లైంగిక ఆరోపణల కేసు - ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
శానిటైజర్ తాగి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం - ఉదయ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించిన బంధువులు - ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఉదయ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 20, 2026 at 11:38 AM IST
|Updated : July 20, 2026 at 12:57 PM IST
Uday Krishna Reddy Attempt End Life: జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీకి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో బంధువు ఇంటికి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇవాళ ఉదయం శానిటైజర్ తాగి బలవనర్మణానికి యత్నించాడు. గమనించిన బంధువులు అతడిని ఎస్ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు.
'ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఉదయ్ కృష్ణారెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆయన స్పృహలో లేరు, వెంటనే స్టమక్‌ను వాష్ చేశాం. ఆయన ఏదైనా విష పదార్థం తీసుకున్నారెమో అనే అనుమానంతో కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక ఆయన ఏం తీసుకున్నారన్నది తెలుస్తుంది. బీపీతోపాటు అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఆయన స్పృహలోకి రావడానికి మరో 24 గంటల సమయం పడుతుంది.' -రవిశంకర్, డాక్టర్
ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవి: ఉదయం తమ అన్నయ్య అపస్మారక స్థితిలో ఉన్నారని వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఉదయ్ ఏ తప్పూ చేయలేదని, ఆయనపై ప్రచారాలు అవాస్తవాలని అతడి సోదరుడు తెలుపుతున్నాడు. ఉదయ్‌ను నేషనల్ పోలీస్ అకాడమీ సస్పెండ్ చేయలేదని ఎక్స్‌ట్రాడినరీ లీవ్ (ఈవోఎల్) తీసుకుని ఇంటికి వచ్చారని వివరించారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఉదయ్ ముభావంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉదయ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి వచ్చారని, ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారని ఉదయ్ సోదరుడు పేర్కొన్నాడు. 'మా అన్నయ్యపై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి' అని ప్రణయ్ కృష్ణారెడ్డి అన్నారు.
అసలేం జరిగిదంటే : ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 2013లో కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు. 2018 వరకు విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. నాలుగుసార్లు విఫలమైనా పట్టుదలతో ఐదోసారి 360 ర్యాంకుతో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ అకాడమీలోనే ఓ రాష్ట్రానికి చెందిన మహిళ కూడా ఐపీఎస్‌కు ఎంపికై ట్రైనింగ్‌లో ఉంది.
ఈ సంవత్సరం జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనకు వాట్సప్ నంబర్‌కి అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించసాగాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో మిత్రుల ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన పదాలతో అసభ్యకరంగా మాట్లాడంతో పాటు వేరే వారితో వివాహేతర సంబంధం అంటగట్టి ప్రచారం చేసి మనోవేదనకు గురి చేశాడన్నారు. అంతేకాక అసభ్యంగా ప్రవర్తిచండంతో పాటు వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి భర్తకు పంపి బెదిరింపులకు గురి చేశాడన్నారు.
ఈ క్రమంలో బాధితురాలు శనివారం రాత్రి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించాడు. అవన్నీ అవాస్తవమంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని న్యాయం గెలుస్తుందని తెలిపాడు. ఇంతలోనే ఇవాళ ఆత్మహత్యాయత్నం చేశాడు.
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం - ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు

