విజయనగరం జిల్లాలో విషాదం - పిడుగుపాటుకు ముగ్గురు మహిళా కూలీలు మృతి
పిడుగుపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి - పొలం పనులు చేసుకుంటుండగా వర్షం రావడంతో చెట్టు కిందకు చేరిన మహిళలు - చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2026 at 10:27 PM IST
Three Woman Labour Died Due To Lightning In Vizianagaram District: విజయనగరం జిల్లా గడ్డవలసలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. పొలం పనులు చేసుకుంటుండగా వర్షం రావడంతో మహిళలు చెట్టు కిందకు చేరుకోగా చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రోజూ తమతో పనిచేసే తమ తోటి కూలీలు మృతి చెందడంతో స్థానిక కూలీలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
పిడుగుపాటుకు ముగ్గురు మహిళా కూలీలు మృతి: విజయనగరం జిల్లా, రాజాం మండలం, గెడ్డవలస గ్రామ సమీపంలో పిడుగు పడి ముగ్గురు మహిళా కూలీల మృతి చెందారు. పొలం పనులు చేసుకుంటుండగా వర్షం రావడంతో చెట్టు కిందకు మజ్జి సత్తెమ్మ, అప్పల నరసమ్మ పైల రాములనే మహిళలు అక్కడకు చేరారు. అయితే చెట్టుపై పిడుగు పడడంతో మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో మజ్జి సత్తెమ్మ మజ్జి అప్పల నరసమ్మలు తోటి కోడళ్లు కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వీరి ముగ్గురూ మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
నీటిమునిగిన ఆరబెట్టిన ధాన్యం: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఊహించని ఈదురుగాలులతో కూడిన వర్షంతో ధాన్యం, మొక్కజొన్న, మిరప రైతులు ఆందోళన చెందారు. ప్రధానంగా దేవరపల్లి మండలంలో దుద్దుకూరు, గౌరీపట్నం, కృష్ణం పాలెం,యర్నగూడెం, సూర్యనారాయణపురం, గోపాలపురం మండలంలోని పలు గ్రామాల్లో రహదారిపై, కళ్లేల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిమునిగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షానికి కొట్టుకుపోయింది. అలాగే మొక్కజొన్న, మిరప పంట తడిసింది. చేతికి వచ్చిన పంట నీటి పాలు అవ్వడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని కోరుతున్నారు.
అన్నదాతకు అపార నష్టం: వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో అకాల వర్షాలకు అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో వైఎస్సార్ కడప జిల్లాలోని రాజంపేట నందలూరు, అదే విధంగా తిరుపతి జిల్లాలోని పుల్లంపేట ప్రాంతంలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రాజంపేట మండలంలోని హస్తవరం, అకేపాడు, కారంపల్లి, చెర్లోపల్లి ప్రాంతంలో అరటి పంటకు నష్టం వాటిల్లింది. ఒక్క తిరుపతి జిల్లా పుల్లంపేట ప్రాంతంలోనే దాదాపు 250 ఎకరాల్లో అరటి నెలమట్టంమయ్యింది. పుల్లంపేట మండలంలోని అన్నసముద్రం, కేతరాజు పల్లి దొండ్లోపల్లి చెర్లోపల్లి ప్రాంతాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

