కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు - రోజుల వ్యవధిలోనే రేటు డబుల్
రోజురోజుకు పైపైకి వెళ్తున్న ఉల్లి ధరలు - కిలో రూ. 25 నుంచి రూ. 50 పెరిగిన ధరలు - అల్లం, వెల్లుల్లి ధరలు సైతం మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్న వైనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 22, 2026 at 7:25 PM IST
Onion Prices Rise Day By Day in AP : ఉల్లి లేనిదే కూర కుదరదు కానీ, ఆ ఉల్లిని కొనాలంటే ఇప్పుడు కుటుంబ బడ్జెట్ కుదరడం లేదు. రోజువారీ వంటకాల్లో అత్యంత కీలకమైన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ధరలు ఇప్పుడు మధ్యతరగతి గృహిణులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు చుక్కలనంటుతున్నాయి. అసలు మార్కెట్‌లో ఉల్లి ధరల పరిస్ధితి ఏంటి? కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ఈ కథనంలో చూద్దాం.
రోజురోజుకు పైపైకి వెళ్తున్న ఉల్లి ధరలు : కూర ఏదైనా ఉల్లిపాయ పడాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ఉల్లిపాయను ముట్టుకుంటేనే చేతులు కాలిపోతున్నాయి. మొన్నటి వరకు కిలో 25 రూపాయలు, నిన్నటి వరకు 30 రూపాయలు, ఈరోజు ఏకంగా 46 రూపాయలు. ఇలా ఉల్లి ధరలు రోజురోజుకూ పైపైకి వెళ్తున్నాయి. కేవలం ఉల్లి మాత్రమే కాదు అల్లం, వెల్లుల్లి కూడా పోటీపడి మరీ సామాన్యుడిపై దాడి చేస్తున్నాయి. ఎల్‌నినో దెబ్బ, కరువు, అస్తవ్యస్తమైన వర్షాలు పంటలను దారుణంగా దెబ్బతీశాయి. సరుకు కొందామంటే దొరకదు. తెచ్చిన సరుకు నిల్వ ఉంచితే కుళ్లిపోతుంది. రేటు పెంచితే కొనేవారు లేక వ్యాపారం మూలన పడుతోంది. అటు కొనేవాడికి భారం ఇటు అమ్మేవాడికి నష్టంతో ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది.
సతమతమవుతున్న వ్యాపారులు : మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణతో పాటు మన కర్నూలు, అనంతపురం నుంచి సరుకు వస్తున్నా రేట్లు మాత్రం చుక్కల్లోనే ఉంటున్నాయి. ప్రకృతి పగబట్టిందో, రవాణా చార్జీలు మండిపోతున్నాయో కానీ నాణ్యమైన ఉల్లి మార్కెట్‌కు రావడం గగనమైపోయింది. ధర పెరిగినా కొనుగోళ్లు దారుణంగా తగ్గుతున్నాయని అమ్మేవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉల్లి నిల్వ, నాణ్యత, సరఫరా, నిమిషానికో మారే ధరల మధ్య వ్యాపారాన్ని ఎలా కొనసాగించాలో తెలియక సతమతమవుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.
"చాలా ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం. ఉల్లి ధరలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ధరలు బాగా పెరిగాయి. దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు రెండు కేజీలు రూ.50లకే కొనుగోలు చేసి, ఇప్పుడు కేజీ రూ.50 అనేసరికి వెనకడుగు వేస్తున్నారు. దీంతో అర, పావు కేజీలను కొనుగోలు చేస్తున్నారు. రైతు బజార్లలో పొల్చితే బయట ఉల్లి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇది వరకు రోజుకు ఎనిమిది బస్తాలు అమ్మేవాళ్లం, ఇప్పుడు రెండు బస్తాలు కూడా అమ్ముడుపోవటం లేదు." - వ్యాపారులు, విజయవాడ
కూరల్లో లెక్కబెట్టి వేయాల్సిన పరిస్థితి : కిలో కొనాల్సిన చోట ఇప్పుడు పావుకిలోతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. నిన్నటివరకు గుప్పెడు వేసిన ఉల్లిపాయలను ఇప్పుడు కూరల్లో లెక్కబెట్టి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. రోజువారీ కిచెన్ బడ్జెట్ అడ్డంగా తలకిందులై నెలనెలా వచ్చే సంపాదనంతా కూరగాయలకే సరిపోతోందని సామాన్య, మధ్యతరగతి జనం ఆవేదన చెందుతున్నారు. ఉల్లి ధర పెరగడంతో అటు కొనే సామాన్యులకు ఇటు అమ్మే వ్యాపారులకు కష్టాలు తప్పడం లేదు. మార్కెట్‌లో ఊహించని విధంగా మారుతున్న ధరలు ఇప్పుడు ప్రతి ఒక్కరి వంటింటి బడ్జెట్‌నూ కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.
ఉల్లి పంటపై ఎల్‌నినో ఎఫెక్ట్ - కన్నీటితో సాగు చేస్తున్న రైతన్నలు
వేసవి తాపాన్ని తగ్గించే "ఉల్లి పెరుగు పచ్చడి" - అప్పటికప్పుడు కమ్మగా తయారు చేసుకోవచ్చు!

