ETV Bharat / state

హోలీ వేడుకల్లోకి కొత్త సరుకు - కలర్స్​కు బదులు వీటిని వాడండి - ఫుల్​ మజా!

కెమికల్ కలర్స్​పై జనాల్లో పెరుగుతున్న అవగాహన - రంగులకు బదులు టమాటాలు వాడాలంటూ ప్రచారం - రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం

HOLI CELEBRATIONS
HOLI 2026 (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2026 at 10:18 AM IST

3 Min Read
Choose ETV Bharat

Holi Celebrations In Telangana : హోలీ పండుగ వేడుకల్లో రసాయన రంగులు వాడొద్దనే అవగాహన ప్రజల్లో క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రోడ్ల వెంట తోపుడు బండ్లపై వివిధ రంగుల పొడులు, చిన్నారుల మెడలో వేసే కుడకలు, తీయని చిలుకల దండలతో పాటు టమాటలను రాశులుగా పోసి చిరు వ్యాపారులు విక్రయిస్తున్నారు. హోలీలో రంగులకు బదులుగా ఎర్రని టమాటాలను వాడొచ్చంటూ రూ.100కు 5 కిలోల చొప్పున విక్రయిస్తున్నట్లు కొంతమంది తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌- చిక్కడపల్లి రోడ్డులో తోపుడు బండిపై టమాటాలు అమ్ముతున్న దృశ్యం కనిపించింది.

నేడు పాఠశాలలకు హోలీ సెలవు : హోలీ పండుగకు మంగళవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించినందున పాఠశాలలకు కూడా ఈరోజు సెలవు ఉంటుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ సోమవారం పేర్కొన్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం హోలీ పండగ సెలవును 4న పేర్కొన్నామని, ఆ తర్వాత ప్రభుత్వం 3వ తేదీని సెలవు దినంగా ప్రకటించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సెలవు దినాల ప్రకారమే రంజాన్, శ్రీరామనవమి కూడా ఉంటాయని అన్నారు.

గవర్నర్ శుభాకాంక్షలు : హోలీ పండుగ ప్రజల మధ్య సోదరభావం, ఐక్యత పెంపొందిస్తుందని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలకు ఈ పండగ మంచి గుర్తుగా నిలుస్తుందని అన్నారు. ఈ మేరకు సోమవారం గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పండగ సామాజిక సంబంధాలను బలంగా చేస్తుందని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటి చెబుతుందని అన్నారు. గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రేమ, ఆప్యాయతలకు హరివిల్లు : హోలీ పండుగ ప్రేమ, ఆప్యాయత, సంతోషాలకు హరివిల్లుగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండగ అని, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే సుదినమన్నారు. ప్రజలంతా సహజసిద్ధమైన రంగులు, సంప్రదాయ పద్ధతులతో హోలీ జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

హోలీ పేరుతో సైబర్‌ మోసాలు : హోలీ పండుగ ఆఫర్ల పేరుతో సైబర్‌ కేటుగాళ్లు పాల్పడుతున్న మోసాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (సీసీబీ) డైరెక్టర్‌ శిఖాగోయల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగను పురస్కరించుకొని రంగులు, బహుమతుల కొనుగోళ్లపై భారీ రాయితీలు ఇస్తున్నామని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీలకు పాసులు ఇస్తామని, ఆన్‌లైన్లో ఫుడ్, మిఠాయిలు సరఫరా చేస్తామని చెబుతూ వాట్సప్, మెసేజ్​, ఈ-మెయిళ్ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఎరవేస్తున్నారని అప్రమత్తం చేశారు.

ఖాతాలో ఉన్న నగదు ఖాళీ : ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి నకిలీ ఈ-కామర్స్‌ సైట్లకు సంబంధించి లింకులు కూడా పంపుతున్నారని, పొరపాటున వీటిని తెరిస్తే ఫోన్లో ఉన్న సమాచారంతోపాటు బ్యాంకు ఖాతాల వివరాలన్నీ నేరగాళ్లకు తెలిసిపోవడమే కాకుండా అందులో ఉన్న నగదు మొత్తం ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, లింకులు అస్సలు తెరవద్దని ఆమె సూచించారు. మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు.

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, మార్చి 3 ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్లు మూసివేయాలని చెప్పారు. ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూయకూడదని చెప్పారు. అందరితో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు.

హోలీ ఆడుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే జుట్టు, కళ్లు, స్కిన్​ సేఫ్!

యాదాద్రి దివ్యక్షేత్రంలో కామ దహనం - రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు