ETV Bharat / state

తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం - మార్మోగిన గోవింద నామస్మరణ

తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం - మూలవిరాట్టుకు ప్రాతఃకాల కైంకర్యాల తర్వాత సుదర్శన చక్రస్నానం - సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేకం - శుభముహూర్తంలో పుష్కరిణిలో చక్రస్నానం

Chakra Snanam Ceremony in TTD
Chakra Snanam Ceremony in TTD (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 31, 2025 at 2:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chakra Snanam Ceremony in TTD : తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది.‌ తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతఃకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. పల్లకిలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య శుభముహూర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని మూడుసార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుమలలో వైభవంగా చక్రస్నాన మహోత్సవం - మార్మోగిన గోవింద నామస్మరణ (ETV)

తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం : మరోవైపు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. పది రోజుల పాటు కొనసాగే ఈ దర్శన భాగ్యం మంగళవారం గోవిందనామ స్మరణల మధ్య ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు టీటీడీ అధికారులు, అర్చకులు శ్రీవారి ఆలయం తెరచి, మూలమూర్తికి ధనుర్మాస కైంకర్యాలు పూర్తిచేశారు. అనంతరం వీవీఐపీలు, వీఐపీలకు వైకుంఠ ద్వారం మీదుగా దర్శనాలు ప్రారంభించారు. ఉదయం 7.20 గంటలకు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ పర్వదినం సందర్భంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివార్లకు రథరంగ డోలోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు, భక్తులు రథాన్ని లాగారు.

మంత్రముగ్ధులౌతున్న భక్తులు : శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల వ్యాప్తంగా ప్రత్యేక అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆలయ మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులు దివ్యానుభూతికి లోనవుతున్నారు. తూర్పు మాడవీధిలో శ్రీరంగనాథస్వామి ఆలయ నమూనా అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు పర్యవేక్షణలో దాత సహకారంతో దీన్ని ముస్తాబు చేశారు.

భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు : ప్రధాన ఆలయం, బయట క్యూలైన్లలో పరిస్థితిని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి నిరంతరం పరిశీలించారు. మీడియాతో బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ ‘గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భక్తులకు ఏ ఇబ్బందులూ తలెత్తకుండా అద్భుత ఏర్పాట్లు చేశాం. కట్టుదిట్టమైన పర్యవేక్షణ నడుమ భక్తకోటి స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చామని ఈవో సింఘాల్‌ తెలిపారు. వీఐపీలకు దాదాపు 4,750 టికెట్లు జారీ చేశామని చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-డిప్‌ విధానం విజయవంతమైందని హర్షం ప్రకటించారు.

స్వామిని దర్శించుకున్న ప్రముఖులు : వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ బ్రేక్‌ సమయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌ యాదవ్, నిమ్మల రామానాయుడు, సవితలు పాల్గొన్నారు.

అలాగే తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, సినీనటులు రాజేంద్రప్రసాద్, నారా రోహిత్, శ్రీలీల, సినీ నిర్మాత బండ్ల గణేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, తెలంగాణ నేతలు స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. అదేవిధంగా భారత క్రికెటర్లు తిలక్‌వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్నారు. వ్యాపారవేత్త చాముండేశ్వరనాథ్‌ తదితరులు ఉన్నారు.

టీటీడీ కీలక నిర్ణయం - అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌

తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం - భక్తులకు శ్రీవారు అభయప్రదానం