ETV Bharat / state

భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్ - నడక మార్గంలో నాలుగు కాళ్ల నిఘా

భక్తుల భద్రతపై టీటీడీ దృష్టి - ప్రయోగాత్మకంగా నాలుగు కాళ్ల 'రోబో డాగ్' వినియోగం - అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఏర్పాటు చేయడంపై ఫోకస్

Robot Dog in Tirumala Devotees
భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 2:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

Robot Dog in Tirumala Devotees : "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ఈ చరాచర సృష్టిలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసునికి సాటిరాగల దేవుడు భూత, భవిష్యత్ కాలాల్లో మరొకరు ఉండరని" ఈ శ్లోకానికి అర్థం. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠగా ప్రసిద్ధి కెక్కింది. తిరుమల గిరిపై సాలగ్రామ శిలగా, అర్చావతార మూర్తిగా, స్వయంభువుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిశాడు. అందుకే ఆయణ్ని ఏడు కొండలవాడని, గోవిందుడని, బాలాజీ అని రకరకాల పేర్లతో భక్తులు పిలుస్తారు.

తిరుమల గురించి ఎన్నో ఆధ్యాత్మిక, పురాణ చరిత్రలున్నాయి. నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతూ నిలయం ఎన్నో అద్భుతాలకు నిలయంగా మారింది. అందుకే ప్రతిరోజు స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది వస్తుంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తిరుమల పరిసర ప్రాంతాలలో భక్తులను వన్యప్రాణులు బెంబేలెత్తిస్తున్నాయి. అలిపిరి-తిరుమల నడకమార్గంలో వీటి సంచారం పెరిగింది. అంతేకాక అప్పుడప్పుడు భక్తులపై దాడులకు కూడా పాల్పడుతున్నాయి.

TTD Focus on Devotees Safety : ఈ క్రమంలోనే భక్తుల భద్రతపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలిపిరి నడకమార్గంలో గతంలో జరిగిన ఘటనలను సమగ్రంగా విశ్లేషించి భవిష్యత్​లో పునరావృతం కాకుండా ప్రణాళికలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు అత్యాధునిక సాంకేతికతో భద్రతకు భరోసా కల్పించే నాలుగు కాళ్ల 'రోబో డాగ్‌'ను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది.

రోబో డాగ్ పనితీరు విధానం :

  • చెన్నైకి చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ రోబో డాగ్​ను రూపొందించింది.దీని విలువ ఒక్కొక్కటి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది.
  • ఈ రోబోట్‌లో ఆప్టికల్‌ కెమెరా, థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఏఐ తదితర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి.
  • చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించవచ్చు. మెట్లు, రాళ్లు, గుట్టలు ఉన్న దారుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా చాలా సులభంగా పయనించగలదు.
  • ఇందులోని ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
  • వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో-ట్యాగ్‌డ్‌ అలర్ట్‌ను పంపడంతోపాటు లైవ్‌ వీడియో, థర్మల్‌ ఫీడ్‌ను కంట్రోల్‌ రూమ్, పెట్రోలింగ్‌ సిబ్బందికి అందిస్తుంది.
  • అలిపిరి-తిరుమల కాలిబాటను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సమాచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేస్తుంది.
  • వన్యప్రాణులు భక్తులుండే ప్రాంతంవైపు వచ్చినప్పుడు రోబోట్‌లోని సౌండ్, లైట్‌ యూనిట్లను ఉపయోగించి ఎలాంటి భౌతిక తాకిడి లేకుండా వాటిని తిరిగి అటవీప్రాంతం వైపు మళ్లిస్తుంది.

త్వరలో అత్యవసర స్పందన బృందాల ఏర్పాటు : మరోవైపు వన్యప్రాణుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఏడో మైలు వద్దనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అత్యవసర స్పందన బృందాల (ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌)ను ఏర్పాటు చేయనునుంది. ఈ బృందాలు టీటీడీ, అటవీశాఖ, విజిలెన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్యశాఖ ఇలా సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తూ పర్యవేక్షణ, సమాచార మార్పిడి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ఈ పనిచేస్తాయి. వీరికి ఆధునిక పరికరాలు, వాహనాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు సమకూర్చుతారు. బ్రహ్మోత్సవాల అనంతరం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు - ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

'కదిలే టేబుళ్లు' - తిరుమల భక్తులకు క్యూలైన్లలో అన్నప్రసాదాల వితరణకు సరికొత్త విధానం