టీటీడీకి హెరిటేజ్ ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా హెరిటేజ్‌కు సంబంధం లేదన్న టీటీడీ చైర్మన్ - అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేయాలని వైఎస్సార్సీపీ చూస్తోందని వెల్లడి - వైఎస్సార్సీపీ విమర్శలపై స్పందించిన బి.ఆర్.నాయుడు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 5:04 PM IST
TTD Chairman BR Naidu Response On Heritage Ghee Issue : కల్తీ నెయ్యి కేసులో వైఎస్సార్సీపీ పీకల్లోతు కూరుకుపోయిందని, హెరిటేజ్ కంపెనీపై వారు చేసే ఆరోపణలు దురుద్దేశపూర్వకమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేస్తోందన్న వైఎస్సార్సీపీ విమర్శలపై ఆయన స్పందించారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేదని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు.
అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బొత్స సత్యనారాయణ బాధ్యతాయుతంగా మాట్లాడాలని బీఆర్ నాయుడు సూచించారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్‌ను నెయ్యిగా చూపి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఓపెన్ టెండర్ల ద్వారా నెయ్యి ధరలు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ లేదని తక్కువ ధరలకు నాణ్యత లేని సరుకులు కొనమని స్పష్టం చేశారు. నెయ్యి సహా అన్ని పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంపు చేశామని స్వామి వారి నైవేద్యాల్లో ఖర్చుకు లెక్కలు వేయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శించారు.
అందుకే ప్రభుత్వం చర్చకు రావడం లేదు : ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. మండలి వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స తిరుమల ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదన్నారు. ఇందాపూర్ సంస్థతో హెరిటేజ్ సంబంధాలు బయటపడతాయనే ప్రభుత్వం చర్చకు రావడం లేదన్నారు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు : మరోవైపు వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. న్యాయవాది మల్లికార్జున్‌రావు హెరిటేజ్ సంస్థ తరపున నోటీసులు పంపించారు. అసత్య ఆరోపణలతో హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. హెరిటేజ్ సంస్థపై చేసిన దుష్ప్రచారంపై సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ప్రీమియం బ్రాండ్‌గా హెరిటేజ్ గుర్తింపు పొందిందని న్యాయవాది మల్లికార్జున్‌రావు తెలిపారు.
హెరిటేజ్ ప్రతిష్టకు భంగం కలిగేలా బొత్స ఆరోపణలు చేశారన్నారు. ఇందాపూర్ డెయిరీతో సంబంధం లేకున్నా హెరిటేజ్‌పై దుష్ప్రచారం చేశారని తెలిపారు. 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ అయ్యిందంటూ నిరాధార ఆరోపణలు చేశారని న్యాయవాది గుర్తుచేశారు. హెరిటేజ్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా బొత్స వ్యాఖ్యలు చేశారన్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పి బొత్స వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి కోరారు. లేకుంటే వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది మల్లికార్డున్రావు తెలిపారు.
ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేసి హంగామా : శాసనమండలి వరుసగా మూడోరోజూ, ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ-హెరిటేజ్ సంబంధాలపై చర్చించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు అందుకోవడంతో మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ప్రతిరోజూ ఒకే అంశంపై వాయిదా తీర్మానం తెచ్చి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆధారాల్లేకుండా సంబంధంలేని అంశాలను సభలో ప్రస్తావించడం సరికాదన్నారు.
ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయెల్, మొండితోక అరుణ్ కుమార్ ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేసి హంగామా సృష్టించారు. మండలిలో విజిల్స్ వేయడం, పెద్దల సభ ప్రతిష్ఠను దెబ్బతీయడమేనని అధికార పార్టీ సభ్యులు మండిపడుతున్నారు. సభలోకి విజిల్స్ ఎలా తెచ్చారనే అంశంపై అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు.
సాక్షిలో అసత్యాలు - జగన్, భారతి తిరుమలలో ప్రసాదం తిని మాట్లాడాలి: బీఆర్ నాయుడు
లడ్డూ తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు - జంతువుల కొవ్వు లేదని నిర్ధరణ కాలేదు: బీఆర్ నాయుడు

