ETV Bharat / state

విశాఖలో 'త్రిశూల్' - ఉగాది నాటికి పూర్తి !

కైలాసగిరి'పై మరో నూతన ఆకర్షణ - త్రిశూలం ప్రాజెక్టు కోసం రూ. 2.50 కోట్లు - త్రిశూలం 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు - ఉగాది నాటికి పూర్తి చేసేలా ఏర్పాట్లు

Trishul Project on Kailashgiri
Trishul Project on Kailashgiri (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 5:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

Trishul Project on Kailashgiri in Visakha : పర్యాటకంలో సిరుల వర్షాన్ని కురిపిస్తున్న 'కైలాసగిరి'పై మరో నూతన ఆకర్షణను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పర్యటకుల మనసు దోచేలా కైలాసగిరిపై మరో ప్రాజెక్టు రానుంది. అయితే, ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, స్కై సైక్లింగ్, రోప్​ వే, జిప్​లైనర్​లు పర్యాటకుల మదిని విశేషంగా దోచుకుంటున్నాయి. దీంతో ఏర్పాటు చేయనున్న త్రిశూల్ ప్రాజెక్టు కూడా చూపరులకు ఆసక్తి కలిగిస్తోంది. మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ శివరాత్రి వరకు ఈ ప్రాజెక్టు పనులు తొందర పూర్తి చేయడానికి ప్రణాళికలు చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సమయానికి పూర్తి కాలేదు. కానీ, ఉగాది నాటికి వేగవంతంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా : ప్రకృతి వైపరీత్యాలైన తుపాను, భూకంపాలను దృష్టిలో పెట్టుకొని ఈ త్రిశూల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌తో అధ్యయనం చేసి ఎంత ఎత్తులో నిర్మించాలో పరిశీలన చేశారు. ప్రారంభంలో 55 అడుగుల్లోనే త్రిశూల్​ను నిర్మించాలని అనుకున్నారు. కానీ తర్వాత దానిని 65 అడుగులకు పెంచారు. ఇందులో ఒక్క ఢమరుకం ఎత్తే 10 అడుగులు, వెడల్పు 18 అడుగులుగా ఉంది.

ఇక త్రిశూల్ విషయానికి వస్తే : త్రిశూలం 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో తయారు చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆకారాలను పుణెలో తయారు చేయించారు. ఈ ఆకృతులు ప్రస్తుతం విశాఖ పట్టణంలో ఉన్నాయి. కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ నగర ప్రజలకు కనిపించే విధంగా త్రిశూలం లోపల ఎల్​ఈడీ లైట్లను పెడుతున్నారు. దాంతోపాటు చుట్టూ 30 అడుగుల విస్తీర్ణంలో వేదికను నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఈ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదు. కానీ పర్యటకుల సౌకర్యం కోసం సెల్పీలు తీసుకోవడానికి, కూర్చోవడానికి అనువుగా ఉండే విధంగా నిర్మాణం కూడా చేస్తున్నారు.

'కైలాసగిరిని సందర్శించే వారికి వీలుగా పలు రకాల ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాం. శివపార్వతుల విగ్రహాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. భారీగా త్రిశూలాన్ని నిర్మిస్తే బాగుంటుందనిపించింది. దీంతో పర్యాటకులు సేదతీరేలా ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దీనిని ఉగాది వరకు పూర్తి చేసి, పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేలా సన్నహాలు చేస్తున్నాం'. - ప్రణవ్‌గోపాల్, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌

ఈ ప్రాజెక్టు ఎలా ఉందంటే : త్రిశూలం ప్రాజెక్టు కోసం రూ. 2.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్రిశూల్ ఎత్తు మొత్తం 65 అడుగులు, చుట్టుకొలత 3 అడుగులు ఉంది. దీని నిర్మాణం కోసం భూకంపాలు, తుపానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణగా ఫైబర్​ రీఇన్ ఫోర్స్​డ్ ప్లాస్టిక్​ మెటీరియల్ వాడుతున్నారు. త్రిశూలం ప్రాజెక్టుపై 30 అడుగుల వెడల్పున్న పీఠాన్ని నిర్మిస్తున్నారు. సూదురంలో ఉన్న విశాఖ నగర ప్రజలకు కూడా త్రిశూలం కనిపించాలనే ఆలోచనతో వంద ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఏర్పాటు కానున్న కొత్త రోప్​వే : కొత్త రోప్​వే తెన్నేటిపార్క్ నుంచి ప్రారంభమై, కైలాసగిరి కొండ మీదుగా ప్రయాణిస్తూ తెలుగు మ్యూజియం వద్దకు చేరుకోవడంతో ముగుస్తుంది. తిరిగి అక్కడి నుంచి కిందికి చేరుకోవచ్చు. కిలోమీటరున్నర మేర నిర్మించనున్న ఈ కొత్త మార్గంలో 4 స్టేషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. పర్యాటకులు వారికి నచ్చిన చోట ఎక్కడైనా దిగొచ్చు. అలాగే నచ్చిన చోట ఎక్కడైనా మళ్లీ ప్రారంభం అవ్వొచ్చు. ప్రతి రోప్‌వే స్టేషన్లో 2 లిఫ్టులు, వెయిటింగ్ రూమ్, ఫుడ్‌ స్టాల్, ఫొటో స్టాల్, నీటి సదుపాయం ఉంటుంది. తెన్నేటిపార్క్‌ వద్ద 90 కార్లు, 100 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తారు.

దేశంలోనే పొడవైన గాజు వంతెన - విశాఖలో డిసెంబర్​ 1న ప్రారంభం

విశాఖలో కొత్త రోప్​వే - ఎన్ని కిలోమీటర్లు, స్టేషన్లు అంటే!