ఓ వైపు ఆకలి కేకలు - మరోవైపు టన్నుల కొద్దీ వెస్టేజ్! - ఎక్కడో తెలుసా?
Tonnes of food wasted : భాగ్యనగరంలో ఆహార వృథా ఆందోళన కలిగిస్తోంది. రోజు సేకరించే మొత్తం చెత్తలో దాదాపు 44-55 శాతం వరకు ఆహార వ్యర్థాలు, ఆకుకూరలు, కూరగాయలు ఉంటుండటం గమనార్హం.

Published : October 13, 2026 at 4:44 PM IST
Tonnes of Food Wasted in Hyderabad : ఎవరు ఏ పని చేయాలన్నా తగినంత శక్తి కావాలి. అందుకోసం ఆహారం అవసరం. ఎంతోమంది గుప్పెడు మెతుకులు లేక అల్లాడుతున్నారు. మరోవైపు పెద్దమొత్తంలో ఆహారం చెత్తబుట్టలోకి వెళ్తుంది. అదే పరిస్థితి ఇప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యనగరంలో ఆహార వృథా ఆందోళన కలిగిస్తోంది. గృహాలు, హాస్టళ్లు, హోటళ్లలో ఉత్పత్తవుతున్న ఆహార పదార్థాల వృథా ఆరేళ్లుగా జరిగిన అధికారిక అధ్యయనాలు, సర్వేలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
- మహానగరంలో సేకరిస్తున్న ఘన వ్యర్థాలపై 2023 ఏప్రిల్‌లో జరిగిన సమగ్ర పరిశోధన ప్రకారం నగరంలో ఒక వ్యక్తి రోజుకు సగటున 0.57 నుంచి 0.62 కిలో వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇది జాతీయ పట్టణ సగటు కంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌లో రోజు సేకరించే మొత్తం చెత్తలో దాదాపు 44 - 55 శాతం వరకు కేవలం తడి చెత్తే ( ఆహార వ్యర్థాలు, ఆకుకూరలు, కూరగాయలు) ఉంటుండటం గమనార్హం.
- నగరంలో గృహాల స్థాయిలో 2021 మేలో జరిగిన మొదటి అధ్యయనంలో భాగంగా 132 కుటుంబాలపై సర్వే నిర్వహించారు. కుటుంబ ఆదాయం, సరైన పరిమాణం లేక ఆహారం ఎలా వృథా అవుతుందో ఇందులో విశ్లేషించారు. అనంతరం 2025 జులైలో రెండోసారి జరిగిన అధ్యయనంలో ఆహార వృథాకు ప్రధాన కేంద్రాలు మన ఇళ్లేనని తెలిసింది.
ఇక్కడే అధికంగా ఆహారం వృథా
హైదరాబాద్‌లోని సుమారు 30 ప్రముఖ రెస్టారెంట్లు, 30 హాస్టళ్లను ఎంపిక చేసుకొని ఈ ఏడాది సెప్టెంబర్‌లో సమగ్ర క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహంచారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రమాణాల ఆధారంగా వాణిజ్య సంస్థల వృథాను దీనిలో విశ్లేషించారు. వినియోగదారుల ప్రవర్తన, ప్లేట్లలో ఆహారాన్ని సగం వదిలేసే అలవాట్లు, అలాగే వంటశాలలో సమర్ధ నిర్వహణ లోపించడం వల్ల ఇక్కడ భారీగా వృథా అవుతోందని గుర్తించారు. మిగిలిపోయిన ఆహారాన్ని పారేయకుండా, ఆకలితో ఉన్నవారికి మళ్లించే వ్యవస్థలు ఈ సంస్థల్లో లోపించాయని ఈ అధ్యయనం తేలింది.
ప్రధాన కారణాలు ఇవే!
- అంచనా లేకపోవడం : వంట చేసే సమయంలో కుటుంబ సభ్యుల పరిమాణాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడమే ప్రధాన కారణం
- అనవసర కొనుగోళ్లు : అవసరానికి మించి మార్కెట్లలో ఆహార పదార్థాలను, కూరగాయలను కొనుగోలు చేయడం
- నిల్వ లోపాలు : ఫ్రిజ్‌లో ఆహారాన్ని సరిగ్గా సర్దకపోవడం వల్ల అవి త్వరగా పాడై చెత్తకుప్పల్లోకి వెళ్తున్నాయి
- అవగాహన లేకపోవడం : ఆహార వృథా వల్ల జరిగే ఆర్థిక నష్టంపై, పర్యావరణంపై పడే ప్రభావంపై నగరంలోని మెజారిటీ కుటుంబాలకు సరైన అవగాహన లేమి
మరి పరిష్కారం ఇదేనా!
హైదరాబాద్‌ను ఆహార వృథా లేని నగరంగా మార్చాలంటే, మార్పు మన ఇళ్ల నుంచే ప్రారంభం కావాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తడి-పొడి చెత్తను ఇంట్లోనే వేరు చేయడం, అవసరమైనంత వరకే వండుకోవడం, మిగిలిన ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి చేర్చే స్వచ్ఛంద సంస్థలకు అందించాలని ఈ ఆధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

