెలిపింది. మొత్తం కల్తీ నెయ్యిలో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా భోలేబాబా కంపెనీ పంపింది.
తమ నుంచి వైష్ణవి సంస్థ కొనుగోలు చేసినట్లు ఆశిష్ అగర్వాల్ అనే వ్యక్తి సహకారంతో భోలేబాబా డెయిరీ నకిలీ రికార్డులు తయారు చేసినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. మిగతా కల్తీ నెయ్యిని ఏఆర్ డెయిరీ, మాల్‌గంగా, భోలేబాబా సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానానికి విక్రయించాయని, మొత్తంగా నకిలీ నెయ్యి సరఫరా ద్వారా భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ రూ.251.53 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించారు. ఈ నెల ఏడున అరెస్టైన దిల్లీకి చెందిన అజయ్‌కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్టులో ఈ వివరాలు ఉన్నాయి. ఇతను నెయ్యి కల్తీకి అవసరమైన రసాయనాలను పొమిల్, విపిన్ జైన్‌లు డైరెక్టర్లుగా ఉన్న హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హర్ష్ ట్రేడింగ్ కంపెనీలకు పంపారని విచారణలో వెల్లడైంది. తద్వారా అజయ్‌కుమార్‌కు రూ.7.94 కోట్లు ముట్టాయి.
నాలుగు ట్యాంకర్లు తిరస్కరించారు- పేరు మార్చి పంపితే తీసుకున్నారు : ఏఆర్ డెయిరీ ద్వారా వచ్చిన నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని ఒకసారి వెనక్కు పంపగా రంగంలోకి దిగిన భోలేబాబా డెయిరీ వాటిని తిరిగి శ్రీవైష్ణవి డెయిరీ పేరుతో సరఫరా చేయగా తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని అనుమతించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఈ కేసులో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు ఏ9, ఏ10గా ఉన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసు - వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందన్న సిట్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ గతంలోనే హైకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలు కోరుతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. నేరఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నట్లు దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే ఆ బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపిన విషయం విధితమే. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సుబ్బారెడ్డి, ఆయన భార్య వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ ఐవో ఇటీవల హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర - తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్

