మహిళా ఐపీఎస్‌పై వేధింపులు - తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ - ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై బుధవారం న్యాయస్థానం విచారణ - తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో అత్తాపూర్‌లో కేసు నమోదు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 21, 2026 at 8:52 PM IST
Trainee IPS Officer Uday Krishna Reddy Case Update : తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
తనను ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా వేధిస్తున్నాడంటూ తోటి మహిళా ఐపీఎస్ అధికారిణి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో, ఈ కేసును రద్దు (క్వాష్) చేయాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టు మెట్లు ఎక్కారు.
వేధింపుల పర్వం ఇలా : ఉదయ్ కృష్ణారెడ్డి తీరుపై బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. ఈ ఏడాది జూన్ 23వ తేదీ నుంచి అతడు తనను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడని ఆమె పేర్కొన్నారు. తనకు పదే పదే అసభ్యకరమైన సందేశాలు పంపుతూ మానసిక క్షోభకు గురిచేశాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా, వేరే వారితో తనకు వివాహేతర సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశాడని వాపోయారు.
రహస్యంగా వీడియోలు తీసి : తన పట్ల ఉదయ్ కృష్ణారెడ్డి అమానుషంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్ ఆరోపించారు. తన చేతిలో నుంచి బలవంతంగా మొబైల్ ఫోన్ లాక్కున్నాడని చెప్పారు. అందులోని వ్యక్తిగత మెసేజ్‌లు చూసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని ఫిర్యాదులో వివరించారు. అంతేకాకుండా, తన వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలను తన భర్తకు పంపి, బ్లాక్‌మెయిల్ చేస్తూ తీవ్ర స్థాయికి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు.
లైంగిక ఆరోపణల కేసు - ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
'ఏడాదిగా ఆమెతో సన్నిహితంగా ఉన్నా' - ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్‌కృష్ణారెడ్డి లేఖ

