ETV Bharat / state

గిరిజన విద్యార్థుల అకాల మరణాలు - కొరవడిన సమగ్ర అధ్యయనం - 25 రోజుల్లోనే నలుగురు మృతి

గిరిజన విద్యార్థుల్లో చిన్న అనారోగ్య సమస్యలతో బయటపడి మరణాల వరకు దారితీస్తున్న వైనం - లక్షణాలు వెలుగుచూసిన కొద్ది రోజుల్లోనే కొందరు మృతి - కొన్నేళ్లుగా గిరిజన పాఠశాలల్లో తరచూ జరుగుతున్న ఘటనలు

Tribal_Students_Deaths
Tribal_Students_Deaths (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2026 at 2:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tribal Students Die from Minor Health Issues: గిరిజన విద్యార్థుల్లో కడుపునొప్పి, తలనొప్పి, గొంతునొప్పి, ఆయాసం, శరీరం ఉబ్బడం తదితర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బయటపడి అవి మరణాల వరకు వెళ్తున్నాయి. కొన్నేళ్లుగా గిరిజన పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వారికి సరైన వైద్యం అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం. 2022 నుంచి ఇప్పటివరకు ఇలా 100 మంది మృతి చెందారు. ఒక్క 2023-24లోనే 61 మంది చనిపోయారు. గతంలో ఇలాంటి మరణాల్ని గుర్తించే వ్యవస్థ సరిగా ఉండేది కాదు. ఇటీవల దీనిని పక్కాగా నమోదు చేస్తున్నారు. చాలా ఘటనల్లో వారి మృతికి కారణాలు విశ్లేషిస్తే గుండె, కిడ్నీ వ్యాధులు, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలతో మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంకా జన్యుపరమైన సమస్యలూ ఉన్నాయి.

గిరిజన విద్యార్థుల అకాల మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక అధ్యయనం చేయించడానికి మంగళగిరి ఎయిమ్స్‌ను సంప్రదించింది. జన్యుపరమైన సమస్యలతోనే వారు ఇలా మృతి చెందుతున్నారని వైద్యులు ప్రాథమికంగా తెలిపారు. దీనికి సమగ్ర పరీక్షలు అవసరమని చెప్తున్నారు. ఇందుకు నలుగురు వైద్యులను కేటాయించారు. పైలట్‌ ప్రాజెక్టు అధ్యయనానికి రూ.2 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. కానీ ఈ మొత్తాన్ని వెచ్చించేందుకు గిరిజన సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖ ముందుకు రాకుండా నిధుల కోసం కేంద్రానికి నివేదించాయి. దీంతో జాప్యం జరుగుతోంది.

దీర్ఘకాలిక వ్యాధులకు స్క్రీనింగ్‌ లోపం: ఈ గిరిజన బిడ్డలను పోషకాహారలోపం, రక్తహీనత, అంటువ్యాధులు వేధిస్తున్నాయి. వారికి సోకే జన్యువ్యాధులపై సరైన వివరాలు లేవు. దీర్ఘకాలిక వ్యాధులకు స్క్రీనింగ్‌ లోపముంది. సికిల్‌సెల్‌ ఎనీమియాను గుర్తించేందుకు చేస్తున్న పరీక్షల్లోనూ ఒక వేరియంట్‌నే గుర్తిస్తున్నారు. ఇంకో ప్రమాదకర వేరియంట్‌ పరీక్షల్లో బయటపడట్లేదు. అలానే వీరికి జన్యు, రక్తసంబంధిత, గుండె, మెటబాలిక్‌ వ్యాధులను గుర్తించేందుకు అన్నిరకాల పరీక్షలు పక్కాగా చేయాలి.

అప్పటివరకు కొన్ని ఘటనల్లో వీరికి తీవ్రవ్యాధుల లక్షణాలేమీ కనిపించవు. ఉన్నట్లుండి బయటపడి, అంతలోనే చనిపోతున్నారు. గడిచిన 25 రోజుల్లో సెలవులకు ఇంటికి వెళ్లిన నలుగురు విద్యార్థులు ఇలానే మృతి చెందారు. ఒక అమ్మాయికి ఆయాసం, మరో అబ్బాయికి వాంతులు, ఇంకో పిల్లాడికి కడుపునొప్పి, మరో చిన్నారికి తలనొప్పి ఇవి వారిలో కనిపించిన లక్షణాలు. ఈ లక్షణాలు బయటపడ్డ తర్వాత వారు బతికింది 3 లేదా 4 రోజులే. 2024 నుంచి ఇప్పటివరకు కడుపు, తల, గొంతునొప్పితో మృతి చెందిన వారు 11 మంది, గుండెసమస్యతో ఏడుగురు, ఊపిరితిత్తుల సమస్యలతో ఐదుగురు, కామెర్లతో ఐదుగురు, జ్వరంతో 15 మంది ఉన్నారు.

ప్రతి ఒక్క విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు - అల్లూరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్​

అటవీ మార్గంలో రోజూ 7కి.మీ. సైకిల్​పై వెళ్లి చదువు- ఆ గ్రామంలో 10th పరీక్షలు ​రాస్తున్న తొలి విద్యార్థిని