శ్రీవారి భక్తులకు మరో శుభవార్త - 'శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్'తో బ్రేక్ దర్శనాలు
రూ.లక్ష విరాళంతో ఐదుగురు దర్శనం చేసుకునే అవకాశం - భక్తులకు వసతి, 5 లడ్డూలు అందజేత - శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్లకు విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో భక్తులు వీటికి ప్రయత్నించొచ్చు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 1, 2026 at 2:46 PM IST
TTD Introduced SV Apanna Hrudaya Scheme For VIP Break Tickets : శ్రీవాణి ట్రస్టు దాతలు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నట్లే, టీటీడీ నిర్వహిస్తున్న మరో పథకమూ అలాంటి భాగ్యమే కల్పిస్తోంది. అదే ‘శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్’. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు అనుబంధంగా ఉన్న ఈ పథకం 2022లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ స్కీమ్ కింద భక్తులు తిరుమలలోని ఆదిశేషు అతిథిగృహంలోని కార్యాలయంలో విరాళం అందజేస్తే మర్నాడు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనానికి ముందే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
రూ.లక్ష విరాళంతో ఐదుగురు దర్శనం చేసుకోవచ్చు. వసతి, 5 లడ్డూలు ఇస్తారు. రూ.కోటి విరాళం ఇస్తున్న భక్తులకు ఎలాగూ ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇస్తున్నారు. అంతకంటే తక్కువ ఇచ్చే భక్తులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ‘ఆపన్న హృదయ స్కీమ్’ను పెట్టారు. వేసవిలో శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో భక్తులు వీటికి ప్రయత్నించొచ్చు.
మరోవైపు విజయవాడ విమానాశ్రయ కేంద్రంగా తిరుమల శ్రీవారి శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్ల విక్రయాల జారీకి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం టీటీడీ రోజుకు 1500 శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్లను జారీ చేస్తోంది. ఇందులో ఆన్‌లైన్ ద్వారా 500 టికెట్లు, ఆఫ్‌లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా 800 టికెట్లు, తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లను భక్తులకు అందిస్తోంది.
టీటీడీ కీలక నిర్ణయం: రేణిగుంట విమానాశ్రయంలో రోజూ ఉదయం జారీ చేసే 200 టికెట్లను హైదరాబాద్ నుంచి మొదటి విమానంలో వచ్చే భక్తులు కొద్ది నిమిషాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో తర్వాత విమానాల్లో వచ్చే వందలాది మంది భక్తులు శ్రీవాణి దర్శన టికెట్లు దొరక్క తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది.
మరింత సులభతరం శ్రీవారి దర్శనం : విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రోజుకు 100 శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని టీటీడీ యోచిస్తోంది. దీనివల్ల అమరావతి, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తిరుపతి వచ్చే భక్తులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆమోదం పొందిన వెంటనే విజయవాడలో శ్రీవాణి టికెట్ల కౌంటర్ ప్రారంభించనున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం మరింత సులభతరం కానుంది.
ఇదిలా ఉండగా మరోవైపు శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల అభివృద్ధికి టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు దిశానిర్ధేశం చేసిన సంగతి తెలిసిందే.
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు - ఇప్పటికే 463కి అనుమతులు
దళితవాడల్లో 1000 ఆలయాలు నిర్మాణం - టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

