ETV Bharat / state

ప్రాణాలు తీసిన వ్యాపారి అత్యాశ - బాణసంచా పేలుడు ఘటనలో 22 మంది మృతి

బహుమతులు ఆశ, ఆర్డర్లు రావాలని పని ఒత్తిడి - భోజనానికి వెళ్లిన వారు త్వరగా రావాలని ఆదేశాలు - లేకపోతే పని ఉండదని బెదిరింపులు

Fire Blast Incident At Vetlapalem Updates
Fire Blast Incident At Vetlapalem Updates (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 7:21 AM IST

3 Min Read
Choose ETV Bharat

Fire Blast Incident At Vetlapalem Updates: బాణసంచా పోటీల్లో నెగ్గితే పేరొస్తుంది, తయారీకి ఆర్డర్లు ఎక్కువ వస్తాయి. డబ్బులు బాగా సంపాదించొచ్చనే అన్న ఆ వ్యాపారి అత్యాశే వేట్లపాలెం పేలుడు ఘటనలో 22 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. భోజనానికి వెళ్లిన వారు త్వరగా రావాలని, లేదంటే పని ఉండదని నిర్వాహకుడు కూలీలను బెదిరించడంతో నాలుగు మెతుకులు తిని ఆగమేఘాలపై మళ్లీ పని మొదలుపెట్టిన కొద్దిసేపటికే భారీ పేలుడు జరిగింది. మందు గుండు కూర్పులో తేడా రావడం ఘటనా స్థలిలో ముడి సరుకు ఎక్కువగా నిల్వ చేయడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది.

వ్యాపారి అత్యాశతోనే భారీ పేలుడు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఉత్సవాలు, తీర్థాలు, పండుగల్లో బాణసంచా పోటాపోటీగా కాలుస్తుంటారు. మందు గుండు బాగా కాలితే తయారు చేసిన వారికి బహుమతులు ఇస్తుంటారు. ఆ పేరిట చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆర్డర్లు పెరుగుతుంటాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్, అతని సోదరుడు వీరబాబు కూడా ఇలాంటి పేరు కోసం ఆరాటపడి భారీ పేలుడుకు కారణమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గతేడాది సొంతూరులో జరిగిన బేతాళ స్వామి ఉత్సవాల బాణసంచా పోటీల్లో వీరే నెగ్గారు. ఎప్పటిలాగే అత్తవారి గ్రామం గోకవరం మండలం సింగారమ్మ చింత జాతరలోనూ బాణసంచాతో పోటీపడాలనుకున్నారు. గత పోటీలు కంటే పేలుడు తీవ్రత బాగా పెంచేలా నారబాంబులు తయారు చేశారు. భారీగా ఆర్డర్ రావడం, జాతర సమయం దగ్గర పడడంతో...తయారీలో జోరు పెంచారు. టపాసులో మందుగుండు దట్టింపులో అంచనా తప్పి భారీ పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

నిబంధనల అతిక్రమణ: సూర్య శ్రీ ఫైర్‌ వర్క్స్ కు 15 కిలోల బాణసంచా ముడి పదార్థాలతో తయారీకే అనుమతి ఉంది. కానీ అక్కడ వంద కేజీలకుపైగా మందుగుండు తయారీ సామగ్రి ఉంది. మరో 500 కేజీలకు పైగా ఇతర రసాయనాలున్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనా స్థలంలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. కిలోమీటరు దూరం ఉన్న ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకూ భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.

"పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు పంటకాల్వల్లో చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఓ మహిళ పుర్రె పేలిపోయింది. ఇంకొకరు శవమై 50 మీటర్ల దూరంలోని పంట కాల్వలో పడ్డారు. ఒక్కో మృతదేహాన్ని తీస్తుంటే కాళ్లు ఒక చోట, చేతులు ఒక చోట ఉన్నాయి. ఇంత పెద్ద భారీ పేలుడు ఎప్పుడూ చూడలేదు"-స్థానికులు

బాణసంచా తయారీ కేంద్రంలో ఎనిమిది మందితోనే పనిచేయడానికి అనుమతి ఉంది. కానీ రోజుకు 30 నుంచి 40 మందితో బాణసంచా తయారు చేయిస్తున్నారు. జాతర ఆర్డర్ ఎక్కువ రావడంతో ఘటన జరగడానికి ముందు 4 రోజులుగా 50 మందికి పైగా కార్మికులతో పనిచేయిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కూర్చొని తయారు చేయాల్సిన షెడ్లో 6 నుంచి 8 మంది పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో వీరు బయట పడకపోవడానికి ఇదొక కారణమని పోలీసులు భావిస్తున్నారు.

కారణాలపై ఫోరెన్సిక్ పరిశోధన: పేలుడు తీవ్రత భారీగా పెరగడానికి గల కారణాలు ఫోరెన్సిక్ పరిశోధనలోనే వెలుగుచూసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాంతీయ ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలి నుంచి నమూనాలను సేకరించారు. ఈ సంస్థకు ముడి సరుకును అమ్మే ఏజెన్సీల నుంచి సైతం సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారు.

అసలేం జరిగిందంటే? కాకినాడ జిల్లా వేట్లపాలెంలో కొన్నేళ్లుగా సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ పేరిట బాణాసంచా తయారీ సాగుతోంది. రోజూలాగే కార్మికులు టపాసులు తయారీలో నిమగ్నం అయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద మొత్తంలో టపాసులు నిల్వ ఉండడంతో విస్ఫోటం ఆగలేదు. కార్మికులు బయటకు రాలేక కాలిపోయారు. 10 మంది పురుషులు, 10 మంది స్త్రీలు సజీవ దహనం అయ్యారు. కొందరివి కాళ్లుంటే చేతులు లేవు, చేతులుంటే కాళ్లు లేవు. కొన్ని శరీరభాగాలే మిగిలాయి. పెను విస్ఫోటం నుంచి 10 మంది గాయాలతో బయటపడ్డారు.

బాణసంచా విస్ఫోటనం - మృతుల కుటుంబాల్లో పెనువిషాదం

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 21కి చేరిన మృతుల సంఖ్య