టమాట ధర మళ్లీ కుదేలు - గిట్టుబాటు కావడం లేదని ఉచితంగా తీసుకుపొమ్మంటున్న రైతులు!
హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.5 పలుకుతున్న టమాట - అప్పు చేసి పెట్టుబడి పెడితే కన్నీరే మిగిలిందంటున్న రైతులు - ప్రభుత్వమే తమను ఆదుకోవాటంటున్న రైతన్నలు

Published : March 3, 2026 at 5:24 PM IST
Tomato Farmers On Supportive Price : టమాట మరోసారి రైతులను ముంచేసింది. ఒక్కోసారి కిలో రూ.100కు చేరి రైతులను కోటీశ్వరులను చేసిన ఈ పండే ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. కిలో రూ.5 పడిపోయి అన్నదాతలకు ముట్టెడు నష్టాన్ని మిగిల్చింది. స్టాక్ మార్కెట్ క్రాష్లా ధర ఒక్కసారిగా పతనమవడంతో పంట చేతికొచ్చిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లడం కూడా వృధా అని కొన్ని చోట్ల పశువులకు ఆహారంగా వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల తోటలకే పరిమితం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో వాటిని ఇప్పుడు తీర్చే దారెలా అని వాపోతున్నారు.
హోల్‌సేల్ మార్కెట్లో కిలో ధర కేవలం రూ.5 కూడా పడటం లేదు. మరికొన్నిచోట్ల ధర గిట్టుబాటు కావడం లేదని తిరిగి తీసుకెళ్లలేక చాలామంది రైతులు అక్కడే వదిలేస్తున్నారు. ఇంతా కష్టపడితే కనీసం కూలీల ఖర్చులు కూడా రావడం లేదని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. సంగారెడ్డి జిల్లా చేర్యాల మండలంలోని టమాట రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కన్నీరే మిగుల్చుతోంది : పంట వేసే ముందు లాభాలు వస్తాయని ఆశించడం, తీరా పంట చేతికొచ్చాక మార్కెట్లో మద్ధతు ధర లేక విలవిలలాడిపోవడం పరిపాటిగా మారిందని సత్తయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని రకాల వస్తువులకు సరైన ధర నిర్ణయిస్తుంది కానీ రైతులు పండించిన పంటకు మాత్రం కచ్చితమైన ధరను కేటాయించదన్నారు. మార్కెట్లో నెలకొంటున్న పరిస్థితులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే కర్షకులకు కన్నీరే మిగుల్చుతోందని సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఎకరానికి సుమారు రూ.30వేలకు పైన పెట్టుబడి : టమాట సాగు గాలివాటంలా సాగే సాగు కాదు. ఒక ఎకరం టమాటా సాగు చేయాలంటే మూడు నుంచి నాలుగు సార్లు దుక్కి దున్నాల్సి ఉంటుది. మొక్కల వేర్లను ఆశించే చీడ పీడల నివారణకు అవసరమైన గుళికలు దుక్కిలో కలపాలి. పంట సరైన కాపు కాసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. దీని కోసం పలు రకాల పురుగు మందులతో పాటు పోషకాలను పిచికారి చేయాల్సి ఉంటుంది. పంట కలుపుతీత, కోతకు కావాల్సిన కూలీలు ఇలా అంతా కలిపి ఎకరాకు దాదాపు రూ.30 నుంచి 32 వేలు ఖర్చవుతుంది. అయితే, పంట ఉత్పత్తి, ధర బాగుంటే ఒక కాపులోనే పెట్టిన పెట్టుబడి చేతికొస్తుంది. కానీ ప్రస్తుతం ఐదు సార్లు కాపులైనా దుక్కి దున్నినందుకు ట్రాక్టర్ ఖర్చులు కూడా రావడం లేదని టమాట రైతు సత్తయ్య వాపోతున్నారు.
"ఎన్నో ఆశలతో అప్పు చేసి మరీ పంటను పండించాక నష్టం వాటిల్లడం ఒక రకంగా రైతును కుంగదీస్తే, గిట్టుబాట ధర లేకపోవడం మరింత దిగులు పుట్టిస్తుంది. ఇలాంటి పరిస్థితులే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతాయి. ఏడాది మొత్తం కష్టపడితే అంతంత మాత్రంగా వచ్చే ఆదాయం పిల్లల పోషణకే సరిపోతుంది. ఇక ఈ విధంగా పూర్తిగా ధరలు లేని సందర్భాల్లో తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వం టమాటకు సరైన మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. అలాగే పెట్టుబడికి అండగా ఉండే రైతు భరోసాను విడదల చేయాలి. సబ్సిడీ కింద పనిముట్లను అందజేయాలి" - సత్తయ్య, రైతు, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా
ప్రభుత్వం ఆదుకోవాలి : పంటను పసిపిల్లల్లా చూసుకుంటేనే సరైన దిగుబడినిస్తుందని సత్తయ్య చెబుతున్నారు. చంటి బిడ్డను పెంచి పెద్దయ్యాక తీరా ప్రయోజకులు కాకపోతే ఎంత బాధపడతామో, ఆరుగాలం శ్రమించి పండించిన పంట ద్వారా కూడా చివరికి ఆశించిన ఫలితం దక్కకపోతే రైతు కూడా అంతే క్షోభ పడతాడని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి ఎకరానికి రూ. 30 వేలకు పైగా పెట్టుబడి, పంట చేతికందే వరకు తమ శ్రమ అంతా వృథాగా మారిందన్నారు.
అమ్మబోతే అడవి - కొనబోతే కొరివి : పసుపు రైతులను నట్టేట ముంచుతున్న మార్కెట్ మాయాజాలం
హోలీ వేడుకల్లోకి కొత్త సరుకు - కలర్స్‌కు బదులు వీటిని వాడండి - ఫుల్ మజా!

