సరికొత్త పరిమాళలాతో తిరుమలకు పునరుద్ధరణ - పచ్చదనం కోసం ‘దశాబ్ది ప్రణాళిక’ సిద్ధం
ఆధ్యాత్మికతకు, ఆహ్లాదానికి పెద్దపీట - 3 దశల్లో కార్యాచరణ - భూమిలోని సారాన్ని, సూక్ష్మజీవ వ్యవస్థ పెంపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 12, 2025 at 10:21 AM IST
TTD Planning For New Developments to make greenery Tirumala: శ్రీవారి దర్శనం కోసం ప్రతి ఏటా ఎన్నో లక్షల మంది తిరుమల క్షేత్రానికి వెళ్తుంటారు. స్వామివారిని పూజించుకున్నాక అక్కడి అటవీ అందాలను ఆస్వాదించడానికి దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మికతకు, ఆహ్లాదానికి పెద్దపీట వేస్తూ శేషాచలం సహజత్వాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించింది.
ముఖ్యమంత్రి సూచనల మేరకు: తిరుమల గిరులను వచ్చే పదేళ్లలో సరికొత్త పరిమళాలు, పచ్చదన అందాలను సంతరించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలను దర్శించుకున్న సందర్భంగా ఏడుకొండల్లో పచ్చదనం పెంచాలని, అన్ని రుతువుల్లోనూ పూల సౌందర్యం కన్పించేలా విభిన్న జాతుల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు 2025-35 కాలానికి అటవీ విభాగం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను టీటీడీ బోర్డు ఇటీవల ఆమోదించింది. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా అడవిలో తేమను కాపాడేందుకు కొండవాలు ప్రాంతాల్లో కందకాలు, చెక్‌డ్యామ్‌లు, రాతి కట్టడాలు నిర్మించనున్నారు. ఎగువ ప్రాంతాల్లో 15-25% వాలున్న చోట సమతల కందకాలు తవ్వుతారు.
విదేశీ వృక్షాలు తొలగింపు: మొత్తం 2,719.95 హెక్టర్ల అటవీ భూమి తిరుమల పరిధిలో ఉంది. దీంట్లో 89.4 శాతం వరకు అటవీ విస్తీర్ణం ఉంది. కానీ మూడు దశాబ్దాల కిందట నాటిన విదేశీ జాతి వృక్షాలు అకేషియా, సెన్నా స్పెక్టాబిలిస్ వంటి వృక్షాలు భారీగా పెరిగి నేడు గుదిబండగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని దశాల వారిగా తొలగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరో పదేళ్ల తర్వాత కేవలం 50 హెక్టర్లలోపే అకేషియా తోటలు పరితమయ్యేలా చేస్తున్నారు.
వాటితో అన్ని విధాలుగా చేటు: మొత్తం 576 హెక్టార్లలో ఈ విదేశీ చెట్లు విస్తరించి ఉన్నాయి. ఇవి స్థానిక జాతి వృక్షాలను పెరగకుండా అడ్డుకుంటున్నాయి. అంతేకాకుండా భూమిలోని సారాన్ని, సూక్ష్మజీవ వ్యవస్థ (సాయిల్ మైక్రో-ఎకాలజీ)ను దెబ్బతీస్తున్నాయి. అందుకే వీటిని తొలగించి వాటి స్థానంలో దేశీయ మొక్కలు నాటుతారు. దశాబ్దాల కిందట నాటినవి కావడంతో అవి ఇప్పుడు భారీ వృక్షాలుగా ఎదిగాయి. వీటన్నింటిని ఒక్కసారే తొలగిస్తే కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్నందున దశల వారీగా కొట్టివేయనున్నారు.
దశాలవారీగా పనులు: 2025-27 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయనున్నారు. దీంట్లో ముందుగా 60-70 హెక్టార్లలో ప్రయోగాత్మకంగా గిర్డిలింగ్ చేస్తారు. అంటే అకేషియా చెట్టు కాండం చుట్టూ బెరడు తొలగించి, ఎండబెట్టడం. తర్వాత సెలెక్టివ్ ఫెల్లింగ్ అంటే ఎంపిక చేసిన చెట్లను నరికివేయడం. 2027-31 సంవత్సరం లోపు విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీంట్లో 300 హెక్టార్ల మేర దేశీయ మొక్కల పెంపకంతో పాటు ఎకో టూరిజం జోన్లను అభివృద్ధి చేయనున్నారు. మిగిలిన ప్రాంతానికి దీనిని విస్తరింపజేసి అడవి పూర్తిస్థాయిలో కోలుకునేలా చర్యలు చేపట్టి 2031-35 నాటికి స్థిరీకరణ పూర్తి చేయనున్నారు.
1,500కు పైగా మొక్కలతో దివ్యౌషధ వనం: దేశీయ మొక్కల విస్తరణలో భాగంగా దివ్యౌషధ వనాన్ని ఏర్పాటు చేయనున్నారు. 3.5 ఎకరాల్లో గరుడాద్రినగర్ టోల్‌గేటు సమీపంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ నాణ్యతతో దివ్యౌషధ వనాన్ని తీర్చిదిద్దనున్నారు. దీనికోసం రూ.4.25 కోట్లు వెచ్చించనున్నారు. ఇక్కడ ఆయుర్వేద, పురాతన వారసత్వ జీవావరణతో పాటు 1,500 రకాలకు పైగా మొక్కలు పెంచనున్నారు. ఆ మొక్కల పుష్పాలు, ఫలాలు, పత్రాల ఉపయోగాన్ని బట్టి ఆయుర్వేద, సుగంధ, సువాసన, పూజ, ప్రసాద వనాలుగా వర్గీకరించారు.
రకాన్ని బట్టి స్థలాల కేటాయింపు: జీవరాశివనం, కల్పవృక్ష ధామం, ఔషధవనం, ఔషధి కుండం, హెర్బల్ పెవిలియన్, పవిత్ర వృక్షాలు, అరుదైన వృక్షాల వనం, రుతువనం, మసాల దినుసుల మొక్కల వనం, మూలికా వనం ఇలా రకాన్ని బట్టి స్థలాలు కేటాయించారు. అంతే కాకుండా వచ్చే సందర్శకులకు ఆయా మొక్కల సమస్త సమాచారం తెలిసేలా బోర్డులు పెట్టనున్నారు.
ఏడాది పొడవునా వర్ణరంజితంగా: భక్తులకు కనువిందు చేసేలా, ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా తిరుమల క్షేత్రం ఏడాది పొడవునా పూలవనంలా కన్పించేలా రూపొందించనున్నారు. దీనికోసం వేర్వేరు రుతువుల్లో పూసే దేశీయ మొక్కలు నాటుతారు.
- మార్చి-మే నెలల్లో వికసించే పసుపు పచ్చని సంపంగి ,మే-జులైలో పూసే పొగడ, డిసెంబరు-ఫిబ్రవరిలో విచ్చుకునే పారిజాతం, వేసవిలో ఆకట్టుకునే రేల (గోల్డెన్ షవర్), అశోక, మోదుగ వంటి సుగంధభరిత పుష్పాలను నాటనున్నారు.
- వీటితోపాటు భారీ వృక్షజాతులు రావి, మర్రి, జువ్వి అలాగే పండ్ల మొక్కలు నేరేడు, ఉసిరి, తాని, టేకు చెట్లు. సర్వగంధ, తులసి, తిప్పతీగ, శతావరి వంటి ఔషధ మొక్కలను నాటనున్నారు.
శ్రీవారి క్షేత్రంలోనూ భారీ మార్పులు: అడవిలోనే కాకుండా టీటీడీ ఆధీనంలోని శ్రీవారి క్షేత్ర పరిధిలో (4 చ.కి.మీ.)నూ భారీ మార్పులు రానున్నాయి. మల్లె, శంఖుపుష్పం వంటి తీగజాతి మొక్కలను కాటేజీలు, రోడ్ల వెంట నాటి వర్టికల్ గార్డెన్స్‌ను తీర్చిదిద్దుతారు. ఆళ్వార్ తీర్థం, నవగ్రహ వనాలను పవిత్ర వనాలుగా పునరుద్ధరించనున్నారు. తిరుమలలో ప్రస్తుతం ప్రతి సంవత్సరం 10,019 టన్నులుగా కర్బన ఉద్గారాల నియంత్రణ సామర్థ్యం ఉండగా 2035 నాటికి 13,500 టన్నులకు పెరుగుతుందని అంచనా.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం: సీఎం చంద్రబాబు సూచనలతో దీనికి నిధులు మంజూరుచేసి, టీటీడీ బోర్డులో తీర్మానించాం. స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతో దివ్యౌషధ వనాన్ని ఏర్పాటుచేస్తున్నాం. ఈ వనాన్ని ప్రత్యేక థీమ్‌తో నిర్మిస్తున్నందున దీనికోసం అటవీ, ఉద్యాన విభాగాలు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ఏరియా, అవగాహన కేంద్రం వైవిధ్యంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభించి, 2026లోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్‌నాయుడు తెలిపారు.
శేషాచలంలో కలివి కోడి - 'ఈ పక్షిని కనిపెట్టిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం!'
విభిన్న చారలు, పాక్షిక కనురెప్పలు - శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి

